
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. ఆమెపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన ప్రధానిమోదీపై ప్రివిలేజ్ మోషన్ నోటీసులిచ్చేందుకు రడీ అవుతోంది. ఈ మేరకు రేణుకా చౌదరి సహా, కాంగ్రెస్ మహిళాప్రతినిధుల బృందం గురువారం రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ ప్రధానికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చేందుకు యోచిస్తున్నాననీ, పార్టీతో సంప్రదింపుల అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అలాగే తాను నవ్వుతూనే ఉంటాననీ.. దీనికి తాను ఎలాంటి జీఎస్‌టీ కట్టక్కలేదంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఎంపీలు అందరూ రాజ్యసభ అధ్యక్షుడిని కలిసి ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశామని కాంగ్రెస్ ప్రతినిధి కుమారి శైలజ మీడియాకు వివరించారు. కాంగ్రెస్ నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని, అయితే వివాదం రేపవద్దని ఎన్‌సీపీ నాయకుడు డీపీ త్రిపాఠి తెలిపారు. మరోవైపు మోదీ వ్యాఖ‍్యలపై రాజ్యసభలో గురువారం తీవ్ర దుమారం చెలరేగింది. కేంద్ర మంత్రి , కాంగ్రెస్ ఎంపీ రేణుకపై ప్రధాని అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ గురువారం ట్వీట్ చేసింది. కాగా బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. ఎంపీ రేణుకా చౌదరి అడ్డుపడిన సందర్భంగా ప్రధాని అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment