సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పాలకపక్ష అన్నాడీఎంకే తిరుగుబాటు అభ్యర్థి, వీకే శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ దాదాపు 40 వేల మెజారిటీతో విజయం సాధించడాన్ని పలువురు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. దినకరన్‌కు నేడు 40,707 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నాడు జయలలిత 39 వేల మెజారిటీతోనే విజయం సాధించారు. దానర్థం జయలలితకన్నా దినకరన్ ఎక్కువ ఆదరణ కలిగిన వ్యక్తని అర్థం కాదు. పాలకపక్ష అన్నాడీఎంకే అభ్యర్థి ఈ. మధుసూదన్‌కు ఈ ఎన్నికల్లో 48,306 ఓట్లు, డీఎంకే అభ్యర్థి మరుధుగణేశ్ 24,651 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు.
ఆదివారం నాడు ఓట్ల లెక్కింపు ప్రారంభమై దినకరన్ విజయం సాధిస్తున్న సూచనలు కనిపించగానే వివిధ టీవీ ఛానళ్ల చర్చల్లో పాల్గొన్న పలు రాజకీయ పార్టీల నేతలు తమ విశ్లేషణలు వినిపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఇది ప్రజలిచ్చిన తీర్పంటూ పలు పార్టీల నేతలు అభిప్రాయాలను వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు లాంటి నిర్ణయాలే కాకుండా బలవంతంగా హిందీ భాషను రుద్దడం, వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ‘నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్’ లాంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజలు దినకరన్‌కు ఓటేశారని తేల్చారు.
ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలనుకుంటే డీఎంకే అభ్యర్థిని గెలిపించేవారు. ఎందుకంటే 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తున్న పార్టీ డీఎంకే. కాగా, డీఎంకే అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం. బీజేపీ మతతత్వ వాదాన్ని వ్యతిరేకించే ప్రజలు దినకరన్‌వైపు మొగ్గుచూపారని కూడా అంటున్నారు. మతతత్వంపై పోరాడాలన్న తపన ప్రజల్లో ఏ కోశాన, ఎక్కడా కనిపించలేదు. డబ్బు ప్రవాహం ప్రభావం వల్లనే దినకరన్ విజయం సాధించినట్లు తెలుస్తోంది. దినకరన్ ఎన్నికల కోసం దాదాపు వంద కోట్ల రూపాయలను కుమ్మరించారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ఈ నెల మొదట్లోనే ఆరోపించడం ఇక్కడ గమనార్హం. ఉప ఎన్నికల్లో డబ్బే ప్రధాన ప్రభావం చూపిస్తుందని తేలడం ఇదే మొదటిసారి కాదు.
2003లో శాంతకులం అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పాలకపక్షం ఏఐఏడీఎంకే అభ్యర్థి విజయం సాధించడంలో డబ్బు ప్రభావం మొదటిసారి కనిపించింది. అప్పుడు ప్రభుత్వం పట్ల ప్రజలకు ఎంతో ఆగ్రహం ఉన్నప్పటికీ పాలక పక్ష అభ్యర్థినే గెలిపించడం, డబ్బును విచ్చలవిడిగా వెదజల్లడం స్పష్టంగా కనిపించింది. ఎన్ని చర్యలు తీసుకున్నా మన ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అరికట్టడంలో విఫలం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment