వెండితెర వేలుపులు రాజకీయ రంగంలో కాలు మోపడం తమిళనాడులో కొత్తేమీ కాదు. అనాటి అన్నాదురై మొదలుకుని రెండేళ్ల క్రితం కన్నుమూసిన జయలలిత వరకు అందరూ రాజకీయ రాజ్యమేలినవారే. సుదీర్ఘ విరామం తరువాత నటులు కమల్‌హాసన్, రజనీకాంత్ ఒకేసారి రాజకీయాల్లోకి దిగారు. మక్కల్ నీది మయ్యం అనే పార్టీతో కమల్ ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించారు. రజనీకాంత్ ఇంకా పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు అధికారంలోకి వస్తారు లేక ఇద్దరికీ అవకాశం లేదా అని పెద్ద ఎత్తున ఊహాగానాలుసాగుతున్నాయి. ఈ తరుణంలో కర్ణాటకకు చెందిన వ్యక్తే తమిళనాడుకు తరువాతి ముఖ్యమంత్రి అవుతారంటూ కమల్‌హాసన్ సోదరుడు చారుహాసన్ సోమవారం తనఫేస్‌బుక్‌లో సంచలన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. రజనీకాంత్‌ను దృష్టిలో ఉంచుకునేఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీ పెట్టడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్న నటుడు కమల్‌హాసన్ ఇంటిపోరును ఎదుర్కొంటున్నారా? ఆయన అన్న చారుహాసన్ వైఖరి చూస్తే అవుననే భావన కలుగుతోంది. సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో సైతం కమల్, రజనీల మధ్య పోటీ అనివార్యమైంది. కమల్ నాస్తిక ధోరణితో, రజనీ ఆధ్యాత్మిక పంథాతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నా ఇద్దరి లక్ష్యం అధికారంలోకి రావడమే. అయితే ఆశ్చర్యకరంగా కమల్ స్వయానా సోదరుడైన చారుహాసన్ రజనీకాంత్‌కే పూర్తి అవకాశాలు ఉన్నాయని పరోక్షంగా ప్రకటించి కలకలం రేపారు. కర్ణాటకకు చెందిన వ్యక్తే తమిళనాడుకు తరువాతి ముఖ్యమంత్రి అవుతారంటూ సోమవారం తనఫేస్‌బుక్‌లో సంచలన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. రజనీకాంత్ పూర్వీకులది తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా. అయితే రజనీకాంత్ మాత్రం కర్ణాటకలోనే పుట్టి శివాజీరావు గైక్వాడ్ పేరుతో పెరిగారని ప్రచారం.
కర్ణాటకలో బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగింది అందరికీ తెలిసిందే. రజనీకాంత్ గతాన్ని దృష్టిలో ఉంచుకునే చారుహాసన్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. పైగా తన వాదనను సమర్థించుకుంటూ రెట్టింపు ధోరణితో మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘కర్ణాటకకు చెందిన వ్యక్తి సీఎం అవుతారనే నా వాదనతో ఏకీభవించని వారు నన్ను అజ్ఞాని అనుకుంటారు. ఈ ఏడాది మిమ్మల్ని నేను అర్థం చేసుకుంటాను. వచ్చే ఏడాది నన్ను మీరు అర్థం చేసుకుంటారు’’ అని అందులో పేర్కొన్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఇద్దరు నటులు పెనుమార్పులు తీసుకువస్తారని ఇటీవల ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చారుహాసన్ పేర్కొన్నారు. చారుహాసన్ వ్యాఖ్యలు సహజంగానే రజనీ శిబిరంలో ఆనందాన్ని నింపగా కమల్ అభిమానుల్లో కల్లోలం కలిగించింది. రజనీకి అనుకూలంగా చారుహాసన్ వ్యాఖ్యలు కాకతాళీయమా లేక మనస్పర్థలా అనే విషయంపై కమల్ నోరు మెదపాల్సి ఉంది.
కమల్ పర్యటన
అన్న చారుహాసన్ ధోరణి ఇలా ఉండగా కమల్ మాత్రం తాను స్థాపించిన ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఏడు జిల్లాల్లో ఆరు రోజులపాటు పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నారు. పార్టీని నెలకొల్పిన నాటి నుంచి ప్రజలను కలుసుకోవడంలో ఆసక్తి చూపుతున్న కమల్ రామనాథపురం, మదురై జిల్లాల్లో తన తొలి, మలి విడత పర్యటనలను పూర్తిచేశారు. ఆ తరువాత ఈరోడ్ జిల్లాలో పర్యటనలో ప్రజలు పెద్ద ఎత్తున కమల్‌కు స్వాగతం పలికారు. దీంతో మరింత ఉత్సాహంతో అన్ని జిల్లాల్లో పర్యటించాలని కమల్ తీర్మానించుకున్నారు. మే, జూన్ మాసాల్లో ఏడు జిల్లాల్లో పర్యటనకు ఆయన సిద్ధం అయ్యారు. మే 16వ తేదీన కన్యాకుమారి జిల్లా, 17న తూత్తుకూడి, 18న తిరునెల్వేలి, విరుదునగర్‌లలో పర్యటిస్తున్నారు. జూన్ 8వ తేదీన తిరుప్పూరు జిల్లా, 9న నీలగిరి, 10న కోయంబత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. పర్యటన సమయంలో ముఖ్య కూడళ్లలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఏడు జిల్లాల్లోనూ భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఫిర్యాదులకు యాప్
ప్రభుత్వం, పోలీసులు, ప్రజాప్రతినిధులపై ఫిర్యాదులు, సమాజంలో నెలకొన్న సమస్యలను పార్టీ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా విజిల్ అనే మొబైల్ యాప్‌ను కమల్ రూపొందించారు. ఈ యాప్‌కు ఫిర్యాదులు పంపేవారి వివరాలను రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. సోమవారం సాయంత్రం ఈ యాప్‌ను కమల్ ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment