
సాక్షి, హైదరాబాద్ : కొన్ని గంటల కిందటే తెలుగుదేశం పార్టీ సాధారణ సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి.. కొడంగల్ ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను గట్టిగా విమర్శించిన రేవంత్.. తాను పదవిలో ఉండి వేరొక పార్టీలోకి మారితే, అలాంటి విమర్శలనే ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ మారే విషయంలో మొదటి నుంచీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న రేవంత్ తన రాజీనామాపైనా విమర్శలు లేకుండా చూసుకోవాలని భావనలోనే స్పీకర్ ఫార్మాట్‌లో రిజిగ్నేషన్‌ను పంపారు. మొదట సొంత నియోజకవర్గం కొడంగల్ వెళతారని, అక్కడి కార్యకర్తలు, అనుచరులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటిస్తారని వార్తలు వచ్చినా, వాటికి విరుద్ధంగా రేవంత్ శనివారం సాయంత్రమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించడం గమనార్హం. రేవంత్ రాజీనామాపై స్పీకర్ మధుసూదనాచారి స్పందించాల్సిఉంది.
రాహుల్ సభలో కాంగ్రెస్‌లోకి! : రెండు వారాల కిందట ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ అయ్యారన్న వార్త తెలిసిందే. రాహుల్.. నవంబర్ రెండో వారంలో తెలంగాణకు రానున్నారు. ఆయన పాల్గొనే సభను ఎక్కడ నిర్వహించాలనేదానిపై టీపీసీసీ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం మూడు ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అదే సభలో రాహుల్ గాంధీ సమక్షంలోనే రేవంత్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారమేదీ లేదు.
Comments
Please login to add a commentAdd a comment