రాష్ట్ర నాయకత్వంలో మార్పుండదు
► కేసీఆర్‌కు అధికారయావ తప్ప సిద్ధాంతాలు లేవు
► మీడియాతో ఆర్‌సీ కుంతియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ సారథ్యం మారదని, ఇప్పుడున్న నాయకుల ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ రామచంద్ర కుంతియా స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, నేతలు మల్లు రవి, అనిల్‌కుమార్ యాదవ్ తదితరులతో కలసి గాంధీభవన్‌లో మీడియాతో కుంతియా సుదీర్ఘంగా మాట్లాడారు. ఉత్తమ్, భట్టి, జానారెడ్డి, షబ్బీర్‌అలీ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో రాహుల్‌గాంధీ తేలుస్తారని, ఇప్పుడే చెప్పే అధికారం తనకు లేదని కుంతియా అన్నారు. తెలంగాణ ప్రజల మనోభా వాలను, ఆర్తిని సోనియాగాంధీ అర్థం చేసుకుని తెలంగాణ ఇచ్చిందన్నారు. భావోద్వే గాలను రెచ్చగొట్టి కేసీఆర్ రాజకీయంగా లబ్దిపొందారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఇచ్చిన ఉద్దేశం టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం వల్ల నెరవేరడంలేదన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు మినహా తెలంగాణ లోని ఏ వర్గమూ స్వరాష్ట్రం వల్ల లబ్దిపొందడం లేదని కుంతియా విమర్శించారు. కేసీఆర్ వల్లనే తెలంగా ణ ఏర్పాటై ఉంటే సోనియాగాంధీని ఎందుకు కలిశారని ప్రశ్నించారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే యావ తప్ప రాజకీయ సిద్ధాంతాలు, విలువలు ఏవీ టీఆర్‌ఎస్‌కు లేవన్నారు.
మార్పులేమిటో త్వరలో చూస్తారు
కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని, ఒకరిద్దరు నాయకులు వ్యక్తిగత ప్రయోజనాలకోసం పార్టీని వీడారని కుంతియా చెప్పారు. పార్టీ మారినవారు తిరిగి కాంగ్రెస్ లోకి వస్తామంటే అప్పటి పరిస్థితిని, స్థానిక అంశాలను బట్టి నిర్ణయాలు ఉంటాయన్నారు. అయితే అంతర్గత క్రమశిక్షణ అంశంలో చాలా మార్పులు వస్తాయని, ఒకట్రెండు నెలల్లో మార్పులేమిటో చూస్తారని నర్మగర్భంగా కుంతియా వ్యాఖ్యానించారు.
పార్టీని అధికారం లోకి తీసుకురావాలని పూర్తిస్థాయి ఇన్‌చార్జి బాధ్యతలతో తనను రాహుల్‌గాంధీ పంపిన ట్టు వెల్లడించారు. సిరిసిల్లలో దళితులు, బలహీ నవర్గాలపై ప్రభుత్వమే దాడులు చేయించిం దని, దీనిపై ఇప్పటికే మానవహక్కుల సంఘా నికి ఫిర్యాదు చేశామన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి వారివల్ల తెలంగాణకు కాంగ్రెస్ వ్యతిరేక మనే భావన క్షేత్రస్థాయిలో ఏర్పడిందని, ఇది పార్టీకి నష్టం కలిగించిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో తిరుగులేదన్నారు. తెలంగాణలో బీజేపీకి ఎదిగే అవకాశాలు లేవని, టీడీపీ అసలు లేదన్నారు. కాగా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టివిక్రమార్క పాదయాత్ర ప్రతిపాదన సంగతి తనకు తెలియదని కుంతియా స్పష్టం చేశారు. నియోజకవర్గ స్థాయిలో పాదయాత్రతో తమకు అభ్యంతరం లేదని, రాష్ట్రమంతా పాద యాత్ర చేయాలనుకుంటే పార్టీలో చర్చించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా కుంతియా స్పష్టం చేశారు.