సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ‘అసెంబ్లీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ పలాయనం చేసిందని విమర్శించే అర్హత మంత్రులు కేఈ కృష్ణమూర్తి, కాలవ శ్రీనివాసులుకు లేదు. దమ్ముంటే మా పార్టీ నుంచి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలి’ అని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం వైఎస్ ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వం, స్పీకర్ కోడెల శివప్రసాద్ ఖూనీ చేస్తుండడంతో తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారన్నారు. ఈ నిజాన్ని కప్పి పెట్టేందుకు టీడీపీ నాయకులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నేటికీ నెరవేర్చలేదన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేయడమే కాక.. చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి కష్టాలు తెలుసుకొని.. భవిష్యత్తుపై భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ యాత్రతో ఎక్కడ తమ పునాదులు కదులుతాయోనని అధికారపార్టీ నేతలకు భయం పట్టుకుందన్నారు.
ఆయన పేరుకే డిప్యూటీ సీఎం..
కేఈ కృష్ణమూర్తి పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎం అని ఆయనకు ఎలాంటి అధికారాలు లేవని..రెవెన్యూశాఖలో ఆయన మాట చెల్లుబాటు కాదని బీవై రామయ్య ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గమైన పత్తికొండలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా చెరువులు నింపుకోలేకపోయారన్నారు. రాష్ట్రంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా సీఎంను ప్రశ్నించలేని కేఈకి తమ పార్టీపై విమర్శలు చేసే హక్కు లేదన్నారు. సొంత సామాజికవర్గమైన వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పించలేని మంత్రి కాలవ శ్రీనివాసులుకు ఇతరుల గురించి మాట్లాడే అధికారం లేదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేందర్‌రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సీహెచ్ మద్దయ్య, కర్నాటి పుల్లారెడ్డి, శౌరీ విజయకుమారి, రమణ, భాస్కరరెడ్డి, రెహమాన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment