
కడప కార్పొరేషన్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద రాజకీయ అవకాశవాది అని, రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చించకుండా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఘోర తప్పిదమని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు.
ఐదు మాసాల క్రితం దీని గురించి ప్రస్తావన వస్తే చంద్రబాబును తమపై రుద్దవద్దని, ఆయన పాపాలను తాము మోయలేమని అప్పుడే చెప్పానన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై ప్రశ్నించే హక్కు ప్రతి కార్యకర్తకు ఉందని, ఈ మేరకే తాను తన నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ కో ఆర్డినేషన్ కమిటీ మెంబర్ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
శనివారం ఆయన వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని వైఎస్‌ఆర్ స్మారక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసినా, చంద్రబాబు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బతీశారన్నారు. అధికారంలోకి వచ్చాక కూడా అయినదానికి, కానిదానికి కాంగ్రెస్‌ను విమర్శిస్తూ భూస్థాపితం చేయాలని, బంగళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారన్నారు.
రాహుల్‌గాంధీ గుంటూరుకు వస్తే నల్ల బ్యాడ్జీలతో నిరసన చేయించారన్నారు. సోనియా, రాహుల్‌ను కించపరుస్తూ ఆయన మాట్లాడిన మాటల క్లిప్సింగ్స్ కుప్పవేస్తే ఓ లారీకి లోడ్ అవుతాయన్నారు. బాబుకు సిద్దాంతాలుగానీ, విధానాలుగానీ లేవని, అధికారం కోసం ఆయన ఎవరితోనైనా కలుస్తాడని, ఎవరితోనైనా విడిపోతాడని ఎద్దేవా చేశారు. 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, అందులో నలుగురికి మంత్రి పదవులిచ్చిన ఈ పెద్దమనిషికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment