సాక్షి, న్యూఢిల్లీ : బలపరీక్షకు సిద్ధమవుతున్న యడ్యూరప్ప సర్కార్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బీజేపీ చేసిన ఏ విజ్ఞప్తిని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. బలనిరూపణకు మరింత గడువు ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్ధానం శనివారం సాయంత్రం 4 గంటలకు బలనిరూపణ చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారని, ఆంగ్లో ఇండియన్‌ను నామినేట్ చేయవద్దని సుప్రీం ఆదేశించింది.
మరోవైపు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. అసెంబ్లీలో రహస్య బ్యాలెట్ ద్వారా బలపరీక్ష నిర్వహించాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించింది. తమ ఎమ్మెల్యేలు వేరే రాష్ట్రంలో ఉన్నారని చెప్పినా న్యాయస్థానం ఒప్పుకోలేదు. బలపరీక్షకు కనీసం సోమవారం వరకూ సమయం ఇవ్వాలన్నా అంగీకరించలేదు.
ఇక హైదరాబాద్‌కు తరలించిన కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలను తిరిగి బెంగళూరుకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వాజుభాయి వాలా ఆహ్వానించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చింది. సాధారణ మెజారిటీ లేకున్నా బీజేపీ నేత యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఇక సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment