
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శాసనసభా పక్షం నిర్ణయించింది. రాహుల్ పాల్గొనే కార్యక్రమాలన్నింటిలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే భారీగా జనసమీకరణ చేయాలని నేతలకు సూచించింది. రాహుల్ పర్యటనపై శనివారం సీఎల్పీ నేత జానారెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కార్యాలయంలో సమావేశమైంది. ఈ భేటీకి ఎమ్మె ల్యేలు గీతారెడ్డి, భట్టి విక్రమార్క, వంశీచంద్ రెడ్డి, మాధవరెడ్డి, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆకుల లలిత హాజరయ్యారు.
రాహుల్ పర్యటించే ప్రాంతాల్లో మహిళలు, యువత పెద్దఎత్తున పాల్గొనేలా ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలన్న అంశాలపై చర్చించారు. రాహుల్‌ను ఓయూలోకి అనుమతించకపోవడాన్ని వారంతా మూకుమ్మడిగా ఖండించారు. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం కొందరిని రెచ్చగొట్టి రాహుల్ ను ఓయూకు రాకుండా అడ్డుకుందని ఆరోపించారు. రాష్ట్ర సమస్యలు తెలుసుకునేందుకే రాహుల్ వస్తున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని రాహుల్ చెప్పబోతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment