న్యూఢిల్లీ : ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడించిన వాటి ఎక్కువ సీట్లు గెలుస్తామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఓటమికి సాకులు వెదుక్కునే క్రమంలో విపక్షాలు ఈవీఎంలపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. మంగళవారం రాత్రి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన విందుకు లోక్ జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఈవీఎంలపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ‘ఓటమి ఖాయమని వారికి అర్థమైంది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఈవీఎంలపై కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు ఈవీఎంలను నిందించలేదు ఎందుకు. కనీసం పంజాబ్‌లో గెలిచినప్పుడైనా వారు ఈవీఎంలపై ఉన్న సందేహాలను లేవనెత్తాల్సింది. కానీ అలా చేయలేదు. వాళ్లు ఎన్ని నిందలు వేసినా ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క మాట అనలేదు. కానీ ప్రతిపక్షాలకు నేనొక విషయం చెప్పదలచుకున్నాను. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదు. అర్థమైందా’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ విజయం ఖాయమని, కార్యకర్తలంతా స్వీట్లు, పూలమాలతో సంబరాలు చేసుకునేందుకు సిద్ధమైపోయారని వ్యాఖానించారు.
ఇక తన తనయుడు చిరాగ్ పాశ్వాన్ గురించి మాట్లాడుతూ.. ‘ నాయకుడిగా ఎదిగే అన్ని లక్షణాలు తనకు ఉన్నాయి. ఏ తండ్రి అయినా కొడుకు ప్రయోజకత్వాన్నే కోరుకుంటారు. నేను కూడా అంతే. ముందు ఫలితాలైతే రానివ్వండి. బహుశా తను కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకుంటాడేమో అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దళితులు మరింత అభివృద్ధి చెందుతారని ప్రశంసలు కురిపించారు. కాగా చిరాగ్ పాశ్వాన్ బిహార్‌లోని జమాయి నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా పోటీ చేశారు. కేంద్ర మంత్రిగా రామ్ విలాస్ బిజీగా ఉండగా పార్టీ పగ్గాలు చేపట్టిన చిరాగ్ గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment