సంపన్న రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారు | Rahul gandhi slams on kcr in kodada public meeting | Sakshi
Sakshi News home page

సంపన్న రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారు

Published Thu, Dec 6 2018 5:12 AM | Last Updated on Thu, Dec 6 2018 9:38 AM

Rahul gandhi slams on kcr in kodada public meeting - Sakshi

కోదాడలో జరిగిన ప్రజాఫ్రంట్‌ బహిరంగ సభలో అభివాదం చేస్తున్న సురవరం, కుంతియా, చంద్రబాబు, రాహుల్, ఉత్తమ్, పద్మావతి

సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘తెలంగాణలోని కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు, యువకులకు, నిరుద్యోగులకు చేసిందేమీ లేదు. కానీ సంపన్నులైన బడా కాంట్రాక్టర్లకు ప్రాజెక్టుల పేరు మార్చి రూ.40వేల కోట్లు దోచి పెట్టారు. ప్రాణహిత–చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో రూ.50వేల కోట్లు కాంట్రాక్టర్లు అక్రమంగా సంపాదించుకోవడానికి దోహదం చేశారు. కేసీఆర్‌ అంటేనే ఖావో.. కమిషన్‌రావ్‌. మీ కుమారుడి ఆదాయం 400 శాతం పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి అప్పులు లేని సంపన్న రాష్ట్రంగా ఉంది.

ప్రస్తుతం రెండున్నర లక్షల కోట్ల అప్పు ఉంది. ప్రతి కుటుంబంపై రెండున్నర లక్షల రూపాయల అప్పు మూటగట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీ కుటుంబానికి సంపూర్ణ సంపద చేకూరింది. కానీ తెలంగాణ ప్రజలకు నైరాశ్యమే మిగిలింది.  మీ కుటుంబం మినరల్‌ వాటర్‌ తాగుతోంది. నల్లగొండ, కోదాడలోని పేద ప్రజలకు మాత్రం ఫ్లోరైడ్‌ నీళ్లు సరఫరా చేస్తున్నారు’ అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు. బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రజాకూటమి నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.

యువత, రైతులు, మహిళలు తమ రక్తాన్ని ధారపోసి రాష్ట్రాన్ని సాధించుకున్నారని.. కానీ వారు ఏ కలల కోసం పోరాటం చేశా రో.. అవేవీ సాకారం కాలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఏవీ లేవని విమర్శించారు. కేసీఆర్‌ జిల్లాలను దత్తత తీసుకోవడం కాదని, తెలంగాణలోని రైతులను, యువతను, తెలంగాణ ఉద్యమంలో ఆత్మార్పణం చేసుకున్నవారి కుటుంబాలను దత్తత తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రాగానే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును ఆధునీకరించి నల్లగొండ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు.

కూటమిదే అధికారం..
కాంగ్రెస్‌ సారథ్యంలోని ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, మొట్టమొదటి హామీగా రైతుల రుణాలు మాఫీ చేసి తీరుతుందని రాహుల్‌ స్పష్టంచేశారు. వరికి క్వింటాల్‌కు రూ.2వేలు, పత్తి క్వింటాల్‌కు రూ.7వేలు, మిర్చికి రూ.10వేలు, పసుపు పంటకు రూ.10వేలు మద్దతు ధర ఇస్తామని చెప్పారు. సీఎంకి రూ.300 కోట్ల విలువైన ఇల్లు ఉం దని.. కానీ తెలంగాణ రైతులకు, పేదలకు, నిరుద్యోగులకు ఇళ్లే లేవని, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిం చారు. తెలంగాణ ప్రజలను, పంచాయతీలను కేసీఆర్‌ నిర్వీర్యం చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక అన్నీ బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ‘తెలంగాణను ఒకే కుటుంబం పాలించడాన్ని అంగీకరించం. తెలంగాణను తెలంగాణ ప్రజలే పాలించాలి. అందరూ మీ స్వయంశక్తితో, పరిపాలనతో నయా తెలంగాణను నిర్మించాలి’ అని రాహుల్‌ సూచిం చారు. కొద్ది రోజుల్లోనే తెలంగాణలో మార్పు అనే తుపాను రాబోతోందని వ్యాఖ్యానించారు.

ఈ ఎన్నికల తర్వాత మోదీ ఇంటికే...
తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల తర్వాత వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రధాని మోదీని ఇంటికి పంపిస్తామని రాహుల్‌ పేర్కొన్నారు. మోదీ ఈ దేశాన్ని నష్టాలపాలు చేశారని, నోట్ల రద్దుతో చిరు వ్యాపారులను, దుకాణాలను ఖతం చేశారని దుయ్యబట్టారు. ప్రజలపై గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ విధించి ప్రజల సొమ్మంతా పన్నుల రూపం లో లాక్కుని అత్యంత ధనవంతులకు ఇచ్చారని ధ్వజమెత్తారు. రూ.3.50 లక్షల కోట్లు కేవలం ముగ్గురికే మాఫీ చేశారని దుయ్యబట్టారు. మోదీ తమను విమర్శిస్తారని, కానీ కేసీఆర్‌ను పల్లెత్తు మాట కూడా అనరని రాహుల్‌ ఆరోపించారు.

‘మోదీ చేతిలో తెలంగాణ రిమోట్‌ కంట్రోల్‌ ఉంది. కేసీఆర్‌ అవి నీతిలో మునిగి తేలుతుంటే సీబీఐ, ఈడీ మోదీ చేతిలో ఉన్నాయి’ అని అన్నారు. టీఆర్‌ఎస్‌ అసలు పేరు టీ‘ఆర్‌ఎస్‌ఎస్‌’, అంటే తెలంగాణ ఆర్‌ఎస్‌ఎస్‌ అని అన్నారు. యువతకు ఉపాధి కల్పించడం.. దేశ సంపదను యువతకు, రైతులకు, చిరు వ్యాపారులకు అప్పగించడంతోపాటు అనిల్‌ అంబానీ, విజ య్‌మాల్యా, నీరవ్‌మోదీల జేబులోని ప్రజల సొమ్ము ను తీసుకొచ్చి ప్రజలకు అందజేస్తామని చెప్పారు. సెల్‌ఫోన్, మైక్, దుస్తులు.. ఇలా అన్నింటిపైనా మేడ్‌ ఇన్‌ చైనా అని ఉంటుందన్నారు. కానీ తమ లక్ష్యం ప్రతి వస్తువుపైనా మేడ్‌ ఇన్‌ తెలంగాణ.. మేడ్‌ ఇన్‌ నల్లగొండ అని ఉండాలని.. ఇదే తెలంగాణ అసలు కల, అసలు భవిష్యత్‌ అని రాహుల్‌ పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌కు ఇవే చివరి ఎన్నికలు కావాలి...
జాతీయస్థాయిలో రెండే కూటములున్నాయని.. ఒకటి మోదీ కూటమి కాగా, మరొకటి తామందరం ఉన్న ఆయన వ్యతిరేక కూటమి అని చంద్రబాబు పేర్కొన్నారు. కేసీఆర్‌ ఎక్కడ ఉన్నారు.. ఎంఐఎం ఎవరికి సహకరిస్తుందో చెప్పాలన్నారు. హైదరాబాద్‌ బంగారు గుడ్డు పెట్టే బాతు అని.. టీడీపీ, కాంగ్రెస్‌ కలిసి తెలంగాణను అభివృద్ధి చేశాయని వ్యాఖ్యానించారు. 2004లో తాను ఓడిపోయినప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది చంద్రబాబే అని రాహుల్‌ చెప్పారని పేర్కొన్నారు. మరి కేసీఆర్‌ హైదరాబాద్‌కు ఏమైనా చేశారా అని ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు కావాలన్నారు. టీఆర్‌ఎస్‌తో తాము కలిసి ఉండకపోతే వారు బీజేపీతో వెళ్లిపోతారని ఎంఐఎం అధినేత, సీఎం స్నేహితుడు అక్బరుద్దీన్‌ అన్నారని.. టీఆర్‌ఎస్, బీజేపీ బంధానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని బాబు పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ కోదాడ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డి, సీపీఐ నాయకులు పల్లా వెంకటర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మోదీ, కేసీఆర్‌ నియంతలు: చంద్రబాబు
రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో నరేంద్ర మోదీ నియంతల్లా తయారై రాష్ట్రాన్ని, దేశాన్ని భ్రష్టు పట్టించారని.. ఈ రెండు ప్రభుత్వాలు ఇంటికి పోవాల్సిన అవసరం ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డిని తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి మరీ అరెస్టు చేశారని, ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. కేసీఆర్‌ అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకమని విమర్శించారు.

తనను ఇక్కడకు ఎందుకు వచ్చావని, తెలుగుదేశం పార్టీ అవసరం ఏమిటని అడుగుతున్నారని.. అసలు తెలుగుదేశం పార్టీ లేకపోతే కేసీఆర్‌ ఎక్కడ ఉండేవారు, ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉండేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ తనతో పాటు తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని తిడుతున్నాడని, ఓడిపోతామన్న భయంతో ఆయనలో అసహనం పెరిగిందని ధ్వజమెత్తారు. నరేంద్రమోదీ పెద్ద నియంతని, ఆయన సీనియర్‌ మోదీ అయితే, ఇక్కడ జూనియర్‌ మోదీ కేసీఆర్‌ అని, ఇద్దరు నియంతలకు ప్రజాస్వామ్యంలో చోటులేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ పరిస్థితి చూస్తే పగటిపూట ఎంఐఎంతో, రాత్రిపూట
బీజేపీతో స్నేహం చేస్తున్నాడని విమర్శించారు.

బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన ప్రజాఫ్రంట్‌ బహిరంగ సభకు హాజరైన జనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement