పది బహిరంగ సభలకు రాహుల్‌ గాంధీ | Rahul Gandhi for ten public meetings in Telangana | Sakshi
Sakshi News home page

పది బహిరంగ సభలకు రాహుల్‌ గాంధీ

Published Wed, Oct 31 2018 2:57 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Rahul Gandhi for ten public meetings in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పాగా వేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్‌.. తమ పార్టీ జాతీయ నేతలతో భారీ బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా ప్రజలను ప్రసన్నం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వీలైనన్ని ఎక్కువ బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన తర్వాత కామారెడ్డి, భైంసా బహిరంగ సభలతో పాటు హైదరాబాద్‌ చార్మినార్‌ వద్ద నిర్వహించిన రాజీవ్‌ సద్భావన యాత్ర కార్యక్రమంలో రాహుల్‌ పాల్గొన్నారు. ఇకపై కూడా మరో పది బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తున్నారు. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ కూడా మూడు కీలకమైన సభల్లో పాల్గొనేలా టీపీసీసీ ప్రణాళికలు రచిస్తోంది.

ఉత్తర, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్‌లో..
ఉద్యమ సమయం నుంచి టీఆర్‌ఎస్‌కు పట్టున్న ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో ఎక్కువగా దృష్టి సారిస్తోంది. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎక్కువ స్థానాలు ఈ ప్రాంతం నుంచే కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్‌ ఇక్కడ టీఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా ఉత్తర తెలంగాణలోని వరంగల్‌ లేదా కరీంనగర్‌లో సోనియా గాంధీతో ఒక సభ నిర్వహించాలని టీపీసీసీ పెద్దలు మంగళవారం జరిగిన ఓ హోటల్‌లో వ్యూహాలు రచించారు. కాంగ్రెస్‌కు బలమైన ప్రాంతంగా ఉన్న దక్షిణ తెలంగాణలో మహబూబ్‌నగర్‌ లేదా నల్లగొండలో సోనియా గాంధీతో మరోసభ ప్లాన్‌ చేసినట్లు తెలిసింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌లో ఇంకోసభ పెట్టి మొత్తంగా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ అనే రీతిలో సోనియా ద్వారా ఓట్లు పొందాలని భావిస్తున్నారు. ఇక ప్రతీ ఉమ్మడి జిల్లాలో జరిగే ఒక బహిరంగ సభకు రాహుల్‌ గాంధీ హాజరయ్యేలా చూడాలని ప్రతిపాదించనున్నట్లు టీపీసీసీ పెద్దలు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ నుంచి ఈ సభలతో ప్రచారం హోరెత్తించి కార్యకర్తలతో పాటు ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

నాలుగు బృందాలుగా..
ఎన్నికల దృష్ట్యా ప్రచార కమిటీతో పాటు విడిగా కీలక నేతలు ప్రచారాన్ని విస్తృతం చేసేందుకు టీపీసీసీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో రోడ్‌షోలు, కాలనీల ప్రచారంతో ముందుకెళ్లడం చేస్తూనే మరోవైపు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి, మాజీ మంత్రి డీకే అరుణ మరో మూడు బృందాలుగా రాష్ట్రం మొత్తం ప్రచారం చేయనున్నట్లు తెలిసింది. ఒకవైపు సోనియా, రాహుల్‌ సభలతో పాటు ఈ నాలుగు బృందాలు 25 నియోజకవర్గాల చొప్పున బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహిస్తార ని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తం గా మూకుమ్మడిగా ప్రచారం జరిగేలా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్‌ ముఖ్య నేతలంతా తమతమ ప్రచార రథాలను సిద్ధం చేసుకున్నారు. హెలికాప్టర్‌లో ఎవరెవరు వెళ్లాలన్న పార్టీ ప్రొటోకాల్‌ వ్యవహారంపై ఏఐసీసీ నుంచి అనుమతులు సైతం పొం దారు. మరో రెండు మూడు రోజుల్లో టికెట్లు, పొత్తు జాబితా కొలిక్కి వస్తుండటంతో ప్రచారాన్ని వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

నియోజకవర్గానికే పరిమితం కావొద్దు..
రాష్ట్ర కాంగ్రెస్‌లోని మిగిలిన కీలక నేతలు, మాజీ మంత్రులు కేవలం వారి వారి నియోజకవర్గాలకే పరిమితం కావొద్దని, జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా కార్యచరణ సిద్ధం చేసుకోవాలని టీపీసీసీ సూచించినట్లు తెలిసింది. పోటీచేస్తున్న స్థానాలతో పాటు పొరుగున ఉన్న రెండు మూడు నియోజకవర్గాల్లో వీలైనప్పుడల్లా ప్రచారం నిర్వహిం చాలని, దీంతో కార్యకర్తలతోపాటు ప్రజలకు కాంగ్రెస్‌పై మరింత నమ్మకం కలుగుతుందని నిర్ణయిం చినట్లు తెలిసింది.

ఢిల్లీ చేరిన స్క్రీనింగ్‌ కమిటీ
కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు వ్యవహారంపై స్క్రీనింగ్‌ కమిటీ, కోర్‌కమిటీల మధ్య సుదీర్ఘంగా భేటీ జరిగింది. స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్, సభ్యులు శర్మిష్ట ముఖర్జీ, జ్యోతిమణి సెన్నామలైతో కోర్‌కమిటీ సభ్యులు కుంతియా, ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్‌అలీ, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, బోసురాజు, శ్రీనివాసకృష్ణన్, సలీమ్‌ అహ్మద్‌ మంగళవారం భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాపై తుది చర్చలు జరిపారు. సామాజిక వర్గాలు, కూటమి పొత్తులు, టికెట్ల ఖరారు నిబంధనలపై సుదీర్ఘంగా చర్చించి తుది జాబితాతో స్క్రీనింగ్‌ కమిటీ మంగళవారం ఢిల్లీ వెళ్లింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement