
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీల మధ్య ఢిల్లీలో మహారాష్ట్ర పరిణామాలపై కీలక భేటీ జరగగా, మరోవైపు బీజేపీ-శివసేనల మధ్య నయా ఫార్ములా తెరపైకి వచ్చింది. కేంద్రమంత్రి రాందాస్ అథవలే ఈ దిశగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మహారాష్ట్రలో బీజేపీ-సేన సంకీర్ణ సర్కార్ ఏర్పాటుపై శివసేన నేత సంజయ్ రౌత్‌తో సంప్రదింపులు జరిపానని మూడేళ్లు బీజేపీ సీఎం, రెండేళ్లు శివసేన సీఎం ఉండేలా సరికొత్త ఫార్ములాను ప్రతిపాదించానని రాందాస్ అథవలే చెప్పుకొచ్చారు. తన ప్రతిపాదనపై రౌత్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ ప్రతిపాదనపై తాను బీజేపీతో సంప్రదింపులు జరుపుతానని ఆయన తనకు చెప్పారని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక సోనియాతో భేటీ అనంతరం శరద్ పవార్ మాట్లాడుతూ మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై తాము చర్చించామని, అయితే శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు అంశం ప్రస్తావనకు రాలేదని చెప్పారు. కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు చర్చించిన మీదట చర్చల పురోగతిని వారు తమకు వివరిస్తారని అన్నారు.