సాక్షి, హైదరాబాద్ : అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రిజర్వేషన్ల మూల సిద్ధాంతానికి విరుద్ధంగా ఉందన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలు రిజర్వేషన్లు అడగటం లేదని, వారిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్రయత్నించాలని సూచించారు.
పేదరిక నిర్మూలనకు రిజర్వేషన్లు ప్రాతిపదిక కాదన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఓపెన్ కేటగిలో వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం అనుమతించదు : ఓవైసీరి
ఈబీసీ రిజర్వేషన‍్లను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు. ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం అనుమతించదన్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు అనేక పథకాలు తేవొచ్చాని సూచించారు. దళితులకు సామాజిక న్యాయం కోసమే రిజర్వేషన్లు కల్పించారన్నారు. దేశంలో ఇప్పటి వరకు 49.5 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5శాతం, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు అవుతోంది. 10శాతం పెంపుతో మొత్తం రిజర్వేషన్లు 59.5 శాతంకు చేరనుంది.
Comments
Please login to add a commentAdd a comment