సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: బీజేపీ, టీఆర్‌ఎస్ రెండూ ఒకటేనని.. ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీకి ఓటు వేసినా ఎన్నికల తర్వాత కలసిపోవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుం తియా వ్యాఖ్యానించారు. ఎంఐఎంతో జత కట్టి ముస్లిం ఓట్లను దండుకోవడం కోసమే ప్రభుత్వాన్ని కేసీఆర్ 9 నెలల ముందు రద్దు చేశారని విమర్శించారు. ఆ తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కలిసిపోతారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో రోజైన గురువారం కొనసాగింది. మహబూబ్‌నగర్, జడ్చర్ల నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించారు.
కుంతియా మాట్లాడుతూ కుటుంబసభ్యులకు కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులు వస్తేనే బంగారు తెలంగాణ అవుతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ పచ్చి అవకాశవాదని.. తెలంగాణ ఇచ్చిన వెంటనే కుటుంబంతో సహా వెళ్లి సోనియాగాంధీ కాళ్లపై పడిన వ్యక్తి.. ఇప్పుడు రాహుల్‌ను ఇష్టమొచ్చినట్లు విమర్శిస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. రాను న్న సార్వత్రిక ఎన్నికల్లో ‘కేసీఆర్ హఠావో – తెలం గాణ బచావో’నినాదంతో కాంగ్రెస్ శ్రేణులు ప్రచా రం చేయాలని ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ కోరారు. యువత ఉత్సాహం చూస్తుంటే... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
త్వరలో కేసీఆర్ నుంచి విముక్తి : భట్టి
తెలంగాణకు పట్టిన కేసీఆర్ శని త్వరలో విముక్తి కాబోతుందని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు రీ డిజైనింగ్ పేరుతో రూ.62 వేల కోట్లకు అంచనా పెంచారని ఆరోపించారు. రీ డిజైనింగ్ పేరు తో దోపిడీ చేయడం తప్ప పనులు చేసిన దాఖలాలు లేవని ఆయన పేర్కొన్నారు.
ప్రచార కమిటీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి మాట్లాడుతూ.. కేసీఆర్ తన స్థాయి మరిచి వీధి రౌడీలా పచ్చి బూతు మాట లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఓటుకు రూ.2 వేలు లేదా 3 వేలు పంచబోతున్నారని, ఆ డబ్బు తీసుకొని కాంగ్రెస్‌కు ఓటేయ్యాలని కోరారు. కేసీఆర్ కూతురు కవితను ఒళ్లు దగ్గర పెట్టుకో అంటూ ఎవరైనా మాట్లాడితే.. కేసీఆర్ ఊరుకుంటారా? అని డీకే అరుణ ప్రశ్నించారు. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment