అనంతపురం అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘జన్మభూమి – మా ఊరు’ సభల్లో జనాగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యలు పరిష్కరిస్తామంటూ గొప్పగా ప్రకటించుకుంటున్న ప్రభుత్వానికి ప్రజల నుంచి నిరసనలు ఎదరవుతున్నాయి. జిల్లాలో శుక్రవారం జరిగిన జన్మభూమి గ్రామసభల్లో జనం సమస్యలపై అధికారులను నిలదీశారు. సమస్యలపై ప్రశ్నించిన ఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ ఎక్కడ
కూడేరు మండలం కొర్రకోడులో జన్మభూమి సభలో రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ, డ్వాక్రా రుణాలపై శాసనమండలి చీఫ్‌విప్ పయ్యావుల కేశవ్, అధికారులను రైతులు, గ్రామస్తులు నిలదీశారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ఎన్‌పీకుంట దనియాన్ చెరువులో జరిగిన జన్మభూమి గ్రామసభను రైతులు అడ్డుకున్నారు.
సమస్యలపై ప్రతిపక్షపార్టీ నాయకుల నిరసనలు
⇔ కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం పాళ్ళూరులో జరిగిన గ్రామసభలో వైఎస్సార్‌సీపీ నాయకుడు తిమ్మారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు రాంభూపాల్‌రెడ్డి అధికారులను నిలదీశారు. జన్మభూమిలో ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకుండా మరోసారి చెవిలో పువ్వులు పెట్టేందు వచ్చారా అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులకు పూలు అందజేసి నిరసన తెలపడంతో పోలీసులు వారిని సభనుంచి గెంటేశారు. దీంతో వారు రోడ్డపై బైఠాయించిన నిరసన తెలిపారు.
⇔ ప్రజాసమస్యలు పరిష్కరించలేదంటూ కుందుర్పి మండలం బెస్తరపల్లిలో జరిగిన సభలో వైఎస్సార్‌సీపీ నాయకులు రామదాసు, రవి, బీటీ రాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసులు, రాజేష్‌లు అధికారులను అడ్డుకున్నారు. సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు కాకుండా టీడీపీ కార్యకర్తలకే అందిస్తున్నారంటూ అధికారులతో వాదనకు దిగారు.
⇔ బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లిలో జరిగిన జన్మభూమి సభలో సమస్యలపై అధికారులను వైఎస్సాసీపీ మండల కన్వీనర్‌రామాంజినేయులు ప్రశ్నించారు. దీంతో అతన్ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాసమస్యలను చెప్పకోవడానికి అవకాశం ఇవ్వనప్పుడు జన్మభూమి నిర్వహించడం ఎందుకని నిలదీశారు.
సమస్యలపై నిలదీత
⇔ ఎన్నిసార్లు విన్నవించినా గ్రామంలో రోడ్లు నిర్మించలేదని, అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వలేదని, ఏ సమస్యలు పరిష్కరించలేదని గోరంట్ల మండలం బుదిలి గ్రామస్తులు మండిపడ్డారు. గ్రామంలో జరిగిన సభలో సమస్యలపై జాయింట్ కలెక్టర్‌ని గ్రామస్తులు నిలదీశారు.
⇔ మరుగొడ్లు నిర్మించుకోండంటూ ఒత్తిడి చేశారు. తీరా కట్టుకున్న తర్వాత బిల్లులు ఇవ్వలేదంటూ గుమ్మఘట్ట మండలం గలగల, కేపీ దొడ్డి గ్రామాల్లో జరిగిన జన్మభూమి సభల్లో లబ్ధిదారులు అధికారులను నిలదీశారు.
మిస్సమ్మ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి
అనంతపురం న్యూసిటీ: అభివృద్ధి పేరుతో పేద రైతుల లక్షల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుంటున్న సర్కార్... అన్యాక్రాంతమైన ఏడెకరాల మిస్సమ్మ స్థలాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని వామపక్ష పార్టీ నేతలు ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, అల్లీపీరా, వెంకటనారాయణ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూపను నిలదీశారు. గురువారం 20వ డివిజన్‌లో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి సభను వామపక్ష పార్టీ నేతలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పదేళ్లుగా పోరాడుతున్నా అన్యాక్రాంతమైన మిస్సమ్మ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం లేదన్నారు. ఆ స్థలాన్ని కబ్జా చేసిన బీఎన్‌ఆర్ సోదరులు టీడీపీలో చేరాక, ఇక స్వాధీనం చేసుకుంటుందన్న నమ్మకం కూడా లేకుండా పోయిందన్నారు. ఎమ్మెల్యే, మేయర్ పేదల పక్షాన నిలబడాలనీ, అవసరమైతే రాజీనామా చేసి తాము చేసే పోరాటంలో భాగస్వామ్యులు కావాలన్నారు. అప్పుడు వారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారన్నారు. మరుగుదొడ్లు నిర్మించకపోవడంతో మహిళలు బహిర్భూమికి చెంబు పట్టుకుని కంప చెట్ల వెళ్లే దౌర్భాగ్య పరిస్థితి నెలకొందన్నారు.
అరాచకాలు చేస్తే సహించం
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఠా రాజకీయాలు చేస్తున్నారనీ, పోలీసులపై నోరుపారేసుకుంటున్నా పోలీసులు వంగి వంగి సలాంలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఎక్కడి నుంచో వచ్చి నగరంలో దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదని వామపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment