సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కంటే అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తోంది. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటూ సమర్థులైన అభ్యర్థులను బరిలోకి దింపితే కాంగ్రెస్ అధికారంలోకి రావడం సాధ్యమే.. ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ సెక్రటరీలు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి నివేదించిన సారాంశం. తెలంగాణ కాంగ్రెస్ ఇఛార్జ్ సెక్రటరీలతో రాహుల్ సోమవారం సమావేశమయ్యారు.
రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులపై ముగ్గురు సెక్రటరీలతో చర్చించారు. నెల రోజుల తమ రాష్ట్ర పర్యటన వివరాలను ఈ భేటీలో ఏఐసీసీ సెక్రటరీలు రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామాల్లో కాంగ్రెస్‌కు అనుకూలత కనిపిస్తోందని రాహుల్‌కు వివరించినట్టు ఏఐసీసీ కార్యదర్శి ఎన్ఎస్ బోసురాజు తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలన, ఇచ్చిన హామీలు అమలుకాకపోవడం, నిరుద్యోగ సమస్య తదితర అంశాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. స్థానిక సమస్యలపై దృష్టిపెట్టి ప్రజల్లోకి వెళితే పార్టీకి అనుకూలత ఉంటుందని రాహుల్‌కు వివరించామని తెలిపారు. తెలంగాణలో లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై మొదటదృష్టి సారించామని, అదే సమయంలో మండల స్థాయి నుంచి పీసీసీ వరకు పార్టీని బలోపేతం చేయాలని రాహుల్ సెక్రటరీలకు సూచించారు. ప్రతినెలా ఆయా స్థాయిల్లో ఒకసారైనా సమావేశాన్ని నిర్వహించాలని తెలిపారు. దేశవ్యాప్తంగా చూసినా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో మంచి భవిష్యత్తు కనిపిస్తోందని రాహుల్ తమతో అన్నారని ఎన్ఎస్ బోసురాజు మీడియాకు తెలిపారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన సహకారాన్ని అధిష్టానం నుంచి అందిస్తామని రాహుల్ తెలిపారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment