రెండో దశలో 68% పోలింగ్‌ | Second phase of polls records voter turnout of 67.84 percent | Sakshi
Sakshi News home page

రెండో దశలో 68% పోలింగ్‌

Published Fri, Apr 19 2019 3:47 AM | Last Updated on Fri, Apr 19 2019 5:25 AM

Second phase of polls records voter turnout of 67.84 percent - Sakshi

చెన్నైలో ఓటేసేందుకు క్యూలో నిల్చున్న మక్కల్‌ నీది మయ్యం చీఫ్‌ కమల్‌హాసన్, కూతురు శృతి. చెన్నైలో ఓటేసిన రజనీకాంత్, త్రిష

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఉన్న 95 లోక్‌సభ నియోజకవర్గాలకు గురువారం జరిగిన రెండో దశ పోలింగ్‌లో 67.84% ఓటింగ్‌ నమోదైందని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. పశ్చిమబెంగాల్, మణిపూర్‌లలో హింసాత్మక ఘటనలు, ఈవీఎంలలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా పోలింగ్‌కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. గురువారం తమిళనాడులోని 38, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, యూపీ, అస్సాం, బిహార్, ఒడిశాలలో ఐదేసి సీట్లు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్‌లో మూడు చొప్పున, జమ్మూకశ్మీర్‌లో రెండు, మణిపూర్, పుదుచ్చేరిల్లో ఒక్కొక్క లోక్‌సభ స్థానం, ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు రెండో దశలో ఎన్నికలు జరిగాయి. వీటితోపాటు తమిళనాడులోని 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో పుదుచ్చేరిలో అత్యధికంగా 80%, మణిపూర్‌లో 75% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.

కశ్మీర్‌లో అత్యల్పం
కశ్మీర్‌లో వేర్పాటువాదులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు ఇచ్చిన నేపథ్యంలో శ్రీనగర్‌లో అత్యల్పంగా 14.8% పోలింగ్‌ నమోదైంది. శ్రీనగర్‌ పార్లమెంటరీ స్థానంలోని 90 పోలింగ్‌ బూత్‌లతో ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఉథంపూర్‌లో మాత్రం 70% పోలింగ్‌ నమోదైంది.

పుదుచ్చేరిలో 80 శాతం
తమిళనాడులో 38 లోక్‌సభ స్థానాల్లో 63.73% పోలింగ్‌ నమోదైంది. అరక్కోణంలో అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. అదేవిధంగా, 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో  67% పోలింగ్‌ నమోదైంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 80% మంది ఓటు వేశారు.

బెంగాల్‌లో హింసాత్మకం
పశ్చిమబెంగాల్‌లోని మూడు సీట్లకు జరిగిన ఎన్నికలో 76% ఓటింగ్‌ నమోదైంది. జల్పాయ్‌గురిలో అత్యధికంగా 82.76%, రాయ్‌గంజ్‌లో 72.14% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాయ్‌గంజ్‌ నియోజకవర్గంలో అల్లరిమూక రాళ్లు రువ్వడంతో  పోలీసులు, బాష్పవాయువు ప్రయోగించి, కాల్పులు జరిపారు. నియోజకవర్గంలోని చోప్రా ఏరియాలో ఆగంతకులు బాంబులు విసిరారని ఈసీ అధికారి తెలిపారు. కటఫూల్బరిలో వార్తలు కవర్‌ చేసేందుకు వెళ్లిన స్థానిక టీవీ చానెల్‌ రిపోర్టర్, కెమెరామన్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. కారులో వెళ్తుండగా కొందరు దాడి చేశారంటూ సీపీఎం అభ్యర్థి ఎండీ సలీం ఫిర్యాదు చేశారు.

మావోయిస్టు ప్రాంతాల్లో..
కర్ణాటకలోని 14 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 68.37% మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. బహు భాషానటి సుమలత, సీఎం కుమారుడు నిఖిల్‌ గౌడ పోటీ చేస్తున్న మాండ్య నియోజకవర్గంలో అత్యధికంగా 80.37 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెంగళూరు సెంట్రల్‌లో అత్యల్పంగా 50 శాతం పోలింగ్‌ నమోదైంది.  మణిపూర్‌లో 75% మంది ఓ టు వేశారు. ఇక్కడ రెండు బూత్‌లలో ఓటింగ్‌ నిలిపివేశారు. మహారాష్ట్రలోని 10 నియోజకవర్గాల్లో 57.22% పోలింగ్‌ నమోదైంది.

నాందేడ్‌లో 60.88%, హింగోలిలో 60.69% మంది ఓటేశారు. నాందేడ్‌లో ఏకంగా 78 ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు వేరే వాటిని ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో్ల 68.70% శాతం పోలింగ్‌ నమోదైంది. రాజ్‌నంద్‌గావ్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని మొహ్లా–మాన్‌పూర్‌లో మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటన మినహా ఇతర హింసాత్మక ఘటనలేవీ జరగలేదు. ఒడిశాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పోలింగ్‌ ప్రశాతంగా ముగిసింది. ఇక్కడ 53% పోలింగ్‌ నమోదైంది.

బిహార్‌లో  62.52%, యూపీలో 62.30%, అస్సాంలో  73.32% నమోదైంది. లోక్‌సభలోని 543 సీట్లకు ఏడు విడతలుగా ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటి వరకు రెండు విడతలు పూర్తయ్యాయి. మిగిలినవి ఈ నెల 18, 23, 29 తేదీలతోపాటు మే 6, 12, 19వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులోని అవకతవకలకు అవకాశం ఉందన్న అనుమానంతో వెల్లూరు స్థానం పోలింగ్‌ను అధికారులు రద్దు చేశారు. అలాగే, త్రిపుర (పశ్చిమ)లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదముందని భావించి ఎన్నికను వాయిదా వేశారు.


పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లాలో ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద ఆందోళనకు దిగిన వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరుపుతున్న పోలీసు


కేతిగనహళ్లిలో ఓటేసిన కర్ణాటక సీఎం కుమారస్వామి, భార్య, కొడుకు.


దొడ్డ అరసినకెరెలో ఓటేసిన సుమలత. మథురలో ఓటేసిన హేమమాలిని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement