సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ మాజీ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు మురళీధరరావు సమక్షంలో ఆయన బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాషాయ కండువా కప్పుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను బీజేపీలో చేరే విషయాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో చెప్పానని రేవూరి స్పష్టం చేశారు. తెలంగాణ సెంటిమెంటుతో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందని, కానీ తెలంగాణ ఫలాలు మాత్రం ప్రజలకు అందడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ విభజించు పాలించు అనే సూత్రంతో పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ వనరుల్ని కొల్లగొట్టారని ఆరోపించారు.
రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. ఆర్థిక అత్యవసర పరిస్థితితో కేసీఆర్ పరిపాలన ఏమిటో ప్రజలందరికీ అర్థమైందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తన వాక్చాతుర్యంతో టీడీపీని ఆంధ్ర పార్టీగా ముద్ర వేశారని గుర్తు చేశారు. ప్రజల్లో కాంగ్రెస్‌పై విశ్వాసం సన్నగిల్లిందని, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేకపోవడంతో తెలంగాణలో బలమైన ప్రతిపక్షమే కరువైందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment