సాక్షి, తిరుపతి: పోలీసుల అక్రమ అరెస్ట్‌కు నిరసనగా సత్యవేడు పీఎస్‌లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేపట్టిన నిరసన దీక్షను విరమించారు. మంత్రి లోకేశ్ డైరెక్షన్‌లో పోలీసులు కుట్రలకు పాల్పడ్డారని చెవిరెడ్డి ఆరోపించారు. ఓట్ల దొంగలను పట్టించిన తమపై పోలీసులు అక్రమ కేసులు నమోదుచేసి, అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ.. ఆయన 23 గంటలపాటు పోలీసు స్టేషన్‌లోనే నిరసన తెలిపారు. అక్రమాలపై ఫిర్యాదు చేసినవారినే అరెస్ట్ చేసి కక్షపూరితంగా వ్యవహరించిన పోలీసులు.. పెల్లుబికిన జనాగ్రహంతో దిగివచ్చారు. సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో పోలీసులు చెవిరెడ్డిని విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. తన భార్యతో పాటు వందలాది మంది మహిళలపై దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గమైన పాలన ఎక్కడ చూడలేదని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నేతలపై దాడిచేసిన పోలీసులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.
చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓట్ల దొంగలు సర్వేల పేరిట పర్యటిస్తున్న వ్యక్తులపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్రమంగా అరెస్ట్ చేసిన తమ పార్టీ శ్రేణులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్పీ కార్యాలయం ఎదుట చెవిరెడ్డి ఆందోళనకు దిగారు. దీంతో ఆయనను ఆదివారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు.. రాత్రంతా పోలీసు వాహనాల్లో తిప్పారు. చివరకు సోమవారం తెల్లవారుజామున సత్యవేడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. చెవిరెడ్డిపై ఐదు సెక‌్షన్ల కింద కేసు నమోదు చేశారు. చెవిరెడ్డి అక్రమ అరెస్ట్‌కు నిరసనగా సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలు, మహిళలు చిత్తూరు ఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఆందోళనలు చేపట్టారు. చెవిరెడ్డి వెంటనే విడుదల చేయాలని ఆయన భార్య లక్ష్మీదేవి కూడా ఆందోళనకు దిగారు. దీంతో లక్ష్మీ దేవితో సహా 200మంది మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment