సాక్షి, పశ్చిమగోదావరి : తనపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయకముందే నర్సాపురం జనసేన అభ్యర్థి నాగబాబు ట్వీట్ చేయడం అనుమానాలకు తావిస్తోందని వైఎస్సార్‌సీపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఆదివారం ఆయన వైఎస్సార్‌సీపీ నేతలు, సినీ కళాకారులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. గురువారం తనపై కొందరు యువకులు దాడి చేశారని, ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయకముందే జనసైనికుల ముసుగులో ఇతర పార్టీల వారు కొందరు విధ‍్వంస చర్యలకు దిగుతున్నారని, జనసైనికులు అప్రమత్తంగా ఉండాలంటూ నాగబాబు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నాగబాబు ట్వీట్‌పై అనుమానాలు ఉన్నాయన్నారు. దాడి చేసింది ఏ పార్టీ వారైనా పోలీసులు పట్టుకోవాలని డిమాండ్ చేశారు. పవర్ స్టార్ ప్యాకేజీ స్టార్‌గా మారారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఎద్దేవా చేశారు. ప్యాకేజీల రాజకీయాలు వద్దని, పవన్ ప్రజలకు ఏం చేస్తారో చెప్పి ఓట్లు అడుక్కోవాలన్నారు. పశ్చిమ గోదావరి ప్రజలు శాంతి కాముకులు అని తన్నుడు రాజకీయాలు జిల్లాలో వద్దని పవన్‌కు సూచించారు.
రఘురామ కృష్ణంరాజుపై దాడి అమానుషం
రఘురామ కృష్ణంరాజుపై దాడి అమానుషమని వైఎస్సార్‌సీపీ నాయకుడు, సినీ నటులు పృద్వీ అన్నారు. నాగబాబు, పవన్ లు మాట్లాడే భాష సరికాదన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి, జగన్‌ను ప్రశ్నిస్తున్నప్పుడే జనసేన వైఖరి ఏంటో ప్రజలకు అర్థమవుతుందన్నారు. నటన వేరు, రాజకీయం వేరన్నారు. రాష్ట్రంలో జగన్ సీఎం కావాలని ,రాజన్న రాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుత ఎన్నికలతో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు.
గురువారం కొత్తాడ గ్రామంలో రఘురామకృష్ణంరాజుపై కొందరు యువకులు రాళ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడిలో ఆయన కారు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. సకాలంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది స్పందించి యువకులను చెదరగొట్టడంతో రఘురామ కృష్ణం రాజుకు ముప్పు తప్పింది. ఈ దాడి నేపథ్యంలో రఘురామ కృష్ణం రాజు భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment