రాహుల్ వ్యాఖ్యలపై లోక్‌సభలో మండిపడుతున్న బీజేపీ మహిళా సభ్యులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు చేసిన ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలపై లోక్‌సభ దద్దరిల్లింది. యావత్ భారతదేశాన్ని, ఆర్థిక ప్రగతిని కించపరిచేలా ఆయన వ్యాఖ్యానించారంటూ సభలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. రాహుల్ రేప్‌లను ఆహ్వానిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపిస్తే, పార్లమెంటులో కొనసాగే నైతిక హక్కు రాహుల్‌కి లేదని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గురువారం జార్ఖండ్ ఎన్నికల ప్రచారరాహుల్ గాంధీ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియా చేస్తామని హామీ ఇచ్చారు.
కానీ నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలు చూస్తుంటే భారత్ ‘రేప్ ఇన్ ఇండియా’గా మారుతోందని అన్నారు. శుక్రవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై జరిగిన దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ మహిళా ఎంపీలు రాహుల్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. స్పీకర్ ఓం బిర్లా రెండు సార్లు సభని వాయిదా వేసినా పరిస్థితి చక్కబడలేదు. దీంతో ఆయన సభని నిరవధికంగా వాయిదా వేశారు. శుక్రవారంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిపోయాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సభలో రాహుల్‌ని గట్టిగా నిలదీశారు. రాహుల్ వ్యాఖ్యలు చూస్తే దేశంలో మహిళలపై అత్యాచారం చేయాలని పిలుపునిస్తున్నట్టుగా ఉందన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్మృతి ఇరానీకి మద్దతు నిలిచారు.
రాహుల్‌కు మద్దతుగా కనిమొళి..
బీజేపీ సభ్యులు సభలో తీవ్రంగా దాడి చేయడంతో రాహుల్‌కు ఎంపీ కనిమొళి మద్దతు పలికారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ మాట్లాడడానికి స్పీకర్ అనుమతించకపోవడంతో ఆయన పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడారు. బీజేపీ తన వ్యాఖ్యల్ని వక్రీకరించిందని తాను క్షమాపణ చెప్పనని అన్నారు.
ఈసీకి బీజేపీ ఫిర్యాదు
రాహుల్ అత్యాచార వ్యాఖ్యల్ని నిరసిస్తూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో బీజేపీ మహిళా ఎంపీలు కేంద్ర ఎన్నిక సంఘాన్ని సంప్రదించారు. రాహుల్ అత్యాచారాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారని ఎంపీలు ఫిర్యాదు చేశారు. వీలైనంత మేర ఆయనకు కఠిన శిక్ష విధించాలని ఈసీని కోరారు. చట్టబద్ధమైన పక్రియలన్నీ పూర్తయ్యాక తాము తప్పకుండా న్యాయం చేస్తామని ఎన్నికల సంఘం అధికారులు హామీ ఇచ్చినట్టు ఇరానీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment