సాక్షి, అమరావతి : ఏపీకి మూడు రాజధానులు ఉండాలని సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలను స్వాగతిస్తున్నానని, అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమవుతుందని వైఎస్సార్‌సీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ఆలోచన చేశారన్నారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబు చెప్పారని, అయితే అప్పట్లో అలా చేయడం వల్లే రాష్ట్రం విడిపోవాల్సిన పరిస్థితులకు దారి తీసిందన్నారు. రాయలసీమకు పట్టిన శని చంద్రబాబు అని, ఆయన 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నా ఈ ప్రాంతానికి చేసింది శూన్యమన్నారు.
రాయలసీమకు రాజధాని కాకపోయినా కనీసం హైకోర్టు ఇవ్వాలని చంద్రబాబును ఎన్నో సార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. అసలు రాయలసీమకు చంద్రబాబు చేసిన వాగ్దానాల్లో నెరవేర్చింది ఒక్కటీ లేదన్నారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షలను జగన్ నెరవేస్తున్నారని, సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు బాగా వెనుకబడి ఉన్నాయని, జీఎన్ రావు కమిటీ నివేదిక కూడా ప్రజాభిప్రాయం మేరకే వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలకు రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు అనుకూలమో... వ్యతిరేకమో చెప్పాలని శిల్పా డిమాండ్ చేశారు. రాజధానిలో చంద్రబాబు, ఆయన మనుషులు కొన్న భూములకు రేట్లు తగ్గి పోతాయని భయపడి పోతున్నారని అసలు కారణం అదేనన్నారు.
త్యాగం చేసిన కర్నూలుకు న్యాయం
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
తెలుగు ప్రజల ఐక్యత కోసం గతంలో రాజధానిని త్యాగం చేసిన కర్నూలుకు సీఎం జగన్ వల్ల న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1953 నుంచి మూడేళ్ల పాటు కర్నూలు రాజధానిగా ఉండేదని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసమే రాజధానిని కర్నూలు ప్రజలు వదులుకున్నారన్నారు. రాష్ట్ర విభజన తరువాత కర్నూలుకు న్యాయం జరుగుతుందని భావించినప్పటికీ సీఎంగా చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు.
వెనుకబడిన రాయలసీమ జిల్లాకు కనీసం జ్యూడీషియల్ కేపిటల్ ఇస్తే ఇప్పటికైనా అంతో ఇంతో అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. రాజధాని కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ప్రభుత్వం సముచితంగా స్పందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా కర్నూలు ప్రజలు హైకోర్టు కావాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఏది కోరుటున్నారో అదే జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని, దీన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. రాజధానిలో చంద్రబాబు, ఆయన మనుషులు నాలుగు వేల ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని అన్నారు. స్వప్రయోజనాల కోసం చంద్రబాబు సీఆర్డీఏ పరిధిని పెంచుకున్నారని, దీనిపై విచారణ జరిపించాలని హఫీజ్‌ఖాన్ డిమాండ్ చేశారు.
సీమకు చంద్రబాబు చేసిందేమీ లేదు
Published Thu, Dec 19 2019 4:12 AM | Last Updated on Thu, Dec 19 2019 4:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment