మిల్లులో రేషన్ బియ్యాన్ని పరిశీలిస్తున్న అధికారులు
వినుకొండ టౌన్ / రూరల్ : అధికార పార్టీ నాయకుని రైస్ మిల్లులో రేషన్ బియ్యం రిసైక్లింగ్ జరుగుతుండగా కార్మికుడు మృతి చెందడంతో అవినీతి వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి చెందిన మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సనిశెట్టి లక్మీనారాయణ మండలంలోని తిమ్మాయిపాలెం దళితవాడలో కొంత కాలంగా సాయి శరణ్య రైస్‌మిల్లు నడుపుతున్నాడు. ధాన్యం కొనుగోలు చేసి వాటిన రైస్‌గా తయారు చేసి విక్రయించాల్సిన ఆయన అక్రమాలకు పాల్పడ్డాడు. రేషన్ బియ్యాన్ని డీలర్ల నుంచి సేకరించి మిల్లులో పాలిష్ చేసి ఇతర ప్రదేశాలకు రవాణా చేస్తున్నాడు. బియ్యాన్ని రిసైక్లింగ్ చేస్తుండగా బడ్డీ ఒక్కసారిగా కూలిపోయి మిల్లు డ్రైవర్ షేక్‌హుస్సేన్(35) ప్రమాదవశాత్తు మృతి చెందడంతో రీసైక్లింగ్ వ్యవహారం బయటపడింది.
అధికారుల కనుసన్నల్లో రేషన్ బియ్యం రవాణ
అధికారుల కనుసన్నల్లో పేదల బియ్యం నల్లబజారుకు తరలుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం ఉదయం 8 నుంచి 9గంటల మధ్య జరిగితే సాయంత్ర 4గంటల వరకు ఏఒక్క అధికారి కూడా సంఘటన స్థలాన్ని సందర్శించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీఆర్వో సునీతకు ఉదయం 10గంటల సమయంలో వీఏవో కోటయ్య సమాచారం అందిచాడని చెబుతున్నారు. సమాచారాన్ని ఆమె తహసీల్దారు గౌస్‌బుడేసాహెబ్‌కు 12గంటల ప్రాంతలో చెప్పినట్లు విలేకర్లతో చెప్పారు. రైస్ మిల్లు డ్రైవర్ బడ్డి కింద ఇరుక్కు పోయి ఉంటే హుటాహుటిన అధికారులు వెళ్లకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
నేతల బెదిరిపులకు తలొగ్గిన అధికారులు
వీఆర్వో సునీత మిల్లును సందర్శించి అక్కడకు అధికారులను రప్పించాల్సి ఉండగా, అక్కడ ఎందుకులేరన్న వాదనలు విన్పిస్తున్నాయి. కొందరు టీడీపీ నేతలు అధికారులకు ఫోన్లు చేసి బెదిరించినట్లు తెలుస్తోంది. దీనివల్ల మిల్లును ఏ అధికారి కూడా వెంటనే సందర్శించే ప్రయత్నం చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాటు సంఘటన జరిగిన సమయంలో లారీలకు బియ్యం లోడుచేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. మిల్లులో దాదాపు 350 క్వింటాళ్ల బియ్యం ఉన్నాయని చెబుతున్నారు. ప్రతి నెలా గ్రామాల్లో బియ్యాని కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి రవాణా చేయడం పరిపాటిగా మారింది. గత ఏడాది నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు రోడ్డులో అధికారుల పట్టుకున్న రేషన్ బియ్యం ఇక్కడ నుంచే రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది.
యాజమానికి కొమ్ముకాస్తున్న అధికారులు
మిల్లు డ్రైవరు మృతిచెందిన విషయాన్ని యాజమాన్యం మధ్యాహ్నం వరకు గోప్యంగా ఉంచింది. మృతదేహన్ని వినుకొండకు తరలించిన తర్వాత మిల్లులో ఉన్న సుమారు మూడు లారీల బియ్యాన్ని మార్కెటు యార్డులోని కూలీలతో బయటకు తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు.
అక్రమ రేషన్ బియ్యానికి కాపలా కాచిన సీఎస్‌డీటీ
మృతి చెందిన హుస్సేన్‌ను వినుకొండ ప్రభుత్వవైద్యశాలకు తరలించిన అనంతరం సీఎస్‌డీటీ జాన్‌సైదులు మిల్లు వద్దకు వచ్చారు. అదే సమయంలో కూలీలు బియ్యాన్ని సంచులకు ఎత్తుతున్నా అడ్డుకున్న దాఖలాలు లేవు. మిల్లు వద్ద ఆయనే నిలబడి బియ్యాన్ని బయటకు తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. కొంతసేపటికి వినుకొండ తహసీల్దార్ గౌస్ బుడేసాహెబ్, ఆర్‌ఐ మురళీ, వీఆర్వో సునీత మిల్లులో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని చూసి అవాక్కయ్యారు.
మిల్లును పరిశీలించిన పోలీసులు
ప్రమాదం జరిగిన వైనాన్ని తెలుసుకొనేందుకు వినుకొండ టౌన్, రూరల్ సీఐలు టి.వి. శ్రీనివాసరావు, బి. కోటేశ్వరరావు మిల్లును పరిశీలించారు. కొంతకాలంగా రేషన్‌బియ్యం అక్రమ వ్యాపారం కొనసాగుతున్నట్లు స్థానికులు పోలీసుల దృష్టికి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment