
విశాఖలో...
సాక్షి, నెట్‌వర్క్: ప్రత్యేక హోదా పోరు రోజురోజుకూ ఉధృత రూపం దాల్చుతోంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి. ఉద్యమ సెగ రైళ్లనూ తాకింది. అన్ని జిల్లాల్లోనూ ప్రజలు, వివిధ సంఘాల నాయకులు, వైఎస్సార్‌సీపీ నేతలు తరలివచ్చి రైల్‌రోకోలు నిర్వహించారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ విశ్రమించబోమని ప్రతినబూనారు. హోదా మా హక్కు అంటూ పెద్ద ఎత్తున నినదించారు. మరోవైపు ఉద్యమానికి మద్దతుగా నిలవాల్సిన టీడీపీ ప్రభుత్వం ఆందోళనకారులపైకి పోలీసులను ఉసిగొల్పింది. దీంతో అన్ని జిల్లాల్లోనూ ఆందోళనకారులపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. లాఠీలు ఝుళిపించారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చేశారు.
విజయవాడలో రైల్ రోకోకు వెళ్తున్న ఎమ్మెల్యే రక్షణనిధి, పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెలంపల్లి, జోగి రమేశ్‌లను అడ్డుకుంటున్న పోలీసులు
ప్రకాశం జిల్లాలో విరుచుకుపడిన పోలీసులు..
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు. అయినా కూడా వైఎస్సార్‌సీపీ శ్రేణులు వెరవకుండా స్టేషన్ లోపలికి ప్రవేశించి ఆందోళనకు దిగారు. పట్టాలపై కూర్చొని నాందేడ్ రైలును అడ్డుకున్నారు. ఇంతలో అక్కడకు చేరకున్న పోలీసులు బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఐ.వి.రెడ్డి, వరికూటి అశోక్‌బాబు, రామనాథం, గరటయ్య, మాధవరావు, ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ తదితరులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. నేతలను స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లే క్రమంలో వరికూటి అశోక్‌బాబును ఓ ఎస్సై చేయి పట్టుకొని బలంగా లాగాడు. స్టేషన్ బయట వరకూ దౌర్జన్యంగా నెట్టుకుంటూ వెళ్లి వాహనంలోకి అశోక్‌ను తోసివేశారు. బాలినేని మాట్లాడుతూ.. హోదా కోసం ఉద్యమిస్తున్న నాయకులపై పోలీసులను ఉసిగొల్పుతారా? అని చంద్రబాబును నిలదీశారు.
ఇదేనా మీ చిత్తశుద్ధి అంటూ మండిపడ్డారు. కాగా, రైల్‌రోకోకు సంబంధించి ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్, నేతలు అశోక్‌బాబు, శింగరాజుతో పాటు మరో 200 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్సార్‌సీపీ నేతలు మేరుగ నాగార్జున, అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో రైల్‌రోకో విజయవంతమైంది. గుంటూరు నగరంలో రైల్‌రోకో నిర్వహించేందుకు వెళ్తున్న లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో తలపెట్టిన రైల్‌రోకోను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే రక్షణనిధి, నేతలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, బొప్పన భవకుమార్, జోగి రమేశ్‌ను ముందుగానే అరెస్ట్ చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ పోలీసులు జులుం ప్రదర్శించారు. నెల్లూరు స్టేషన్‌లోకి వెళ్లనివ్వకుండా పోలీసులు మోహరించారు. దీంతో ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. స్టేషన్ బయటే ధర్నాకు దిగారు. వెంకటగిరి, పడుగుపాడు, గూడూరు తదితర నియోజకవర్గాల్లో రైల్‌రోకోలు విజయవంతమయ్యాయి.
హోదా నినాదంతో దద్దరిల్లిన రైల్వేస్టేషన్లు..
తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, సామర్లకోట రైల్వేస్టేషన్లు హోదా నినాదంతో మార్మోగాయి. పార్టీ నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, కన్నబాబు, మోషేన్‌రాజు, రౌతు సూర్యప్రకాశరావు తదితరుల ఆధ్వర్యంలో శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పార్టీ నేతలు గ్రంథి శ్రీనివాస్, ప్రసాదరాజు, మేకా శేషుబాబు తదితరులు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకొని ఆందోళనకు దిగారు. ఏలూరు పవర్‌పేట స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన ఎమ్మెల్సీ ఆళ్ల నాని, తెల్లం బాలరాజు, కొఠారు రామచంద్రరావును అరెస్టు చేశారు. ఇక ఎమ్మెల్సీ కోలగట్ల, ఎమ్మెల్యేలు రాజన్నదొర, పుష్పశ్రీవాణి తదితరుల నేతృత్వంలో వందలాది మంది విజయనగరం స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి పట్టాలపై బైఠాయించారు. శ్రీకాకుళం జంక్షన్ రైల్వేస్టేషన్‌లో ఆందోళనపై పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు యత్నించారు. నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి మాట్లాడుతూ చంద్రబాబు.. హోదా పోరాటాన్ని అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే కంబాల జోగులు తదితరుల నేతృత్వంలో ఆందోళనలు జరిగాయి. విశాఖ స్టేషన్‌లో పోలీసులు, ఆర్పీఎఫ్ బృందాలు మోహరించడంతో ఉద్రిక్తత తలెత్తింది. అయినా కూడా పార్టీ నేతలు లోపలికి దూసుకెళ్లి పాసింజర్ రైలును అడ్డుకున్నారు. మళ్ల విజయప్రసాద్, విజయ్‌కుమార్, గుడివాడ అమర్‌నాథ్ రైలు ఇంజన్ పైకెక్కి నిరసన తెలిపారు. అనకాపల్లి, అరకులోనూ రైల్‌రోకోలు విజయవంతమయ్యాయి.
ఒంగోలులో...
పోలీసులతో ఉద్యమాన్ని అణిచివేస్తారా..?
చిత్తూరు జిల్లాలోని రేణిగుంట రైల్వేస్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైల్‌రోకో జరిగింది. బరంపూర్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అడ్డంగా బైఠాయించి హోదా నినాదాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కాగా, చిత్తూరులో యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ఆ పార్టీ నేత ఎన్.పద్మజ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. వైఎస్సార్ జిల్లా కడప రైల్వేస్టేషన్‌లో ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, మేయర్ సురేశ్‌బాబు ఆందోళనకు దిగి చెన్నై ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలును అడ్డుకున్నారు. రైల్‌రోకోల్లో ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలోనూ రైల్‌రోకోలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. కర్నూలు రైల్వేస్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే ఐజయ్య, నేతలు బీవై రామయ్య, హఫీజ్‌ఖాన్ తదితరులను పోలీసులు ప్లాట్‌ఫాం నుంచి బయటకు తోసుకొచ్చారు. నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డితో పాటు పలువురిని పోలీసులు స్టేషన్ బయటే అడ్డుకుని అరెస్టు చేశారు. కోట్ల హాల్ట్‌లో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లాలో రైల్‌రోకో విజయవంతమైంది. ‘అనంత’ స్టేషన్‌లో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, నేతలు కాపు రామచంద్రారెడ్డి తదితరులు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. గుంతకల్లు, గుత్తి, కదిరి రైల్వేస్టేషన్లలో కర్ణాటక ఎక్స్‌ప్రెస్, చెన్నై మెయిల్‌ను అడ్డగించారు. నిరసనల్లో నేతలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తలారి పీడీ రంగయ్య, కిష్టప్ప, రాగే పరుశురాం, శంకరనారాయణ పాల్గొన్నారు.
కర్నూలులో...
Comments
Please login to add a commentAdd a comment