న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశ ప్రజలు కరోనా సంక్షోభం వంటి విషాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు ధరలు పెంచి వారిని మరింత ఇబ్బందికి గురి చేయడం తగదన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం పేదల చేతిలో నేరుగా డబ్బు పెట్టాలి తప్ప వారి కష్టాల నుంచి లాభాలు ఆశించడం మంచి పద్దతి కాదని తెలిపారు. ‘ప్రధాని మోదీ.. ఈ విషాదకర పరిస్థితుల్లో మధ్యతరగతి, పేద ప్రజలకు నేరుగా నగదు సాయం చేయాలి. వారి కష్టాల నుంచి లాభం పొందాలని చూడండి ఆపండి’ అని హెచ్చరించారు. ఇదిలా ఉండగా సోనియా గాంధీ మంగళవారం ఉదయం ఇంధన ధరల అంశం గురించి ప్రధాని మోదీకి లేఖ రాశారు.
ప్రస్తుతం దేశ ప్రజలున్న పరిస్థితుల్లో ఇంధన ధరలు పెంచడం మతిలేని నిర్ణయం అని సోనియా గాంధీ విమర్శించారు. మార్చి నుంచి దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందని తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఇంధన ధరలు పెంచడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి 10 సార్లు ఇంధన ధరలు పెంచిందని తెలిపారు. తక్షణమే ఇంధన ధరలను 2004, ఆగస్టు నాటి ధరలకు తగ్గించాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ 10 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 5.45 , డీజిల్ ధర లీటరుకు రూ. 5.8 (ఢిల్లీ రేట్లు) పెరిగింది. దీంతో పెట్రోలు, డీజిల్ ధరలు ఈ ఏడాది గరిష్టానికి చేరాయి
Comments
Please login to add a commentAdd a comment