న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ(47)పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారయింది. తన తల్లి, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ నుంచి ఈ నెల 16వ తేదీన అధికారికంగా పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. డిసెంబర్ 16వ తేదీన ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ నియామక ఉత్తర్వులు అందుకుంటారని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ ఎం.రామచంద్రన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ సహా అన్ని రాష్ట్రాల నుంచి పార్టీ ప్రముఖులు హాజరవుతారన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా దాఖలైన మొత్తం 89 నామినేషన్లు రాహుల్‌కు అనుకూలంగా వచ్చాయి. నామినేషన్ల ఉపసంహరణకు గడువు 10వ తేదీతో ముగిసింది. దీంతో రాహుల్ నామినేషన్ మాత్రమే ఉండటంతో ఆయన్ను అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించటమే మిగిలింది. కాగా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల వెల్లడికి రెండు రోజులు ముందుగా రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనుండటం విశేషం. ఈ ఎన్నికల్లో గనుక విజయం సాధిస్తే రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్‌కు కొత్త జవసత్వాలు వచ్చినట్లేనని భావిస్తున్నారు.
క్లిష్ట సమయంలో రాహుల్ రాక..
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అర్ధ శతాబ్దం పాటు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఒకప్పుడు కేంద్రంలో, రాష్ట్రాల్లో ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు కేవలం ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మాత్రమే అధికారంలో ఉంది. పార్టీ ప్రాభవం మసకబారిన క్లిష్ట సమయంలో రాహుల్ బాధ్యతలు చేపడుతున్నారు. అందరినీ కలుపుకుని పోతూ పార్టీని పునర్‌వ్యవస్థీకరించటం రాహుల్ ముందున్న సవాల్ అని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితాసేన్ తెలిపారు.
ఆ వారసత్వంలోనే..
నెహ్రూ–గాంధీ వారసత్వంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ తర్వాత రాహుల్ కాంగ్రెస్ అత్యున్నత పీఠాన్ని అధిరోహించనున్నారు.
అభివృద్ధి ఎజెండాను మోదీ విస్మరించారు
డకోర్: ప్రధాని మోదీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి ఎజెండాను పక్కనపెట్టారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ శనివారం చేసిన ప్రసంగంలో 90 శాతం సమయం తన గురించి చెప్పుకోవడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నోటి నుంచి నోట్ల రద్దు, జీఎస్టీపై ఒక్కమాట కూడా రాలేదన్నారు. గుజరాత్ రెండోదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రన్‌ఛోడ్ రాయ్‌జీ శ్రీకృష్ణ మందిరాన్ని రాహుల్ దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. మోదీ తన ప్రచార ఎజెండాను తరచుగా మార్చేస్తున్నారని దుయ్యబట్టారు. తొలుత నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్ గురించి ప్రచారం చేయాలనుకున్నారనీ.. కానీ నీటి సరఫరా ఆగిపోవడంతో ఓబీసీల రిజర్వేషన్ అంశంపై ముందుకెళ్లాలని బీజేపీ నిర్ణయించుకుందని రాహుల్ తెలిపారు. బీజేపీ తమకు చేసిందేమీ లేదని ఓబీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో మళ్లీ అభివృద్ధి ఎజెండాను ఎత్తుకుందన్నారు.
16న రాహుల్‌కు పగ్గాలు
Published Mon, Dec 11 2017 3:40 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment