శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న రాంమాధవ్
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ) అవగాహన లేకుండానే ప్రతిపక్ష నేతలు వ్యతిరేకిస్తున్నారని, కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా విభేధిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పేర్కొన్నారు. సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చాలామంది నేతలకు సరిగ్గా తెలియదని విమర్శించారు. ప్రజ్ఞాభారతి, సోషల్ కాజ్ సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో భారత్‌కు సీఏఏ ఎందుకు అవసరమన్న అంశంపై సదస్సు జరిగింది. ఇందులో రాంమాధవ్ ప్రధాన వక్తగా ప్రసంగించారు. దేశంలో ప్రతిపక్ష నాయకులది నాలెడ్జ్ ప్రూఫ్ విధానమని, గడియారాల్లోకి వాటర్ పోకుండా ఎలా వాటర్ ప్రూఫ్ ఉంటుందో.. ప్రతిపక్ష నేతలు తమ మెదళ్లలోకి సమాచారం వెళ్లనీయకుండా నాలెడ్జ్ ప్రూఫ్‌గా తయారయ్యారని ఎద్దేవా చేశారు. మతపరంగా రెచ్చగొట్టి, విభజన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలోని ముస్లింలు వారి మాటలను నమ్మొద్దని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు తమ రాజకీయాల కోసం ముస్లింలను బలి పశువులను చేస్తున్నాయని మండిపడ్డారు. మన దేశంలోనే 72 రకాల తెగలకు చెందిన ముస్లింలు ఉన్నారని, మన దేశంలో ఉన్న ఇన్ని రకాల ముస్లింలు మరెక్కడా లేరని చెప్పారు. ఈ చట్టం దేశంలో ఉన్న వారి కోసం కాదని వివరించారు. శరణార్థులుగా వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వాల్సిన బాధ్యత దేశంపై ఉందని, కేంద్రం అదే పని చేస్తోందని స్పష్టం చేశారు. కొన్ని నియమ నిబంధనలు పాటిస్తే ఎవరైనా దేశ పౌరసత్వం పొందొచ్చని, మతపరమైన కారణాలతో పౌరసత్వాన్ని నిరాకరించే అధికారం ఎవరికీ లేదని తెలిపారు. అందుకే సోనియాగాంధీ, అద్నాన్ సమీకి పౌరసత్వం లభించిందని గుర్తుచేశారు.
భయపడాల్సిన పనిలేదు..
ఈ దేశ పౌరులు ఏ మతానికి చెందిన వారైనా, ఏ చట్టానికి భయపడాల్సిన అవసరం లేదని, విదేశాల నుంచి అక్రమంగా వచ్చిన వారిని మాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదని రాంమాధవ్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనల మేరకు కేంద్రం సీఏఏ తీసుకొచ్చిందని తెలిపారు. మోదీని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతిపక్షాలు మతపరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. అసోం ప్రజల ఆందోళనలో అర్థం ఉందని, కేంద్ర ప్రభుత్వం దాన్ని గౌరవిస్తోందని చెప్పారు.
ప్రజ్ఞాభారతి చైర్మన్ హనుమాన్ చౌదరి మాట్లాడుతూ.. దేశంలోని మేధావులు అనేకమంది సీఏఏకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. దేశ విభజనను కాంగ్రెస్ చేస్తే, కమ్యూనిస్టులు సమర్థించారని ఆరోపించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులే వేర్పాటువాదులని విమర్శించారు. కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాను చేసిందని చెప్పారు. అలాంటి వారివల్లే దేశం ఇస్లామీకరణ వైపు పోతోందని దుయ్యబట్టారు. సదస్సులో మాజీ డీజీపీ అరవిందరావు, నలంద యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ సునయనసింగ్, మాజీ ఎంపీ వివేక్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment