సమావేశంలో మాట్లాడుతున్న కుంతియా. చిత్రంలో గీతారెడ్డి
జహీరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి ఉత్తమ ఫలితాలు సాధిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ప్రధానిని నిర్ణయించే ఎన్నికలని, ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర ఏమాత్రం ఉండబోదన్నారు. ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ, మోదీల మధ్యనే జరుగుతున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పోటీ నామమాత్రమేనన్నారు. దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 22% మంది పేదలను ఆదుకునేందుకు రాహుల్ గాంధీ ఏడాదికి రూ.72 వేలు వారి ఖాతాల్లో వేయాలని నిర్ణయించుకున్నారన్నారు.
కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, అడవుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామన్నారు. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లనే ప్రతిపక్షాలు దెబ్బతిన్నాయనే వాదన బలంగా ఉందన్నారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారని, బ్యాలెట్ విధానంలో ఈ ఎన్నిక జరిగినందున కాంగ్రెస్‌కు అనుకూల ఫలితం వచ్చిందన్నారు. ఏప్రిల్ 1వ తేదీన జహీరాబాద్, వనపర్తి, హుజూర్‌నగర్‌లలో రాహుల్ సభలు జరుగుతాయన్నారు. ఉదయం జహీరాబాద్‌లో సభ ఉంటుందన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే అది మోదీకి ఓటు వేసినట్లు అవుతుందన్నారు. ముస్లింలకు సీఎం కేసీఆర్ 12% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అన్యాయం చేశారన్నారు.
టీఆర్‌ఎస్‌తో జతకట్టిన మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ దీనిపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రకటించిన ఆదాయ భద్రత పథకం వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పించేందుకు తాను ముందుంటానన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు వి.హన్మంతరావు, దామోదర రాజనర్సింహ, జె.గీతారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డిలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment