loan viewer
-
కుటుంబ ‘రుణాలు’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, సినీ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా.. వీరంతా తల్లి, కొడుకు, కూతురు తదితర కుటుంబసభ్యులకు బాకీ ఉన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న వీరంతా కుటుంబ సభ్యులకు బకాయి ఉన్నట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు. రాహుల్ తన తల్లి సోనియా నుంచి అప్పు తీసుకోగా, ములాయం కొడుకు అఖిలేశ్ నుంచి, శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా నుంచి రుణం తీసుకున్నట్లు వెల్లడించారు. రాహుల్‌కు రూ.5 లక్షల అప్పు యూపీలోని అమేథీ నుంచి, కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తన తల్లి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ నుంచి రూ.5 లక్షలను అప్పు రూపంలో తీసుకున్నట్లు అఫిడవిట్లో తెలిపారు. ఇది తప్ప ఇతర అప్పులేవీ లేవని తెలిపారు. సోనియా మాత్రం ఎవరి వద్దా రుణం తీసుకోలేదని పేర్కొన్నారు. యూపీలోని మైన్‌పురి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ తన కుమారుడు, మాజీ సీఎం అఖిలేశ్ నుంచి రూ.2.13 కోట్లు రుణం తీసుకున్నట్లు వెల్లడించారు. రెండో భార్య సాధనా యాదవ్‌కు రూ.6.75 లక్షలు, కొడుకు ప్రతీక్‌కు రూ.43.7 లక్షలు, కుటుంబ సభ్యురాలు మృదులా యాదవ్‌కు రూ.9.8 లక్షలు అప్పు ఇచ్చినట్లు ములాయం తెలిపారు. కూతురి నుంచి రూ.10 కోట్ల అప్పు పట్నా సాహిబ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా తన కూతురు, సినీ నటి అయిన సోనాక్షి సిన్హాకి రూ.10.6 కోట్లు బకాయి ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే, తన కుమారుడు లవ్ సిన్హాకు రూ.10 లక్షలు, భార్య పూనమ్ తదితరులకు రూ.80 లక్షల మేర అప్పుగా ఇచ్చినట్లు తెలిపారు. యూపీలో లక్నో నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న పూనమ్ సిన్హా తన కూతురు సోనాక్షి నుంచి రూ.16 కోట్లు అప్పు తీసుకున్నట్లు తెలిపారు. ఆమె ప్రధాన ప్రత్యర్థి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎటువంటి రుణం లేదని వెల్లడించారు. శత్రుఘ్న సిన్హా ప్రత్యర్థి, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎటువంటి బకాయిలు లేవని తెలిపారు. బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు, ఆర్జేడీ తరఫున పాటలీపుత్రలో బరిలో ఉన్న మిసా భారతి వ్యక్తిగత రుణాలు లేవని, తన భర్త శైలేష్ కుమార్‌కు మాత్రం రూ.9.85 లక్షల బ్యాంకు లోన్ ఉందని పేర్కొన్నారు. రుణాలు, అడ్వాన్సుల రూపంలో తాను రూ.28 లక్షలు, తన భర్త రూ.2.9 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. బీజేపీకి చెందిన ఆమె ప్రత్యర్థి రామ్‌కృపాల్ రూ.17.17 లక్షలు‡ తన కూతురి కోసం విద్యారుణం తీసుకున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగిగా పేర్కొన్న కన్హయ్యకుమార్ బిహార్‌కు చెందిన మరో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తనకు రూ.5.86 లక్షలు, తన భార్యకు రూ.26.5 లక్షలు రుణం ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తనకు రూ.75 లక్షలు, తన భార్యకు రూ.15 లక్షల ఆస్తిపాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈయన ప్రత్యర్థిగా ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ బ్యాంకు అకౌంటు లేదని, నిరుద్యోగినని తెలిపారు. చండీగఢ్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిని కిరణ్ ఖేర్ తన కుమారుడి నుంచి రూ.25 లక్షలు తీసుకున్నట్లు, భర్త, ప్రముఖ సినీ నటుడు అయిన అనుపమ్ ఖేర్‌కు రూ.35 లక్షలను రుణంగా ఇచ్చినట్లు చెప్పుకున్నారు. దక్షిణ ముంబై నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ డియోరా తన భార్య పూజాకు బదులు రూపంలో రూ.4.96 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. -
సాగు సంక్షోభానికి సరైన జవాబు
వ్యవసాయరంగాన్ని సమూలంగా మార్చివేసే దిశగా మన రాజకీయ నాయకత్వం అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాలోకి ఏటా రూ. 6 వేలను బదలాయిస్తూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. దేశీయ వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభం దిశగా పయనిస్తోందని గుర్తించినందువల్లనే కేంద్రం పీఎమ్–కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశచరిత్రలో తొలిసారిగా వ్యవసాయరంగంలో ‘ధరల విధానం’ నుంచి ‘ఆదాయ విధానం’ వైపు పయనించడానికి కేంద్రం మొదటి అడుగు వేసిందని ఈ పరిణామం తేల్చి చెబుతోంది. ఇది మన ఆర్థిక చింతనలో సమూలమార్పునకు సంకేతం. దీనికి పోటీగా రాహుల్ గాంధీ సంవత్సరానికి రూ. 72,000లను రైతుల ఖాతాలకు బదలాయిస్తానని హామీ ఇవ్వడం.. రాజకీయ నాయకత్వం ఆలోచనల్లో పెను మార్పునకు సంకేతాలే. సార్వత్రిక ఎన్నికల నియమావళి అమలులోకి రావడానికి కొద్ది రోజుల ముందుగా దేశవ్యాప్తంగా సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి సంవత్సరానికి రూ. 6 వేలను ప్రత్యక్షంగా బదలాయిస్తూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎమ్–కిసాన్) పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. ఇది కనీస మొత్తమే అయినప్పటికీ దేశంలో వ్యవసాయ సంక్షోభం ఎంత తీవ్రస్థాయిలో ఉంటోందో పాలకవర్గాలే గుర్తించి అంగీకరించిన వాస్తవానికి ఇది ప్రతీక అయింది. అయిదేళ్లు పూర్తి అధికారం చలాయించిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని వాగ్దానం చేసింది కానీ వాస్తవానికి రైతుల ఆదాయం ఇప్పుడు గత 15 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత అధమస్థాయికి దిగజారిపోయింది. ఈ నేపథ్యంలోనే రైతులకు జీవితంపై కాసింత ఆశలు కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నాటకీయ విధానాన్ని ముందుకు తీసుకురావలసి వచ్చింది. 2016 తర్వాత వ్యవసాయరంగ ఆదాయం పెరుగుదల దాదాపుగా జీరో స్థాయిలోనే ఉండిపోయిందని నీతి ఆయోగ్ స్వయంగా అంగీకరించింది. 2011 నుంచి 2016 వరకు ఐదేళ్ల కాలంలో రైతుల నిజమైన ఆదాయం సంవత్సరానికి అర్ధశాతం కంటే తక్కువగానే పెరుగుతూవచ్చిందని (0.44 శాతం) నీతి ఆయోగ్ ప్రకటించింది. వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభం దిశగా పయనిస్తోందని, రైతులకు ప్రత్యక్ష నగదు రూపేణా మద్దతు అవసరమని గుర్తించినందువల్లనే కేంద్ర ప్రభుత్వం ఇలా ఆకస్మికంగా పీఎమ్–కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధంగా దేశచరిత్రలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ధరల విధానం నుంచి ఆదాయ విధానం వైపు పయనించడానికి మొదటి అడుగు వేసిం దని ఈ పరిణామం తేల్చి చెబుతోంది. నా అభిప్రాయం ప్రకారం, ఇది మన ఆర్థిక చింతనలో సమూల మార్పుకు స్పష్టమైన సంకేతం. పీఎమ్–కిసాన్ పథకంలో భాగంగా ప్రభుత్వం గుర్తించిన మేరకు దేశంలోని సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాలకు తొలివిడతగా 2 వేల రూపాయలను బదలాయించారు. దీనికి తక్షణ ప్రతిస్పందనగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ‘న్యాయ్’ ఆదాయ పథకం అమలు చేస్తామని ప్రతి నెలా దేశంలోని రైతులకు ఒక్కొక్కరికి రూ. 6,000లను నగదురూపేణా బదిలీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ దఫా ఎన్నికల్లో తమను గెలిపిస్తే దేశంలోని 20 శాతంమంది అత్యంత నిరుపేదల ఖాతాల్లోకి నెలకు 6 వేల రూపాయలను నేరుగా బదిలీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వాగ్దానం చేశారు. అంటే తీవ్ర దారి ద్య్రంలో కొట్టుమిట్టాడుతున్న కోట్లాదిమంది సన్నకారు రైతులను తమ దుస్థితినుంచి బయటపడేయాలంటే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అత్యవసరంగా చేపట్టాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించినట్లయింది. ఈ సందర్భంగా దేశంలోని 17 రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 20,000లకు మించలేదని, నెలవారీగా చూస్తే ఇది రూ. 1,700 కంటే తక్కువేనని 2016 ఆర్థిక సర్వే పేర్కొన్న విషయాన్ని మనం తప్పక గుర్తుంచుకోవాలి. వ్యవసాయ రంగం ఇప్పటికీ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో అత్యంత దిగువస్థాయిలో పడి ఉంటోంది. నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయరంగ ఆదాయాలు ద్రవ్యోల్బణాన్ని సవరించిన తర్వాత చూస్తే దాదాపు స్తబ్దతకు గురై ఉంటున్నాయి. రైతులు తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర కూడా పొందడంలేదు. ప్రభుత్వం ప్రకటించే ధరలకంటే మార్కెట్ ధరలు మరీ తక్కువగా ఉండటం గమనార్హం. 2000–2017 సంవత్సరాల మధ్య ఓఈసీడీ–ఐసీఆర్ఐఈఆర్ సంస్థలు జరిపిన సంయుక్త అధ్యయనం ప్రకారం ధరల పతనం కారణంగా దేశ రైతులు రూ. 45 లక్షల కోట్లను నష్టపోయారని తెలుస్తోంది. దేశంలోని ఏ ఇతర రంగమైనా ఇంత భారీ నష్టానికి గురై ఉంటే కుప్పగూలిపోయేది. గ్రామీణ రంగ దుస్థితి ఎంత పరాకాష్టకు చేరిందంటే రైతుల ఆత్మహత్యలు నిరంతరం కొనసాగుతూ వార్తలకెక్కుతున్నాయి. ఈ వాస్తవాన్ని దేశప్రజలకు తెలుపడానికి కూడా భీతిల్లుతున్న కేంద్రప్రభుత్వం గత రెండేళ్లుగా రైతుల ఆత్మహత్యలకు చెందిన డేటాను కూడా విడుదల చేయకుండా నిలిపి ఉంచడం గర్హనీయం. పుల్వామాలో మన సైనికుల కాన్వాయ్‌పై దాడి తర్వాత మన భుజబలాన్ని ప్రదర్శించే తరహా జాతీయవాదం గురించి రాజకీయ నేతల ఊకదంపుడు ఉపన్యాసాల వెల్లువలో దేశీయ వ్యవసాయరంగ దుస్థితి సమస్య పక్కకు పోయి ఉండవచ్చు కానీ త్వరలో కేంద్రంలో అధికారంలోకి రాబోయే ప్రభుత్వం ఎదుర్కోనున్న అతిపెద్ద సవాలు ఏదంటే కొనసాగుతున్న గ్రామీణ దుస్థితికి చెందిన సంక్లిష్ట సమస్యను పరిష్కరించడమే. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా రైతుల నిరసన ప్రదర్శనలు పెరుగుతుండటం చూస్తున్నప్పుడు, నూతన ప్రధానమంత్రికి వ్యవసాయ సమస్యను ఇక వాయిదా వేయడం ఆసాధ్యమే అనిపిస్తోంది. ప్రత్యక్ష నగదు బదలాయింపుతోపాటు వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయటానికి అనేక స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను నూతన ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. నా అభిప్రాయం ప్రకారం కొత్త ప్రధాని దృష్టి పెట్టవలసిన, చేపట్టాల్సిన దశలు ఇవి. 1. రైతుల ఆదాయం, సంక్షేమంపై కమిషన్: ఈ కమిషన్ వ్యవసాయ ధరలపై కృషి చేయాలి. వ్యవసాయరంగానికి ఆదాయం కల్పించే ప్యాకేజీకి హామీ ఇవ్వాలి. ప్రస్తుతం ఉనికిలో ఉన్న వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ను తనలో కలిపేసుకుని, రైతు కుటుంబానికి నెలకు కనీసం రూ. 18,000 ఆదా యం వచ్చే ప్యాకేజీని అమలుపర్చాలి. జిల్లాలో రైతుకుటుంబం నెలకు సంపాదించే సగటు ఆదాయానికి ఈ ఆదాయ ప్యాకేజీ అదనపు సహాయంగా జతకూర్చాలి. దీనికి సంబంధించిన డేటా సిద్ధంగా ఉంది కాబట్టి జిల్లాలో సగటు వ్యవసాయదారుడి ఆదాయాన్ని నిర్ణయించడం పెద్ద కష్టమేమీ కాదు. 2. రైతు రుణాల మాఫీ: రైతురుణాలను ఒకే దఫాలో మాఫీ చేయడాన్ని తక్షణ ప్రాతిపదికగా అమలు చేయాలి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు 2017 నుంచి 1.9 లక్షల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేసేశాయి. వ్యవసాయరంగంలో రైతులు చెల్లించలేకపోతున్న మొండి రుణాలు దాదాపు రూ. 3.5 లక్షల కోట్లమేరకు ఉంటాయని అంచనా. ఈ మొత్తాన్ని రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం మాఫీ చేయాల్సి ఉంది. తమపై పేరుకుపోయిన గత రుణాల భారంనుంచి విముక్తి కానిదే రైతులు కొత్తగా ఉత్పాతక సామర్థ్యంతో ఉంటారని భావించకూడదు. ఈ కష్టకాలంలో రైతుల పక్షాన జాతి మొత్తం నిలబడాల్సిన అవసరం తప్పనిసరి. రైతు రుణ మాఫీ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక భారంగా పరిగణించరాదు. పైగా, కార్పొరేట్ రంగంపై ఉన్న రుణాలను మాఫీ చేస్తున్న విధానాన్ని బ్యాంకింగ్ రంగం రైతు రుణాల పట్ల కూడా అమలు చేయాల్సి ఉంది. కేంద్రప్రభుత్వం తనవంతుగా కార్పొరేట్ రంగ మొండిబకాయిల విషయంలో చేస్తున్నట్లుగానే రైతు రుణమాపీకి కూడా వీలిచ్చేలా బ్యాంకింగ్ రంగాన్ని ఆదేశించాలి. 3. ప్రభుత్వ రంగ పెట్టుబడులు: భారతీయ రిజర్వ్ బ్యాంకు డేటా ప్రకారం 2011–12, 2016–17 మధ్య వ్యవసాయరంగంపై ప్రభుత్వరంగం పెట్టిన మదుపు మొత్తం స్థూల దేశీయోత్పత్తి –జీడీపీ–లో 0.3 నుంచి 0.4 శాతం మాత్రమే ఉంటున్నట్లు తెలుస్తోంది. దీని ఫలితంగా వ్యవసాయరంగంపై ప్రైవేట్ రంగం మదుపు కూడా తక్కువగానే ఉంది. జనాభాలో దాదాపు 50 శాతం ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వ్యవసాయరంగంలో మునిగి తేలుతున్నందున, ప్రభుత్వ రంగ మదుపుల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంపై తక్షణం దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. దేశీయ వ్యవసాయ రంగం తగిన మదుపులను అందుకోకపోతే, వ్యవసాయం లాభదాయకమైన పరిశ్రమ అవుతుందని భావించడం అత్యాశే అవుతుంది. 4. సులభతర వ్యవసాయ పద్ధతులు: ప్రతి దశలోనూ రైతులు ఎదుర్కొంటున్న అడ్డంకుల కారణంగానే భారతీయ వ్యవసాయరంగం కునారిల్లిపోతోంది. పాలనా లేమి కారణంగా వ్యవసాయం బాధితురాలుగా మిగిలిపోతోంది. పరిశ్రమల రంగంలో సులభతర వాణిజ్యం కోసం దాదాపు 7,000 రకాల చర్యలను చేపడుతుండటం సాధ్యపడుతున్నప్పుడు, వ్యవసాయ రంగ కార్యకలాపాలకు ఇదేవిధమైన ప్రాధాన్యతను ఇవ్వకపోవడానికి తగిన కారణమేదీ నాకు కనిపించడం లేదు. జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో ప్రతిదశలోనూ వ్యవసాయరంగ పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా దీన్ని సుసాధ్యం చేయవచ్చు. ఇది వ్యవసాయాన్ని రైతు అనుకూలమైనదిగా మార్చడంలో ప్రారంభ చర్యలకు తావిస్తుంది. 5. ధరలు, మార్కెటింగ్ సంస్కరణలు: మార్కెట్ సంస్కరణలను తక్షణం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఏపీఎమ్‌సీ మండీల క్రమబద్ధీకరణ మార్కెట్ల నెట్వర్క్ని విస్తరించడం ద్వారా దీన్ని మొదలెట్టవచ్చు. ప్రతి అయిదు కిలోమీటర్ల పరిధిలో ఒకటి చొప్పున దేశంలో కనీసం 42,000 మండీలను ఏర్పర్చవలసి ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,600 వ్యవసాయ రంగ మండీలు మాత్రమే ఉంటున్నాయి. వ్యవసాయ మార్కెట్లలో రాజ్యమేలుతున్న సిండికేట్లను కుప్పగూల్చడం ద్వారా వ్యవసాయ మండీల ఏర్పాటులో సంస్కరణలను తప్పక చేపట్టాలి. అదే సమయంలో రైతులు పండించే ప్రతి పంటకూ కనీస మద్దతు ధరకు వీలు కల్పించే దిశలోనే ఎపీఎమ్సీ మండీల్లో సంస్కరణలు సాగాలి. వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com దేవిందర్ శర్మ -
పెల్లుబికిన జనాగ్రహం
అనంతపురం అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘జన్మభూమి – మా ఊరు’ సభల్లో జనాగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యలు పరిష్కరిస్తామంటూ గొప్పగా ప్రకటించుకుంటున్న ప్రభుత్వానికి ప్రజల నుంచి నిరసనలు ఎదరవుతున్నాయి. జిల్లాలో శుక్రవారం జరిగిన జన్మభూమి గ్రామసభల్లో జనం సమస్యలపై అధికారులను నిలదీశారు. సమస్యలపై ప్రశ్నించిన ఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ కూడేరు మండలం కొర్రకోడులో జన్మభూమి సభలో రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, డ్వాక్రా రుణాలపై శాసనమండలి చీఫ్‌విప్ పయ్యావుల కేశవ్, అధికారులను రైతులు, గ్రామస్తులు నిలదీశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ఎన్పీకుంట దనియాన్ చెరువులో జరిగిన జన్మభూమి గ్రామసభను రైతులు అడ్డుకున్నారు. సమస్యలపై ప్రతిపక్షపార్టీ నాయకుల నిరసనలు ⇔ కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం పాళ్ళూరులో జరిగిన గ్రామసభలో వైఎస్సార్సీపీ నాయకుడు తిమ్మారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు రాంభూపాల్‌రెడ్డి అధికారులను నిలదీశారు. జన్మభూమిలో ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకుండా మరోసారి చెవిలో పువ్వులు పెట్టేందు వచ్చారా అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులకు పూలు అందజేసి నిరసన తెలపడంతో పోలీసులు వారిని సభనుంచి గెంటేశారు. దీంతో వారు రోడ్డపై బైఠాయించిన నిరసన తెలిపారు. ⇔ ప్రజాసమస్యలు పరిష్కరించలేదంటూ కుందుర్పి మండలం బెస్తరపల్లిలో జరిగిన సభలో వైఎస్సార్సీపీ నాయకులు రామదాసు, రవి, బీటీ రాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసులు, రాజేష్‌లు అధికారులను అడ్డుకున్నారు. సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు కాకుండా టీడీపీ కార్యకర్తలకే అందిస్తున్నారంటూ అధికారులతో వాదనకు దిగారు. ⇔ బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లిలో జరిగిన జన్మభూమి సభలో సమస్యలపై అధికారులను వైఎస్సాసీపీ మండల కన్వీనర్రామాంజినేయులు ప్రశ్నించారు. దీంతో అతన్ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాసమస్యలను చెప్పకోవడానికి అవకాశం ఇవ్వనప్పుడు జన్మభూమి నిర్వహించడం ఎందుకని నిలదీశారు. సమస్యలపై నిలదీత ⇔ ఎన్నిసార్లు విన్నవించినా గ్రామంలో రోడ్లు నిర్మించలేదని, అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వలేదని, ఏ సమస్యలు పరిష్కరించలేదని గోరంట్ల మండలం బుదిలి గ్రామస్తులు మండిపడ్డారు. గ్రామంలో జరిగిన సభలో సమస్యలపై జాయింట్ కలెక్టర్‌ని గ్రామస్తులు నిలదీశారు. ⇔ మరుగొడ్లు నిర్మించుకోండంటూ ఒత్తిడి చేశారు. తీరా కట్టుకున్న తర్వాత బిల్లులు ఇవ్వలేదంటూ గుమ్మఘట్ట మండలం గలగల, కేపీ దొడ్డి గ్రామాల్లో జరిగిన జన్మభూమి సభల్లో లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. మిస్సమ్మ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి అనంతపురం న్యూసిటీ: అభివృద్ధి పేరుతో పేద రైతుల లక్షల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుంటున్న సర్కార్... అన్యాక్రాంతమైన ఏడెకరాల మిస్సమ్మ స్థలాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని వామపక్ష పార్టీ నేతలు ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, అల్లీపీరా, వెంకటనారాయణ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూపను నిలదీశారు. గురువారం 20వ డివిజన్లో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి సభను వామపక్ష పార్టీ నేతలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పదేళ్లుగా పోరాడుతున్నా అన్యాక్రాంతమైన మిస్సమ్మ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం లేదన్నారు. ఆ స్థలాన్ని కబ్జా చేసిన బీఎన్ఆర్ సోదరులు టీడీపీలో చేరాక, ఇక స్వాధీనం చేసుకుంటుందన్న నమ్మకం కూడా లేకుండా పోయిందన్నారు. ఎమ్మెల్యే, మేయర్ పేదల పక్షాన నిలబడాలనీ, అవసరమైతే రాజీనామా చేసి తాము చేసే పోరాటంలో భాగస్వామ్యులు కావాలన్నారు. అప్పుడు వారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారన్నారు. మరుగుదొడ్లు నిర్మించకపోవడంతో మహిళలు బహిర్భూమికి చెంబు పట్టుకుని కంప చెట్ల వెళ్లే దౌర్భాగ్య పరిస్థితి నెలకొందన్నారు. అరాచకాలు చేస్తే సహించం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఠా రాజకీయాలు చేస్తున్నారనీ, పోలీసులపై నోరుపారేసుకుంటున్నా పోలీసులు వంగి వంగి సలాంలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఎక్కడి నుంచో వచ్చి నగరంలో దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదని వామపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. -
రుణమాఫీ కాలేదని రైతు ఆత్మహత్య
వజ్రకరూర్ (అనంతపురం): రుణమాఫీ కాలేదని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం జయరామపురం గ్రామంలో గురువారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన తమెలా నాయక్ (60) తనకున్న ఐదెకరాల పొలం మీద తీసుకున్న రుణం మాఫీ కాలేదని మనస్తాపం చెంది రెండు రోజుల క్రితం విషం తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు నాయక్‌ను హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమెలా నాయక్ చికిత్సపొందుతూ గురువారం మరణించాడు. -
రెండో దశ రుణమాఫీకి రూ.2,375 కోట్లు
హైదరాబద్: రెండో దశ రైతు రుణ మాఫీ కోసం రూ. 2,375 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రైతు సాధికారిక సంస్థకు ఈ నిధులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల మొదట్లో సెక్యూరిటీల విక్రయం ద్వారా సమీకరించిన వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని.. రెండో దశ రుణ మాఫీ కోసం ఆర్థిక శాఖ అప్పట్లోనే రైతు సాధికారిక సంస్థకు ఇచ్చింది.