
సాక్షి, కొడంగల్ : తాను రాజకీయాల్లో ఉన్నంతవరకూ కొడంగల్ నుంచే పోటీ చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో అసలైన ఆట ఇప్పుడే మొదలైందని ఆయన ఆదివారమిక్కడ వ్యాఖ్యానించారు. టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం తొలిసారిగా రేవంత్ రెడ్డి... నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘ కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునర్ ఏకీకరణ జరగాల్సిన సమయం ఆసన్నమైంది. కొడంగల్ దొరల కోటలను కూల్చినట్లే రాష్ట్రంలో కేసీఆర్ కోటను కూల్చేస్తాం. కేసీఆర్‌ను గద్దె దించడమే ప్రధాన లక్ష్యం. మద్దతు ధర అడిగితే ప్రభుత్వం.. రైతులకు బేడీలు వేస్తోంది. తెలంగాణలో దొరల పాలన అంతం కావాలి. కేసీఆర్ పాలనను అంతమొందించేందుకు కృషి చేస్తా. ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు...రేపు తాను చనిపోయినా తన సమాధి కూడా కొడంగల్‌లోనే ఉంటుంది.
కొడంగల్ కార్యకర్తలే నా అధిష్టానం..
కొడంగల్ కార్యకర్తలే నా అధిష్టానం. వారు ఆదేశిస్తే ఏమైనా చేస్తా. నన్ను అభిమానిస్తున్న నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా. కొడంగల్ సేవకుడిగా తనకు అవకాశం కల్పించారు. వ్యక్తిగత స్వార్థంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. టీడీపీని వీడటం బాధ అయినా, నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కొడంగల్ ప్రజల ఆదేశాల మేరకే నడుచుకుంటా. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం ప్రకటిస్తా.’ అని తెలిపారు. అంతకు ముందు రేవంత్ రెడ్డి భార్యతో కలిసి స్థానిక ఆలయంలో పూజలు నిర్వహించారు.
ఒకే ఒక్కడు!
ఒకప్పుడు కాంగ్రెస్సే ఆయన ప్రధాన ప్రత్యర్థి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో రేవంత్ ప్రస్తుతం అదే పార్టీ గూటికి చేరే పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశంలో కొనసాగుతూ...టీఆర్‌ఎస్‌ను సమర్థంగా ఎదుర్కోలేనని భావించిన రేవంత్ ఊహించని మలుపుల మధ్య కాంగ్రెస్‌కు చేరువయ్యారు. ఓటుకు కోట్లు కేసులో జైలుకెళ్లిన అనంతరం కేసీఆర్‌పై ఒంటికాలుపై లేస్తున్న ఆయన వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఢీకొనాలంటే కాంగ్రెస్సే సరైన వేదిక అని భావించారు. ఆ దిశగా గత రెండు నెలలుగా మేథోమధనం జరిపి చివరకు తొమ్మిదేళ్ల టీడీపీకి రాంరా చెప్పారు.
కాగా కొడంగల్ టీడీపీకి కంచుకోట. పార్టీకి బలమైన నాయకత్వం లేనప్పటికీ సంస్థాగతంగా పటిష్టంగా ఉంది. కష్టకాలంలోనూ శ్రేణులు వెన్నంటి నిలవడంతో ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఎదురులేకుండా పోయింది. 2009లో రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో అడుగు పెట్టడంతో పార్టీ మరింత బలపడింది. తాజాగా ఆయన రాజీనామాతో తెలుగు తమ్ముళ్లు డైలమాలో పడ్డారు. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వ్యూహాత్మక మౌనం పాటించిన ద్వితీయ శ్రేణి నాయకత్వం..తమ నేత నిర్ణయంతో ఆత్మరక్షణలో పడ్డారు. మరోవైపు రేవంత్‌రెడ్డి బాటలో పయనించే దిశగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పలువురు నేతలు మంతనాలు జరుపుతున్నారు.
అసలైన ఆట ఇప్పుడే మొదలైంది
Comments
Please login to add a commentAdd a comment