
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియాను మార్చాలని ఏఐసీసీ నిర్ణయించినట్టు తెలిసింది. ఆయన స్థానంలో కేంద్ర మాజీ మంత్రి సచిన్ పైలట్ లేదా రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్‌లలో ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం. వీరిలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోటరీలోముఖ్యుడిగా పేరున్న సచిన్‌కే అవకాశాలు మెండుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గులాం నబీ ఆజాద్ ఉమ్మడి రాష్ట్రానికి పార్టీ ఇన్‌చార్జిగా బాధ్యతలను నిర్వహించారు. ఆయన ఇన్‌చార్జిగా ఉన్నప్పుడే పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్‌పై మంచి పట్టు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా మళ్లీ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరిద్దరితోపాటు పార్టీ సీనియర్ నేతలు వయలార్ రవి, రమేశ్ చెన్నితల, ముకుల్ వాస్నిక్ పేర్లు కూడా జాబితాలో ఉన్నాయని ప్రచారంజరుగుతోంది.
ఏఐసీసీది అదే అభిప్రాయం!
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, టీఆర్‌ఎస్ వ్యూహాలను ఎదుర్కోవడానికి కుంతియా సరిపోవడం లేదని రాష్ట్ర పార్టీలో కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయన్ను మార్చి మరో నేతకు బాధ్యతలు అప్పగించాలని జాతీయస్థాయిలో సంబంధాలున్న కొందరు నేతలు రాహుల్‌ను కోరినట్టుగా తెలిసింది. పార్టీలో యువతరానికి పెద్దపీట వేయాలని భావిస్తున్న రాహుల్‌తోపాటు ఏఐసీసీ ముఖ్యులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలిసింది. ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి నూతన రూపు వంటి కసరత్తులు పూర్తయిన వెంటనే రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.