విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతున్న విద్యార్థి జేఏసీ నాయకుడు రాయపాటి జగదీష్
ఒంగోలు: విద్యార్థి సంఘం ముసుగులో కాలేజీల్లో రాజకీయ ప్రచారాలు చేస్తున్నారని, ఇటువంటి వాటిని కాలేజీ సిబ్బంది కూడా అనుమతించి విద్యాసంస్థల నిబంధనలను అతిక్రమించి నేరానికి పాల్పడ్డారంటూ ఓ విద్యార్థిని తండ్రి, బాధ్యతగలిగిన పారాలీగల్ సెల్ వలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న బీవీ సాగర్ శుక్రవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని కళానికేతన్ వద్ద ఉన్న శ్రీచైతన్య మహిళా కాలేజీ క్యాంపస్‌లో సాగర్ కుమార్తె బైపీసీ చదువుతోంది. మరో నాలుగు రోజుల్లో పరీక్షలు ప్రారంభం అవుతుండటంతో పాప ఫీజు విషయం మాట్లాడేందుకు శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు కాలేజీకి వెళ్లారు. అక్కడ పెద్ద ఎత్తున పిల్లలను హాజరు పరిచి మాట్లాడుతుంటే పరీక్షల సందర్భంగా అధ్యాపకులు ఏమైనా సూచనలు ఇస్తున్నారేమో అనుకుంటూ దూరంగా ఉన్నారు. కొద్ది సేపటికి మీకు ఓటు ఉంటే మీరు.. లేకుంటే మీ తల్లిదండ్రులకు చెప్పి అయినా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబునాయుడికి, సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, అలా చేస్తేనే మనకు ప్రత్యేక హోదా వస్తుందంటూ విద్యార్థి జేఏసీ నాయకుడు రాయపాటి జగదీష్ మాట్లాడటాన్ని సాగర్ గుర్తించారు.
మరో నాలుగు రోజుల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు జరగబోతుంటే కాలేజీల్లో విద్యార్థులకు రాజకీయ పార్టీల గురించి, ఎవరికి ఓటు వేయాలనే దానిపై ప్రచారం చేయడం ఏమిటంటూ జగదీష్‌ను సాగర్ నిలదీశా>రు. నువ్వెవరంటూ జగదీశ్ ప్రశ్నించడంతో తన కుమార్తె ఇక్కడే చదువుతోందని, ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తుంటే ప్రశ్నించడంలో తప్పేమిటంటూ నిలదీశారు. కాలేజీలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం నేరం కాదా.. పరీక్షలని పిల్లలు ఉదయం 3 గంటలకే నిద్రలేచి చదువుకుంటుంటే ఇటువంటి కార్యక్రమాలతో విద్యార్థుల కాలాన్ని ఎందుకు వృథా చేస్తున్నారంటూ సాగర్ ఎదురు ప్రశ్నించారు. దీంతో జగదీష్ నా ఇష్టం..ఏం చేసుకుంటావో చేసుకోపో..అంటూ సమాధానం ఇచ్చాడని సాగర్ తెలిపారు.
కాలేజీలో ఇలాంటి సమావేశాలు నిర్వహించడం నేరమని మీకు తెలియదా..అని కాలేజీ సిబ్బందిని ప్రశ్నిస్తే ప్రత్యేక హోదా కోసం..అంటూ జగదీష్ చెప్పాడని, అందుకోసం పిల్లలను బయటకు పిలిచామని, అందుకు భిన్నంగా ఆయన మాట్లాడతాడని తాము ఊహించలేదని కాలేజీ సిబ్బంది చెప్పినట్లు సాగర్ వివరించారు. రాజకీయ ప్రచారానికి అనుమతి ఇచ్చిన శ్రీచైతన్య కాలేజీ ప్రిన్సిపాల్, విద్యార్థి సంఘ నాయకుడు జగదీష్‌కు నోటీసులు ఇవ్వాలని కోరుతూ బాధ్యత గల పారాలీగల్ సెల్ వలంటీర్‌గా తాను జిల్లా న్యాయసేవాధికార సంస్థకు ఫిర్యాదు చేసినట్లు సాగర్ వివరించారు. విద్యా సంస్థల్లో రాజకీయ ప్రచారాలు నిర్వహించడంపై సంబంధిత కాలేజీ ప్రతినిధులు, విద్యార్థి జేఏసీ నాయకుడినని చెప్పుకుంటున్న జగదీష్‌లు ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారో వేచి చూద్దాం.. దీనిపై కాలేజీ ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా ప్రత్యేక హోదా కోసమని రాయపాటి జగదీష్ చెప్పడంతో విద్యార్థినులను బయటకు పిలిచామని, ఆ తర్వాత ఆయన తన ఉపన్యాసం రాజకీయాల వైపు మళ్లించడంతో విద్యార్థినులను తరగతి గదుల్లోకి పంపించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment