
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి మరణం తర్వాత తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించినట్లుగానే కన్పిస్తున్నాయి. తమిళనాడులో పాగా వేసేందుకు ఎప్పటి నుంచో ఎదురుచూస్త్ను బీజేపీకి.. పళనిసామి స్నేహహస్తం అందించేందుకు సిద్ధమయ్యారనే సంకేతాలు వెలువడుతున్నాయి. కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు ఇటువంటి సంకేతాలకు మరింత బలాన్ని చేకూర్చాయి.
స్నేహబంధం కొనసాగుతుంది..
సోమవారం చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన రాందాస్... దివంగత ఎంజీఆర్, జయలలిత వంటి నేతలు కేంద్రంతో సన్నిహితంగా మెలిగేవారని, ఇప్పుడు వారి ఆశయ సాధనలో నిమగ్నమైన ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని పళని ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఉభయసభల్లోనూ అన్నాడీఎంకే సభ్యులు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. ఈ స్నేహబంధం కొనసాగుతుందని పేర్కొంటూ, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో అన్నాడీఎంకే తప్పని సరిగా ఉంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాందాస్ వ్యాఖ్యలతో ఇరకాటంలో అధికార పార్టీ..
కేంద్రం అడుగులకు మడుగులు వొత్తే రీతిలో రాష్ట్రంలోని అన్నాడీఎంకే పాలకులు వ్యవహరిస్తున్నారంటూ పళని ప్రభుత్వంపై విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఉభయసభల్లో బీజేపీకి అనుకూలంగా అన్నాడీఎంకే ఓట్లు వేయడం, కేంద్ర పథకాలన్నీ రాష్ట్రంలో ఒక దాని తర్వాత మరొకటి అమల్లోకి రావడం వంటి విషయాలు గమనిస్తుంటే.. కేంద్రం దర్శకత్వంలో రాష్ట్రంలో అన్నాడీఎంకే పాలన సాగుతుందన్న ప్రచారం సైతం ఊపందుకుంది. ఈ ప్రచారాన్ని ఆసరాగా చేసుకున్న ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శల దూకుడును పెంచాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలతో పళని ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment