లక్నో : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రియాంక గాంధీ క్రియాశీల రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు ప్రియాంక గాంధీ. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ప్రియాంక గాంధీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి బరిలో దిగుతున్న వారణాసి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం బాగా జరుగుతుంది. అయితే దీనిపై ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన వెలవడలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ ఆంగ్ల పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేస్తారా అని ప్రశ్నించగా అందుకు ఆయన ‘ఈ విషయంలో నేను మిమ్మల్ని సస్పెన్స్‌లో ఉంచుతున్నాను. సస్పెన్స్ అనేది అంత చెడ్డదేం కాదు కదా’ అంటూ విచిత్రంగా సమాధానం చెప్పారు. అంటే ఈ విషయాన్ని మీరు తోసిపుచ్చడం లేదు కదా అని ప్రశ్నించగా.. నేను అంగీకరించడం లేదు అలా అని తోసిపుచ్చడం లేదు అని పేర్కొన్నారు.
ప్రియాంక పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యకర్తలు ఆమెను సోనియా గాంధీ నియోజకవర్గం రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయమని కోరారు. అందుకు ప్రియాంక వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయకూడదని ప్రశ్నించారు. అంతేకాక పార్టీ ఆదేశిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం అని తెలిపారు. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కూడా ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తుందనే ప్రచారంపై స్పందిస్తూ అవుననే సమాధానం ఇచ్చారు. కానీ ఈ రోజు రాహుల్ సమాధానం విన్న కార్యకర్తలు మరోసారి ఆలోచనలో పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment