న్యూఢిల్లీ: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) నాయకుడు, ఎంపీ రాందాస్ అథవాలే బుధవారం పార్లమెంటులో నవ్వుల పువ్వులు పూయించారు. సమయానుకూలంగా ఛలోక్తులు విసిరి.. ప్రత్యర్థులను సైతం నవ్వుల్లో ముంచెత్తగల నేతగా పేరొందిన ఆయన.. లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాను అభినందిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా అభినందనలు తెలుపాలనుకుంటున్నట్టు చెప్పారు. అమేథిలో ఓడిపోయిన రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే.
‘అక్కడ (ప్రతిపక్ష బెంచీల మీద) కూర్చునే అవకాశం వచ్చినందుకు మీకు నా అభినందనలు. మీరు కూడా నాకు మిత్రులే. మీరు అధికారంలో ఉన్నప్పుడు నేను మీతోనే ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరుగుతుంది. ఎన్నికలకు ముందు మా వైపు రండి అంటూ కాంగ్రెస్ వాళ్లు పిలిచారు. కానీ, గాలి వైపు చూస్తే.. అది మోదీ వైపు వీస్తోంది. అక్కడి వచ్చి నేనేం చేస్తాను’ అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ప్రధాని మోదీ సహా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నవ్వులు చిందించారు. గతంలో యూపీఏ కూటమిలో ఉన్న రాందాస్ అథవాలే 2014 ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరిన సంగతి తెలిసిందే.
ప్రస్తుత ఐదేళ్లే కాకుండా మరో ఐదేళ్లు, ఇంకో ఐదేళ్లు తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, మోదీ సాహిబ్ మంచి పని చేస్తూనే ఉంటారని, మీరు అంత సులభంగా ఇటువైపు (అధికార బెంచీల వైపు) రాకుండా అడ్డుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment