సాక్షి, ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకుని పలువురు రాజకీయ వారసులు చట్టసభలో అడుగుపెట్టబోతున్నారు. హరియాణా, మహారాష్ట్ర శాసన సభ ఎన్నికలు సహా దేశ వ్యాప్తంగా పలు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన ఆదిత్య ఠాక్రే తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికకాగా.. మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారులు అజిత్ దేశ్‌ముఖ్, ధీరజ్ దేశ్‌ముఖ్(ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ తరఫున) లాతూర్ జిల్లా నుంచి ఘన విజయం సాధించారు.
ఈ సందర్భంగా విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మరో కుమారుడు, బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. ‘ నాన్న మేము సాధించాం!! వరుసగా మూడోసారి అమిత్ లాతూర్ సిటీలో గెలుపొందగా(40 వేల మెజార్టీ), ధీరజ్ లాతూర్ రూరల్ అసెంబ్లీ స్థానాన్ని లక్షా 20 వేల భారీ మెజార్టీతో సొంతం చేసుకున్నాడు. లాతూర్ ప్రజలు మాపై ఉంచిన విశ్వాసానికి, నమ్మకానికి ధన్యవాదాలు’ అని ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఇక ఠాక్రే, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ వారసులతో పాటు... కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణతి షిండే గెలుపొందగా... మాజీ సీఎం నారాయణ రాణే కుమారుడు నితేష్ రాణేలతోపాటు పలువురు రాజకీయ నాయకుల వారసులు విజయం సాధించిన విషయం విదితమే.
We did it PAPPA!!! @AmitV_Deshmukh wins Latur (city) by 42000+ votes for the 3rd consecutive time.@MeDeshmukh wins Latur (rural) by 1,20,000 votes.
— Riteish Deshmukh (@Riteishd) October 24, 2019
Thank you people of Latur for this faith & trust. pic.twitter.com/pOGFsmoEJU
వర్లీ నుంచి ఆదిత్య ఠాక్రే
శివసేన అధినేత దివంగత బాల్ ఠాక్రే మనవడు, శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఘన విజయం సాధించారు. దీంతో ఠాక్రే కుటుంబం నుంచి మొట్టమొదటిసారిగా ఆయన అసెంబ్లీకి వెళ్లనున్నారు. శివసేనకు పెట్టనికోటగా ఉన్న ముంబైలోని వర్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి యువసేన అధ్యక్షులైన ఆయన బరిలోకి దిగారు. ఆయనకు వ్యతిరేకంగా ఎన్సీపీ అభ్యర్థి సురేష్ మానే, వంచిత్ ఆఘాడి అభ్యర్థి గౌతం గైక్వాడ్, ఇండిపెండెంట్ అబిజీత్ బిచ్‌కులేతోపాటు 12 మంది బరిలోకి దిగారు. అయితే ఆదిత్య ఠాక్రేకు 89,248 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు 21,821 ఓట్లతో ఎన్సీపీ అభ్యర్థి సురేష్ మానే ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇలా ఆదిత్య ఠాక్రే 67,427మ ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు వర్లీ నియోజకవర్గంలో 6305 మంది ఓటర్లు నోటాకు ఓటేవ్వడం కూడా విశేషం.
ధీరజ్ దేశ్‌ముఖ్ భారీ మెజార్టీ
మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని లాతూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ కుమారుడు ధీరజ్ దేశ్‌ముఖ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఇక్కడ ప్రత్యర్థులైన శివసేన అభ్యర్థి సచిన్ అలియాస్ రవి దేశ్‌ముఖ్ కంటే అధికంగా ‘నోటా’కు ఓట్లు వచ్చాయి. ఎక్కడలేని విధంగా నోటా ద్వితీయ స్థానంలో నిలిచింది. దీంతో లాతూరు రూరల్ లోకసభ నియోజకవర్గం ఫలితాలు అందరిని దృష్టిని ఆకర్శించాయి. కడపటి వివరాలు అందిన మేరకు కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ దేశ్‌ముఖ్‌కు 1,33,161 ఓట్లు పోలవ్వగా నోటాకు ఏకంగా 27,287 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు శివసేన అభ్యర్థి సచిన్‌అలియాస్ రవీ దేశ్‌ముఖ్‌కు 13,335 ఓట్లు పోలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment