టీడీపీ కార్యక్రమాల్లో కోడెల, ఆయన తనయుడితో కలిసి పాల్గొన్న రేషన్ మాఫియా కింగ్ శీలు బాబూరావు (సర్కిల్‌లో ఉన్న వ్యక్తి)
అధికార పార్టీ నేతలు పేదలకు అందాల్సిన బియ్యంపై రాబందుల్లా వాలుతున్నారు. నాలుగేళ్లుగా రేషన్ బియ్యాన్ని అడ్డగోలుగా బొక్కేసి.. అభాగ్యుల ఎండిన డొక్కలపై పస్తుల రాత రాస్తున్నారు. పెద్దోళ్ల అండతో పేదోళ్ల నోటికాడ ముద్దను లాగేసుకుంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని హద్దూఅదుపూ లేకుండా అక్రమాలకు తెగబడుతున్నారు. అధికారంలో ఉండి సంక్షేమాన్ని అందించాల్సిందిపోయి..అడ్డగోలు దోపిడీతో ప్రజలను నిత్యం క్షోభ పెడుతున్నారు. తాజాగా రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో నరసరావుపేట టీడీపీ కౌన్సిలర్ బాబూరావును పోలీసులు అరెస్టు చేసి కోర్టుకీడ్చారు. నిందితుడ్ని భుజానికెత్తుకున్న టీడీపీ యువనేత.. ఆయనను వదిలేయాలంటూ ఒత్తిళ్లకు దిగారు.
సాక్షి, గుంటూరు: రేషన్ బియ్యాన్ని అధికార పార్టీ నేతలు పందికొక్కుల్లా బొక్కేస్తున్నారు. నరసరావుపేటలో రేషన్ మాఫియా నడుపుతున్న టీడీపీ కౌన్సిలర్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడ్ని వదిలేయాలంటూ అధికార పార్టీ ముఖ్య నేతలు పోలీసులపై ఒత్తిడి పెంచారు. అందుకు పోలీసు ఉన్నతాధికారులు అంగీకరించకపోవడంతో అధికార పార్టీకి చెందిన రేషన్ డీలర్లు పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులకు పట్టుబడ్డ టీడీపీ కౌన్సిలర్‌పై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. అయితే అప్పట్లో పోలీసు అధికారులు తూతూమంత్రంగా కేసులు కట్టి వదిలేశారు.
అన్నింటా వాళ్లే..
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేషన్ బియ్యం నుంచి ఇసుక, మైనింగ్, చివరికి మట్టితో సహా అధికార పార్టీ ముఖ్యనేతలే అక్రమ రవాణాకు పాల్పడుతున్న వైనం అందరికి తెలిసిందే. నరసరావుపేట శివారు ప్రాంతంలో రేషన్ అక్రమ రవాణా చేస్తున్న కొందరిని అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారించగా.. దీనికి ప్రధాన సూత్రధారి నరసరావుపేట మున్సిపల్ కౌన్సిలర్ శీలు బాబూరావు అని తేలింది. ఆయను అదుపులోకి తీసుకోవడంతో రంగంలోకి దిగిన అధికార పార్టీ ముఖ్య నేత తనయుడు పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు అరెస్టు చేశామని, ఇందులో తామేమీ చేయలేమని స్థానిక పోలీసులు చేతులెత్తేశారు.
విచారణలో వాస్తవాలు కక్కుతాడని..
బాబూరావును విచారిస్తే ఏ రేషన్ దుకాణాల నుంచి సరుకు వెళ్లిందో తేలుతుందనే భయంతో టీడీపీకి చెందిన కొందరు డీలర్లు నేరుగా పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళన చేశారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉండటంతో బాబూరావుతో సహా నిందితులను కోర్టులో హాజరపరిచి రిమాండ్‌కు తరలించారు. బాబూరావు నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో రేషన్ మాఫియా నడుపుతున్నారనే విషయం పోలీసులకు పట్టుబడ్డ నిందితులు చెప్పినట్లు సమాచారం. ఈ రెండు నియోజకవర్గాల్లో అధికార పార్టీ ముఖ్య నేత తనయునితోపాటు కొందరు పోలీసు అధికారులకు సైతం భారీ మొత్తంలో మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగానే బాబూరావుపై గతంలో రేషన్ అక్రమ రవాణా కేసు నమోదయినప్పటికీ అరెస్టు చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపినట్లు తెలిసింది.
గతంలోనూ బాబూరావుపై కేసులు
నరసరావుపేటలో కేబుల్ వైర్లు కట్ చేసి దొంగిలించిన కేసులో బాబూరావు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అప్పట్లో ఆయనపై కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేయడంతో 2016లో నల్లపాటి రాము అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే బాబూరావు, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ కొడుకు శివరామ్‌పై కేసు నమోదు చేయాలని హైకోర్టు అదేశించింది. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు రెండేళ్లు కావస్తున్నా విచారణ పేరుతో తాత్సారం చేస్తున్నారు. నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్లలో రేషన్ అక్రమాలు జరుగుతున్నాయంటూ పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ అధికారిక సమావేశంలోనే రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇంత జరిగినా నరసరావుపేట నియోజకవర్గంలో రేషన్ అక్రమ రవాణా ఆగడం లేదంటే అధికార పార్టీ ముఖ్యనేతల అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థః చేసుకోవచ్చు. రెండు, మూడు సార్లు రేషన్ అక్రమ రవాణా కేసుల్లో అరెస్టయిన టీడీపీ కౌన్సిలర్ శీలు బాబూరావుపై కఠిన చట్టాలు ప్రయోగించాలని పేదలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment