
సాక్షి, అమరావతి: ‘తెనాలి ప్రభుత్వ డాక్టర్ మరణాన్ని చంద్రబాబు వాడుకుంటున్న తీరు రాజకీయాలకే మచ్చ. ఆయన మెదడు కుళ్లిపోయిందనే విషయాన్ని ఆయనే బయట పెట్టుకున్నారు. విపత్తులను కూడా రాజకీయం చేసే పచ్చి స్వార్థపు మనిషి చంద్రబాబు’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైద్యుడి ప్రాణాలను కూడా నిలుపలేని స్ధితిలో రాష్ట్రం ఉండటం శోచనీయమని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా విమర్శించడాన్ని సజ్జల తిప్పికొట్టారు.
ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్‌లో రీ ట్వీట్ చేశారు. ‘తెనాలి ఆస్పత్రిలో కొవిడ్ పేషెంట్లు ఎవరూ లేరు. డాక్టర్ ప్రేమ్‌కుమార్ కొవిడ్ పేషంట్లకు చికిత్స అందించలేదు. దురదృష్టవశాత్తు ఆయనకు కరోనా సోకింది. ఆయన్ను కాపాడేందుకు సహచర వైద్యులు శాయశక్తులా ప్రయత్నాలు చేశారు. కానీ, ఆయన సుగర్ పేషంట్ కావడంతో ప్రాణాలు కోల్పోయారు’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘కరోనాపై యుద్ధం చేస్తున్న వారికి రూ.50 లక్షల పరిహారం ఉన్న విషయం చంద్రబాబుకు తెలియదా? ఏదైనా జరిగితే కేంద్రం ఇచ్చేంత వరకు కూడా ఆగకుండా రాష్ట్రమే ఇస్తోంది. కోవిడ్ నివారణ చర్యల్లో రాష్ట్రం అగ్రగామిగా ఉండటాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేక దిగజారిపోయారు’ అని సజ్జల మరో ట్వీట్‌లో మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment