
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 4 లోక్‌సభ, 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయంపై కేంద్ర మంత్రి, పార్టీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. భారీ విజయాలు అందుకునే క్రమంలో ఎవరైనా రెండు అడుగులు వెనక్కి వేయాల్సి ఉంటుందని..భవిష్యత్‌లో భారీ ముందడుగు వేయబోతున్నామని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుత ఓటమి రాబోయే రోజుల్లో తమ పార్టీ సాధించే ఘనవిజయాలకు సంకేతంగా ఆయన సమర్థించుకున్నారు. కాగా, ఉప ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా పోరాడటంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం ఒక అసెంబ్లీ స్ధానంలో విజయంతో బీజేపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కైరానా(యూపీ) లోక్‌సభ నియోజకవర్గంలో ఆర్‌ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ 55 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ పోటీదారు మృగంకా సింగ్‌పై ఘన విజయం సాధించడం బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. 2014 తర్వాత యూపీ నుంచి తొలి ముస్లిం అభ్యర్థిగా తబుస్సుమ్ పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. ఇక్కడ విపక్షాలన్నీ(ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్) కలిసి ఆర్‌ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్‌ను నిలబెట్టాయి. నాగాలాండ్ సొలె లోక్‌సభ స్థానం ఫలితాల్లో ఎన్డీపీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 28 తేదీన నాలుగు లోక్ సభ స్థానాలకు, 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment