Ramchandra Kuntia
-
లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుతాం
జహీరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి ఉత్తమ ఫలితాలు సాధిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ప్రధానిని నిర్ణయించే ఎన్నికలని, ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర ఏమాత్రం ఉండబోదన్నారు. ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ, మోదీల మధ్యనే జరుగుతున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ నామమాత్రమేనన్నారు. దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 22% మంది పేదలను ఆదుకునేందుకు రాహుల్ గాంధీ ఏడాదికి రూ.72 వేలు వారి ఖాతాల్లో వేయాలని నిర్ణయించుకున్నారన్నారు. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, అడవుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామన్నారు. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లనే ప్రతిపక్షాలు దెబ్బతిన్నాయనే వాదన బలంగా ఉందన్నారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారని, బ్యాలెట్ విధానంలో ఈ ఎన్నిక జరిగినందున కాంగ్రెస్‌కు అనుకూల ఫలితం వచ్చిందన్నారు. ఏప్రిల్ 1వ తేదీన జహీరాబాద్, వనపర్తి, హుజూర్‌నగర్‌లలో రాహుల్ సభలు జరుగుతాయన్నారు. ఉదయం జహీరాబాద్‌లో సభ ఉంటుందన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఓటు వేస్తే అది మోదీకి ఓటు వేసినట్లు అవుతుందన్నారు. ముస్లింలకు సీఎం కేసీఆర్ 12% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అన్యాయం చేశారన్నారు. టీఆర్ఎస్తో జతకట్టిన మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ దీనిపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రకటించిన ఆదాయ భద్రత పథకం వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పించేందుకు తాను ముందుంటానన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు వి.హన్మంతరావు, దామోదర రాజనర్సింహ, జె.గీతారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. -
సచిన్ పైలట్ లేదా ఆజాద్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియాను మార్చాలని ఏఐసీసీ నిర్ణయించినట్టు తెలిసింది. ఆయన స్థానంలో కేంద్ర మాజీ మంత్రి సచిన్ పైలట్ లేదా రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్‌లలో ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం. వీరిలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోటరీలోముఖ్యుడిగా పేరున్న సచిన్‌కే అవకాశాలు మెండుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గులాం నబీ ఆజాద్ ఉమ్మడి రాష్ట్రానికి పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలను నిర్వహించారు. ఆయన ఇన్చార్జిగా ఉన్నప్పుడే పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్‌పై మంచి పట్టు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా మళ్లీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరిద్దరితోపాటు పార్టీ సీనియర్ నేతలు వయలార్ రవి, రమేశ్ చెన్నితల, ముకుల్ వాస్నిక్ పేర్లు కూడా జాబితాలో ఉన్నాయని ప్రచారంజరుగుతోంది. ఏఐసీసీది అదే అభిప్రాయం! రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ వ్యూహాలను ఎదుర్కోవడానికి కుంతియా సరిపోవడం లేదని రాష్ట్ర పార్టీలో కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయన్ను మార్చి మరో నేతకు బాధ్యతలు అప్పగించాలని జాతీయస్థాయిలో సంబంధాలున్న కొందరు నేతలు రాహుల్‌ను కోరినట్టుగా తెలిసింది. పార్టీలో యువతరానికి పెద్దపీట వేయాలని భావిస్తున్న రాహుల్‌తోపాటు ఏఐసీసీ ముఖ్యులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలిసింది. ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి నూతన రూపు వంటి కసరత్తులు పూర్తయిన వెంటనే రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. -
2019 ఎన్నికల్లో కెప్టెన్ ఉత్తమే
► ఆయన నిర్ణయమే ఫైనల్: కుంతియా ► పార్టీలో ఎవరినీ విస్మరించం ► కట్టు తప్పితే ఎంతవారైనా వేటు తప్పదు ► ఒకట్రెండు నెలల్లో పార్టీలో భారీ మార్పులు సాక్షి, హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోనే ముందుకె ళ్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి ఆయన నిర్ణ యమే అంతిమమని తేల్చి చెప్పారు. ఎన్నికల దాకా మార్పులేమీ ఉండబోవని, పార్టీ ఇన్ చార్జిగా తాను, టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమారే ఉంటారన్నారు. సోమవారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకరులతో కుంతియా మాట్లాడుతూ పార్టీలో ఎవరినీ విస్మరించబో మని, అందరూ కలసి పనిచేసేలా చొరవ తీసు కుంటానన్నారు. ఉత్తమ్ పని తీరుపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహల్‌గాంధీ, అధిష్టానం సంతృప్తిగా ఉందన్నారు. పార్టీలోని ఏ స్థాయి నాయకుడైనా క్రమశిక్షణకు లోబడి పని చేయా లని, క్రమశిక్షణను ఉల్లంఘించి కట్టుతప్పితే ఎంత పెద్ద నాయకుడి విషయంలోనైనా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పార్టీ గెలుపు, బలోపేతం కోసం ఎవరికీ భయపడేది లేద న్నారు. ఒకట్రెండు నెలల్లో భారీ మార్పులుం టాయన్నారు. పార్టీ బలోపేతం కోసం కొన్ని కఠిన చర్యలు తీసుకొంటామన్నారు. కేసీఆర్ కుటుంబమే లాభపడుతోంది తెలంగాణ ఎందుకు ఇచ్చామో, మూడేళ్ల టీఆర్ ఎస్ పాలనలో ఆకాంక్షలు ఎంత వరకు నెరవే రాయో ప్రజలకు అర్థమవుతోందని కుంతియా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం తప్ప తెలంగాణ కోసం ఉద్యమిం చిన వర్గాలు, ప్రజలకు రాష్ట్రంలో ప్రయోజనం కలగడం లేదని ఆయన విమర్శించారు. తమ పోరాటం వ్యక్తులపై కాదని, విధానాలు, ప్రజాసమస్యలపైనేనన్నారు. కొన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ ఓటమికి రాహుల్ గాంధీని తప్పు బడుతున్నారని, మరి గెలిచిన రాష్ట్రాల్లో ఘనత ఎవరిదో కూడా చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉండాలా లేదా అనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని, ఇప్పటిదాకా పొత్తుల గురించి చర్చ జరగలేదని, టీపీసీసీ కూడా ప్రతిపా దనలు పంపలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కనీ సం ఆరు నెలలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని కుంతియా వెల్లడించారు. టీపీసీసీ సమన్వయ కమిటీని కుదిస్తామని కుంతియా చెప్పారు. తమ పార్టీపై తెలం గాణ ప్రజలకు విశ్వాసముందని, సంగా రెడ్డిలో జరిగిన బహిరంగ సభ విజయ వంతం కావడమే దీనికి నిదర్శనమన్నారు. తెలంగాణలోని ప్రతి మండలానికీ వెళ్లి అన్ని స్థాయిల్లోని నేతల మధ్య విబేధాలను పరిష్క రిస్తామన్నారు. రాహుల్ సందేశ్ యాత్రలను ఎన్నికల దాకా కొనసాగి స్తామని కుంతియా చెప్పారు. అధికారమే లక్ష్యంగా పని చేయండి వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అను బంధ సంఘాలు పనిచేయాలని కుంతియా కోరారు. సోమవారం గాంధీ భవన్లో యువజన, మహిళా కాంగ్రెస్ సమావేశాలు వేర్వేరుగా జరిగాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, పార్టీ ఇన్చార్జి కార్యదర్శి సతీశ్, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ, ఎమ్మెల్యే సంపత్ కుమార్‌తోపాటు పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సంద ర్భంగా కుంతియా మాట్లాడుతూ విద్యా ర్థులు, యువజనులు ఉద్యమించడం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని, ఇప్పుడు వారినే టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయిం బర్స్మెంట్ చేయకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసగిస్తోందని మండిపడ్డారు. వాటి కోసం యువత పెద్ద ఎత్తున ఉద్యమించాలని, ప్రతి గ్రామంలో యువజన కాంగ్రెస్ కార్యవర్గాలను ఏర్పాటు చేసి ప్రభుత్వంపై పోరాడాలని కుంతియా పిలుపునిచ్చారు. సమావేశంలో సేవాదళ్ చైర్మన్ కె.జనార్దన్‌రెడ్డి, ఓబీసీ సెల్ చైర్మన్ చిత్తరంజన్‌దాస్, లీగల్ సెల్ చైర్మన్ దామోద ర్‌రెడ్డి, మైనారిటీ సెల్ చైర్మన్ ఫక్రుద్దీన్, కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి, ఎస్టీ సెల్ చైర్మన్ జగన్‌లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కాగా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, అనుబంధ సంఘాల ఇన్చార్జి మల్లు భట్టి విక్రమార్క గైర్హాజరు కావడంపై పలువురు నేతలు చర్చించుకున్నారు. -
అధికారంలోకి రావాలంటే ఏం చేద్దాం!
కాంగ్రెస్ నేతలతో కుంతియా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలన్న అంశంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా ఆదివారం గాంధీభవన్‌లో ముఖ్యనేతలతో సమాలోచనలు జరిపారు. మల్లు భట్టివిక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, రేణుకాచౌదరి, దామోదర రాజనర్సింహ, దానం నాగేందర్, పొన్నం ప్రభాకర్, జగ్గారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులతో ఆయన విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వైఫల్యాలపై పాదయాత్ర చేస్తానని పార్టీ ఇన్చార్జి కుంతియాకు చెప్పినట్టుగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. పార్టీ ముఖ్యనేతలందరినీ కలుపుకొని పోవాలని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ప్రస్తుత నాయకత్వం ఏకపక్షంగా పనిచేస్తోందని ఆరోపించారు. మూడు నెలలకోసారి భారీ బహిరంగసభను నిర్వహించాలని, ఒక్కో జిల్లాలో ఒక్కో అంశంపై సభను పెట్టాలని జగ్గారెడ్డి సూచించారు. -
రాష్ట్ర నాయకత్వంలో మార్పుండదు
► కేసీఆర్‌కు అధికారయావ తప్ప సిద్ధాంతాలు లేవు ► మీడియాతో ఆర్సీ కుంతియా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ సారథ్యం మారదని, ఇప్పుడున్న నాయకుల ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ రామచంద్ర కుంతియా స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, నేతలు మల్లు రవి, అనిల్‌కుమార్ యాదవ్ తదితరులతో కలసి గాంధీభవన్‌లో మీడియాతో కుంతియా సుదీర్ఘంగా మాట్లాడారు. ఉత్తమ్, భట్టి, జానారెడ్డి, షబ్బీర్‌అలీ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో రాహుల్‌గాంధీ తేలుస్తారని, ఇప్పుడే చెప్పే అధికారం తనకు లేదని కుంతియా అన్నారు. తెలంగాణ ప్రజల మనోభా వాలను, ఆర్తిని సోనియాగాంధీ అర్థం చేసుకుని తెలంగాణ ఇచ్చిందన్నారు. భావోద్వే గాలను రెచ్చగొట్టి కేసీఆర్ రాజకీయంగా లబ్దిపొందారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఇచ్చిన ఉద్దేశం టీఆర్ఎస్ అధికారంలోకి రావడం వల్ల నెరవేరడంలేదన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు మినహా తెలంగాణ లోని ఏ వర్గమూ స్వరాష్ట్రం వల్ల లబ్దిపొందడం లేదని కుంతియా విమర్శించారు. కేసీఆర్ వల్లనే తెలంగా ణ ఏర్పాటై ఉంటే సోనియాగాంధీని ఎందుకు కలిశారని ప్రశ్నించారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే యావ తప్ప రాజకీయ సిద్ధాంతాలు, విలువలు ఏవీ టీఆర్ఎస్కు లేవన్నారు. మార్పులేమిటో త్వరలో చూస్తారు కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని, ఒకరిద్దరు నాయకులు వ్యక్తిగత ప్రయోజనాలకోసం పార్టీని వీడారని కుంతియా చెప్పారు. పార్టీ మారినవారు తిరిగి కాంగ్రెస్ లోకి వస్తామంటే అప్పటి పరిస్థితిని, స్థానిక అంశాలను బట్టి నిర్ణయాలు ఉంటాయన్నారు. అయితే అంతర్గత క్రమశిక్షణ అంశంలో చాలా మార్పులు వస్తాయని, ఒకట్రెండు నెలల్లో మార్పులేమిటో చూస్తారని నర్మగర్భంగా కుంతియా వ్యాఖ్యానించారు. పార్టీని అధికారం లోకి తీసుకురావాలని పూర్తిస్థాయి ఇన్చార్జి బాధ్యతలతో తనను రాహుల్‌గాంధీ పంపిన ట్టు వెల్లడించారు. సిరిసిల్లలో దళితులు, బలహీ నవర్గాలపై ప్రభుత్వమే దాడులు చేయించిం దని, దీనిపై ఇప్పటికే మానవహక్కుల సంఘా నికి ఫిర్యాదు చేశామన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి వారివల్ల తెలంగాణకు కాంగ్రెస్ వ్యతిరేక మనే భావన క్షేత్రస్థాయిలో ఏర్పడిందని, ఇది పార్టీకి నష్టం కలిగించిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో తిరుగులేదన్నారు. తెలంగాణలో బీజేపీకి ఎదిగే అవకాశాలు లేవని, టీడీపీ అసలు లేదన్నారు. కాగా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టివిక్రమార్క పాదయాత్ర ప్రతిపాదన సంగతి తనకు తెలియదని కుంతియా స్పష్టం చేశారు. నియోజకవర్గ స్థాయిలో పాదయాత్రతో తమకు అభ్యంతరం లేదని, రాష్ట్రమంతా పాద యాత్ర చేయాలనుకుంటే పార్టీలో చర్చించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా కుంతియా స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా కుంతియా
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా రామచంద్ర కుంతియాను అధిష్టానం నియమించింది. ఆగస్టు 8వ తేదీన వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆయనకు అధిష్టానం లేఖ పంపింది. సహజంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శికి మాత్రమే సీడబ్యూసీ సభ్యులుగా అవకాశం ఇస్తారు. అయితే ప్రధాన కార్యదర్శిగా కుంతీయాను నియమించకున్నా, ఆయనకు సీడబ్యూసీలో అవకాశం ఇవ్వడంతో త్వరలోనే ఆయనకు ప్రధాన కార్యదర్శిగా కూడా నియమిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో కుంతీయానే రాబోయే రోజుల్లో తెలంగాణకు దీర్ఘకాల ఇంచార్జ్‌గా ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణకు కార్యదర్శిగా ఉన్న కుంతీయాను ప్రధాన కార్యదర్శిఇంచార్జ్గా నియమించిన ఏఐసీసీ దీర్ఘకాలికంగా కొనసాగిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి దిగ్విజయ్ సింగ్‌ను తొలగించిన విషయం తెలిసిందే. -
1న మోదీ, కేసీఆర్ పాలనలపై చార్జిషీట్
ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా వెల్లడి సంగారెడ్డి టౌన్: జూన్ 1న తలపెట్టిన ‘తెలంగాణ ప్రజా గర్జన సభ’ ద్వారా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పాలనా వైఫల్యాలపై ఏఐసీసీ ఉపాధ్య క్షుడు రాహుల్‌గాంధీ చార్జిషీటు విడుదల చేస్తారని ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతి యా అన్నారు. రాహుల్ పాల్గొనే సభకు సంబంధించి సోమవారం వేదిక భూమి పూజ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సభ అనంతరం రాహుల్‌గాంధీ విడుదల చేసిన చార్జిషీటును రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పోలింగ్ బూత్‌స్థాయి వరకు తీసుకెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. 111 సీట్లు గెలుస్తామని కేసీఆర్ చెప్పారని, అత్యంత ప్రజాదరణ గల నేత అయితే మిగతా పార్టీల వారిని తమ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను వీడే నాయకులతో నష్టం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో 50 శాతం టిక్కెట్లు యువతకు ఇస్తామన్నారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమన్నారు. కాగా సభకు రాహుల్‌గాంధీ హాజరుకానున్న నేపథ్యంలో ఎస్పీజీ డీఐజీ సౌమిత్రాదాస్ సోమవారం సభాస్థలిని పరిశీలించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఎస్పీ కార్యాలయంలో టీపీసీసీ అధికార ప్రతినిధి జగ్గారెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి తదితరులతో డీఐజీ సౌమిత్రాదాస్ సమావేశమయ్యారు.