సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారత్ ఇటీవల పాక్‌లో చేపట్టిన వైమానిక దాడుల అంశం ప్రభావం చూపదని ఇండియా టుడే సర్వే స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఓటు వేసే వారిలో 21 శాతం మంది నిరుద్యోగం ప్రదాన అంశమని చెబుతుండగా, తాగునీరు అంశం ప్రధానమని 20 శాతం మంది ఓటర్లు పేర్కొన్నారు. ఇక మెరుగైన పారిశుధ్యం, ధరల పెరుగుదల ప్రభావం చూపుతాయని 9 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు.
ఇండియా టుడే పీఎస్‌ఈ సర్వే కోసం యాక్సిస్-మై-ఇండియా నిర్వహించిన పోల్‌లో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. మరోవైపు తాము ఓటు వేసే ముందు ఆయా రాజకీయ పార్టీల సామర్థ్యం పరిగణనలోకి తీసుకుంటామని 39 శాతం మంది ఓటర్లు వెల్లడించారు. ప్రధాని అభ్యర్ధి ఎవరనే ప్రాతిపదికపై ఓటు వేస్తామని కేవలం 16 శాతం మంది ఓటర్లు వెల్లడించారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఓటు వేసే వారు 13 వాతం కాగా, అభ్యర్ధుల ఆధారంగా ఓటు వేస్తామని 12 శాతం మంది ఓటర్లు తెలిపారు. జాతీయవాదం, ఎన్నికల ప్రణాళికలు, హామీల ఆధారంగా ఓటుపై నిర్ణయం తీసుకునే వారు కేవలం 1 శాతం కావడం గమనార్హం.
ప్రధానిగా మోదీ వైపే మొగ్గు
ఇక ప్రధానిగా నరేంద్ర మోదీవైపు అత్యధిక ఓటర్లు మొగ్గుచూపుతున్నారు. ఆయన జనాదరణ గత ఏడాది అక్టోబర్‌లో 46 శాతం నుంచి ఈ ఏడాది జనవరిలో 48 శాతానికి పెరగ్గా ఏప్రిల్‌లో 53 శాతానికి పెరిగిందని పీఎస్‌ఈ డేటా వెల్లడించింది. ఇక భావి ప్రధానిగా రాహుల్‌ను కోరుకునేవారు గత ఏడాది సెప్టెంబర్‌లో 32 శాతంగా ఉండగా, ఇప్పుడు 35 శాతానికి పెరిగింది. మరోవైపు మోదీ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నామని ఈ ఏడాది ఏప్రిల్‌లో 48 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 30 శాతం ఓటర్లు ఆయన పాలన పట్ల పెదవివిరిచారు.
52 శాతం ఓటర్లకు చేరువైన న్యాయ్
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించన కనీస ఆదాయ హామీ పధకం (న్యాయ్) ప్రకటించిన రెండు వారాల్లోనే దేశవ్యాప్తంగా 52 శాతం ఓటర్లకు చేరువైంది. నిరుపేద కుటుంబాలకు ఏటా రూ 72,000 నగదు సాయం అందిస్తామని కాంగ్రెస్ ఈ హామీని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ పధకాన్ని అమలు చేస్తుందని 32 శాతం ఓటర్లు విశ్వసించగా, 51 మంది ఓటర్లు దీనిపై నోరుమెదపలేదు.
ఇక 17 శాతం మంది న్యాయ్ అమలుపై ఏమీ చెప్పలేమని వ్యాఖ్యానించారు. ఈ పధకంపై కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకోగా కేవలం 28 శాతం ఓటర్ల నిర్ణయాన్నే ఇది ప్రభావితం చేస్తుందని, 53 శాతం ఓటర్లను ప్రభావితం చేయలేదని, 19 శాతం ఓటర్లు దీనిపై అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పోల్ పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, పలు వర్గాలకు చెందిన 1,75,544 మంది ఓటర్లను ఫోన్ ఇంటర్వ్యూలు చేపట్టడం ద్వారా పీఎస్‌ఈ పోల్ నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment