బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడు.. రాజకీయాల్లో సీనియర్ నేత. కానీ మాటలన్నీ మురికే. నీతులు వళ్లిస్తాడు.. బూతులే ఎక్కువ మాట్లాడతాడు. పక్కన మహిళలు ఉన్నారనే స్పృహ కూడా ఉండదు. నోరు తెరిస్తే ‘ల..కొడుకు’ అనే మాటతోనే మొదలుపెడతాడు. ఎన్నికల్లో కుమారుడిని రంగంలోకి దింపిన జేసీ.. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే ఓటర్లపైనా కన్నెర్ర చేస్తున్నాడు. ఉచ్ఛనీచాలు మరిచి నోరు పారేసుకుంటున్నాడు. సమస్యలపై ప్రశ్నిస్తే బూతులతో నోరు మూయిస్తున్నాడు.
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు కూడా వాడని పదజాలం ఆయన సొంతం. ప్రశ్నించినా, వ్యతిరేకించినా ఆయన్ను బూతులతో రెచ్చిపోతారు. ఎక్కడ ఉన్నాం? చుట్టూ ఎవరు ఉన్నారనే ధ్యాస కూడా ఉండదు. అవతలి వ్యక్తి ఎవరైనా సరే.. బూతులతో బంబేలెత్తించడమే ఆయన నైజం. చివరికి పోలీసులనైనా.. ‘కొజ్జాలు’గా సంభోదించే సంస్కారం ఆయనది. డబ్బుందనే గర్వం.. అధికార మదంతో మాటలతో రెచ్చిపోతున్న తీరు జిల్లా ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తొలిసారి తన వారసుడిని ఎన్నికల సమరంలో దింపిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. ఎలాగైనా పుత్రున్ని పార్లమెంట్‌కు పంపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. డబ్బువెదజల్లి.. తాయిళాలు పంచి ఓట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా... నువ్వ ‘జేసి’న అభివృద్ధి ఇదీ అంటూ జనం సమస్యల దండకం చదువుతున్నారు. దీంతో జేసీ దివాకర్‌రెడ్డి అసహనంతో రగిలిపోతున్నారు. ప్రశ్నించిన వారిపై బూతుపురాణం అందుకుంటున్నారు.
మార్చి 31న ఏం జరిగిందంటే..
పుట్లూరు మండలంలో తన కుమారుడు టీడీపీ అనంతపురం ఎంపీ అభ్యర్థి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీని గెలిపించాలని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పుట్లూరు మండల కేంద్రలోని ప్రధాన సర్కిల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పుట్లూరు మండలంలోని చెరువుకు నీరు రావాలంటే తమకు మెజార్టీ ఇవ్వాలన్నారు.
పక్కనే ఉన్న శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిని చూపిస్తూ ఈ అమ్మాయి పోటీలో నిలబడింది.. నీ పేరు ఏంటి అని అభ్యర్థిని అడిగారు. దీంతో పక్కనే ఉన్న టీడీపీ నాయకులు బండారు శ్రావణిశ్రీ అని చెప్పడంతో ఈమెను గెలిపించాలన్నారు. ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న యామినీబాల జేబుల్లో చానా చేతులు పెట్టడంతో మార్పుచేసి ఈ అమ్మాయిని పోటీలో పెట్టామన్నారు. అంతేకానీ ఆ పాప బాగాలేదని కాదు, ఈ పాప బాగుందని కాదు అని ఎగతాళిగా మాట్లాడారు.
నా.. కొడకా, తాగి వస్తావా!
ఇక వెంకటనారాయణ అనే స్థానికుడు తమకు నీళ్లు లేవని ప్రశ్నించగానే.. జేసీ దివాకర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘నీ.. నా కొడకా, ...తాగి వస్తావా నాదగ్గరికి, .. పగులకొడుతా... నా కొడకా, ఎర్రి.. కొడుకా...’’ అని దూషించారు. ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు ఇతర మహిళలు, గ్రామస్తులు చూస్తుండగానే బూతు పురాణం అందుకున్నారు. ఆపై అతన్ని అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎంపీ సూచన మేరకు వెంకటనారాయణను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరీక్షలు నిర్వహించగా అతను మద్యం సేవించలేదని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment