భోపాల్/బెంగళూరు: తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని.. విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యాఖ్యలను రెబెల్ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారు. 22 మంది రెబెల్ ఎమ్మెల్యేల్లో 13 మంది కాంగ్రెస్‌ను వీడిపోమని చెప్పారన్న వ్యాఖ్యలను ఖండించారు. తాము జ్యోతిరాదిత్య సింధియా వెంటే ఉంటామని.. ఆయన కోసం ఏమైనా చేస్తామని స్పష్టం చేశారు. తిరుగుబాటు చేయమని తమను ఎవరూ బలవంతం చేయలేదని... ఇది తమకు తాము తీసుకున్న నిర్ణయం అని వెల్లడించారు. తమ మద్దతు ఎల్లప్పుడూ జ్యోతిరాదిత్యకే ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు బెంగళూరులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తుల్సీ సిలావట్, గోవింద్ సింగ్ రాజ్‌పూత్, మహేంద్ర సింగ్ సిసోడియా, ఇమర్తీ దేవి, ప్రభురాం చౌదరి, ప్రద్యుమ్న సింగ్ తోమర్ తదితర నేతలు మాట్లాడిన వీడియోలు బుధవారం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (కాషాయ ‘కుటుంబం’లోకి సింధియా)
బావిలో దూకమన్నా దూకుతాను..
మధ్యప్రదేశ్ తాజా పరిణామాల గురించి ఇమర్తీ దేవి(కమల్‌నాథ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు) మాట్లాడుతూ...‘‘ ఒకవేళ మహరాజ్(స్థానికులు జ్యోతిరాదిత్య సింధియాను ఇలాగే పిలుస్తారు) నన్ను అడిగినా లేదంటే ఆయన కోసం ఏదైనా చేయాలని భావిస్తే నేను బావిలో దూకడానికి కూడా వెనుకాడను. మహరాజ్ కోసం ఏమైనా చేస్తాను’’ అని పేర్కొన్నారు. ఇక మరో మాజీ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా మాట్లాడుతూ... ‘‘జ్యోతిరాదిత్య సింధియా ఎవరికీ ద్రోహం చేయలేదు. నిజానికి కమల్‌నాథే సింధియాను మోసం చేశారు. పదిహేనేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికి సింధియా తీవ్రంగా కృషి చేశారు. ఆయన ఎక్కడ ఉంటే మేమూ అక్కడే ఉంటాం. మేమంతా ఐకమత్యంగా ఉంటాం’’అని వీడియోలో చెప్పుకొచ్చారు. ‘‘మా ఇష్టప్రకారమే రాజీనామా చేశాం. మేము 22 మందిమి ఉన్నాం. ఈరోజు.. రేపు.. ఎప్పటికైనా కలిసే ఉంటాం. మాకు మేముగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందులో ఎవరి బలవంతం లేదు’’ అని మరో మాజీ మంత్రి ప్రభురాం చౌదరి, ఎమ్మెల్యే రక్షా సిరోనియా స్పష్టం చేశారు.(సింధియా నిష్క్రమణతో ‘చేతి’కి చిక్కులు)
కాగా 18 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన గ్వాలియర్ రాజవంశీకుడు జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీని వీడి.. బుధవారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆయన అనుయాయులైన 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ సర్కారు మైనార్టీలో పడింది. ఈ క్రమంలో మిగిలిన తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి రాజస్తాన్‌లోని జైపూర్‌కు తరలించగా.. బీజేపీ ముందు జాగ్రత్త చర్యగా తమ ఎమ్మెల్యేలను గురుగ్రామ్‌లోని ఒక హోటల్‌లో ఉంచింది. ఇక తమ రాజీనామాలను ఒక బీజేపీ సీనియర్ నేత ద్వారా మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌కు పంపించిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరు శిబిరంలో కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 230 కాగా, ప్రస్తుతం 228 మంది సభ్యులున్నారు(ఇద్దరు చనిపోయారు). వారిలో 22 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే.. ఆ సంఖ్య 206కి చేరుతుంది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 104 అవుతుంది. ఈ నేపథ్యంలో.. 107 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. అయితే అంతా స్పీకర్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment