రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించునున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా రాహుల్‌తో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రంజాన్ అనంతరం సభను ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ సభలో జేఏసీ నేతలు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధినేతలు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఉత్తమ్ తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఆర్‌సీ కుంతియా స్థానంలో పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ను నియమించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. కాగా రాహుల్ పర్యటన తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళులు అర్పించారు. ‘సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చింది. తెరాస పుట్టకముందే తెలంగాణ ఇవ్వాలని కోరాము. మొదలు పెట్టింది, ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే. అనేక కారణాలతో దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు కోల్పోయాం.బాధ్యత గల ప్రతిపక్షంగా పని చేశాం. మా డిమాండ్ మీదనే రుణమాఫీ మీద వడ్డీమాఫీ చేస్తా అని కేసీఆర్ మాట తప్పారు. రైతులకు అండగా ఉద్యమాలు, పోరాటాలు చేసి వారికి మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు ముందున్నారు.
రైతులను కేసీఆర్ ఆదుకోలేదు. నేరెళ్ల ఘటన, ఖమ్మం రైతులకు భేడీలు, గిరిజన మహిళలను చెట్లకు కట్టి కొట్టారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. వందల కోట్లు పెట్టి ప్రకటనలు ఇచ్చారు. అన్నీ అబద్ధాలే. ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా అమలు చేయలేదు. దళిత సీఎం, దళిత, గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఏది? ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలోనే అబద్దాలు ఉన్నాయి. ఒక్క గిరిజన వ్యక్తికి అయినా ఒక్క ఎకరం భూమి ఇచ్చారా?. కేజీ టు పీజీ ఏమైంది. అన్ని వ్యవస్థలను తొక్కేసే ప్రయత్నం చేశారు. మేము, మా కుటుంబం బాగుపడితే చాలు అని పని చేసారు. ఆ నలుగురికి తప్ప మిగిలిన తెలంగాణకు దుఃఖమే మిగిలింది.నిరుద్యోగ యువత పూర్తిగా నైరాశ్యం లో ఉన్నారు.తెలంగాణా ప్రజల పక్షాన కాంగ్రెస్ ఉంటుంది.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. వచ్చే జూన్ రెండున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది.’ అని ఉత్తమ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment