సాక్షి, హైదరాబాద్: ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నందున నేడు పోలింగ్ అనివార్యంగా మారింది. శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసనసభలోని అసెంబ్లీ కమిటీ హాలు–1లో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు ఏర్పాట్లను సమీక్షించారు. తొలుత ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది మార్చి 26నే పోలింగ్ జరగాల్సినా కరోనా కారణంగా సీఈసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
పోలింగ్ ముగిసిన రెండు గంటల్లోపే ఫలితాలు!
వైఎస్సార్‌సీపీ తరఫున రాజ్యసభకు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు పోటీలో ఉండగా టీడీపీ తరçఫున వర్ల రామయ్య బరిలో నిలిచారు. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా 2గంటల్లోపే ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓపెన్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎమ్మెల్యేలు తాము ఎవరికి ఓటు వేసిందీ బ్యాలెట్‌ను పార్టీ నిర్దేశించిన ప్రతినిధికి చూపించి బాక్సులో వేయాల్సి ఉంటుంది. ఏ ఎమ్మెల్యే అయినా పొరబాటున ఓటు వేసిన బ్యాలెట్ పత్రాన్ని తమ పార్టీ ప్రతినిధికి కాక మరొకరికి చూపిస్తే ఆ ఓటు చెల్లదు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరపున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ తరపున మాజీ మంత్రి అలపాటి రాజేంద్రప్రసాద్ పార్టీ ప్రతినిధులుగా పోలింగ్ బూత్‌లో కూర్చోనున్నారు. అధికారపక్షం నియమించిన పార్టీ ప్రతినిధులు అవసరాన్ని బట్టి ఒకరినొకరు రిలీవ్ చేసుకుంటూ ఒక్కరు మాత్రమే పోలింగ్ బూత్‌లో ఓట్లను పరిశీలిస్తూ ఉంటారు.
గెలిచేందుకు 36 ఓట్లు అవసరం
శాసనసభలోని మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటే ఒక్కో అభ్యర్థి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు 36 తొలి ప్రాధాన్యత ఓట్లు అవసరమవుతాయని రిటర్నింగ్ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. పోలింగ్‌లో పాల్గొనే సభ్యుల సంఖ్య తగ్గితే ఆ మేరకు గెలిచేందుకు అవసరమయ్యే ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉంది.
బలం లేకున్నా బరిలో టీడీపీ..
అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం నిజానికి ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలి. బలం చాలనప్పుడు ఏకగ్రీవాలకే ప్రాధాన్యం ఇచ్చాయి. టీడీపీకి అసెంబ్లీలో తగినంత బలం లేకున్నా, గెలిచే అవకాశం లేకున్నా కావాలనే పోటీకి దిగినట్లు స్పష్టమవుతోంది.
2014 తరువాత పోలింగ్ ఇదే..
ఉమ్మడిఏపీలో 2014లో ఆరు రాజ్యసభ స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు పోటీ చేయడంతో పరిస్థితి పోలింగ్ వరకు వెళ్లింది. అప్పుడు ఏడో అభ్యర్థికి సున్నా ఓట్లు రావడం గమనార్హం. టీడీపీ తరపున 23 మంది గెలిచినా ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ విధానాలతో విభేదిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి గెలుపు మాట అటుంచి ఉన్న ఓట్లు సైతం చేజారతాయా అనే సందేహాలు నెలకొన్నాయి.
వైఎస్సార్‌సీపీ మాక్ పోలింగ్
వైఎస్సార్‌సీపీ సభ్యులకు లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మాక్ పోలింగ్ నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేశారు. ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి 37 మంది ఎమ్మెల్యేల ఓట్లను కేటాయించగా మిగతా ముగ్గురు అభ్యర్థులకు 38 చొప్పున ఓట్లను కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాక్ పోలింగ్‌ను పర్యవేక్షించారు. వైఎస్సార్ సీపీ తరపున పోటీ చేస్తున్న నలుగురు అభ్యర్థులు కూడా దీనికి హాజరయ్యారు.
సీఎం జగన్ ఓటు బీసీకి!
రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓటును బీసీ వర్గానికి చెందిన పార్టీ రాజ్యసభ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు కేటాయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా దీన్ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment