
షాపులు నిర్మించి కేటాయించకుండా వదిలేసి ఉన్న వ్యవసాయ మార్కెట్ కాంప్లెక్సు దృశ్యం
సాక్షి, గుంటూరు: ఇంటి పోరు ఇంతింత కాదయా అన్నాడు ఓ కవి. దాని వల్ల ఇంటి యజమానికి ఇబ్బంది సహజమే. అయితే రాజ్యాంగ పదవిలో ఉన్న నేత ఇంట్లో పోరు మాత్రం ప్రజలను ఇక్కట్లు పాలుజేస్తోంది. గత కొంతకాలంగా గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పలు సందర్భాల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ పోరు తారస్థాయికి చేరింది. సత్తెనపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట ఉన్న కాంప్లెక్సు, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని షాపుల కేటాయింపు ఆ నేత ఇంట్లో చిచ్చు రేపాయి. తాను చెప్పిన వారికే షాపులు కేటాయించాలని కూతురు పట్టుబడుతుండగా, ఇక్కడ ఆమె పెత్తనం ఏమిటంటూ కొడుకు మండిపడుతుండటంతో ఏం చేయాలో తెలియక సదరు నేత తలపట్టుకుంటున్నారు. కొడుకు, కూతురు మధ్య వివాదం తీర్చలేక ఆ నేత చేతులు ఎత్తేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి పోరుతో సత్తెనపల్లిలో కొన్ని నెలలుగా షాపులు కేటాయింపు జరగక వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
షాపుల కేటాయింపులో రగడ..
సత్తెనపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా షాపింగ్ కాంప్లెక్సు నిర్మించారు. అందులో కింద తొమ్మిది గదుల్లో గతంలో ఉన్నవారే వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొద్ది నెలల క్రితం వీటిపైన మరో ఎనిమిది షాపులు నిర్మించారు. ఈ షాపులను ఎవరికి కేటాయించాలనే దానిపై రాజ్యాంగ పదవిలోని నేత తనయ, తనయుల మధ్య వివాదం ఏర్పడింది. ఎనిమిది షాపులను మెడికల్ షాపులకు కేటాయించి మెడికల్ కాంప్లెక్సుగా మార్చాలని కుమార్తె ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం మెడికల్ షాపుల నిర్వాహకులు ఒక్కో షాపునకు రూ. 5 లక్షలు చొప్పున చెల్లించారని సమాచారం. షాపుల నిర్మాణం చేపట్టే సమయంలోనే వీటిని తమ అనుయాయులకు కేటాయించి అందుకు తగిన ప్రతిఫలం పొందేలా కుమారుడు కొందరు వ్యాపారులకు హామీ ఇచ్చేశారని తెలుస్తోంది.
సోదరి ప్రయత్నాలు తెలిసి ఆ నేత కుమారుడు ఆగ్రహం వ్యక్తం చేశారని, రాజకీయ వ్యవహారాలన్నీ తాను చూసుకుంటుంటే, ఇందులో ఆమె పెత్తనం ఏమిటంటూ గొడవకు దిగారని సమాచారం. తన మాట కాదని మెడికల్ షాపులకు ఇస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించినట్లు సమాచారం. దీంతో కొడుకు, కూతురు మధ్య సయోధ్య కుదర్చలేక సదరు నేత తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
మరోపక్క సత్తెనపల్లిలోని ఏరియా వైద్యశాల ఎదురుగా మున్సిపల్ అధికారులు షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఇందులో కింద 11 గదులు ఉండగా, పైఅంతస్తులో సైతం షాపులు నిర్మించేందుకు స్లాబు వేసి ఉంచారు. షాపులను టీడీపీ కౌన్సిలర్లకు ఒక్కొక్కరికి ఒక్కోటి చొప్పున కేటాయిస్తానంటూ ఆ నేత తనయుడు కౌన్సిలర్లకు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా సదరు నేత ఇంటి పోరుతో వాటిని తమకు కేటాయించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ లబ్ధిదారులు మండిపడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి షాపుల కేటాయించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment