thadipatri
-
పోలీసులపై జేసీ దౌర్జన్యం
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ సోమవారం ఆమరణ దీక్షలంటూ హడావుడి చేశారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. బండబూతులు తిట్టారు. విధి నిర్వహణలోని ఓ కానిస్టేబుల్‌ను అసభ్య పదజాలంతో దూషించారు. సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారు. జేసీ తీరుపై డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను ఇష్టారాజ్యంగా దూషిస్తే ఊరుకునేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వివరాలు.. తమపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడం సరికాదంటూ సోమవారం తాడిపత్రిలో తన సోదరుడు ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆమరణ దీక్ష చేస్తానంటూ జేసీ దివాకర్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. నియోజకవర్గంలో 144 సెక్షన్‌తో పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఈ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించినా.. వారిని రెచ్చగొట్టేందుకు జేసీ సోదరులు దీక్షకు సిద్ధమయ్యారు. 149 సీఆర్పీసీ కింద ముందే నోటీసులిచ్చినా.. తన సోదరుడి ఇంటికి వెళ్లి దీక్ష చేసేందుకు పెద్దపప్పూరులోని తన ఫామ్‌హౌస్ నుంచి బయలుదేరిన దివాకర్‌రెడ్డిని డీఎస్పీతో పాటు సీఐలు మురళీధర్‌రెడ్డి, ఇస్మాయిల్, ఎస్ఐలు గౌస్, రాజశేఖర్‌రెడ్డి, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై జేసీ దివాకర్‌రెడ్డి దూషణలకు దిగారు. పత్రికల్లో రాయలేని పదజాలంతో కానిస్టేబుల్‌పై తిట్లపురాణం అందుకున్నారు. ‘అధికారం ఉందికదా అని రెచి్చపోతున్నారు. ఎవరు మీరు నా గదిలోకి రావడానికి. నీయబ్బా.. మీ ప్రభుత్వం కథ నేను చూస్తా. మా ప్రభుత్వం వస్తే మీ అంతు చూస్తా..’ అంటూ చిందులు తొక్కారు. పోలీసులు ఆయన్ని బలవంతంగా గదిలోకి పంపించారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి హౌస్ అరెస్ట్ బస్టాండ్ సర్కిల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి ఇంట్లో దీక్షకు కూర్చోవాలని బయలుదేరిన ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని హౌస్ అరెస్టు చేశారు. తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన జేసీ ప్రభాకర్‌రెడ్డి సతీమణి ఉమారెడ్డిని మహిళా పోలీసులు అడ్డుకుని ఇంటికి తరలించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తన నివాసంలో మూడుగంటల పాటు దీక్ష చేశారు. కొందరు మహిళలు నిమ్మరసం అందజేసి ఆయనతో దీక్ష విరమింపజేశారు. (చదవండి: బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్: జైలుకు తరలింపు) -
మా వాళ్లు రాక్షసులు.. మీ రక్తం తాగుతారు: జేసీ
తాడిపత్రి అర్బన్: ‘‘మా అనుచరులు రాక్షసులు. పచ్చి రక్తం తాగేవాళ్లు నా చుట్టూ ఉన్నారు. వాళ్లు మీ రక్తాన్ని పులి, సింహాల్లాగా తాగుతారు.’’ అని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అధికారులను బెదిరించే ధోరణిలో వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మమ్మల్ని అధికారులు సన్మానిస్తే, మేము అధికారంలోకి వచ్చాక వారిని రెట్టింపు స్థాయిలో సన్మానిస్తాం అంటూ వ్యంగ్యంగా హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో జేసీ దివాకర్‌రెడ్డి నిర్వహిస్తున్న క్వారీలో అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ విషయమై శుక్రవారం తాడిపత్రిలోని భూగర్భ గనుల శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేయడానికి వచ్చిన జేసీ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం తన క్వారీలను అధికారులు తనిఖీ చేస్తున్నారని, రాయల్టీల కోసం దరఖాస్తు చేసుకున్నా ఇవ్వడం లేదని మండిపడ్డారు. అధికారులు ట్రాన్ఫర్లకు బయపడి తన గనులు మూసేయాలని చూస్తున్నారనీ, తనకు అన్నం దొరకకుండా చేసి చంపాలనుకుంటున్నారనీ ఆరోపించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీఐ తేజోమూర్తిని ‘మీరు కూడా వెళ్లారా మా క్వారీ వద్దకు అంటూ’ జేసీ ప్రశ్నించారు. ఆయన సమాధానం చెప్పకపోవడంతో.. ‘నీ సర్వీస్ ఇంకా ఎన్ని రోజులు ఉంది? మేము అధికారంలోకి వస్తే మీ పని పనిపడతాం’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. -
జేసీ వర్గీయుల అక్రమాలు బట్టబయలు
సాక్షి, అనంతపురం : తాడిపత్రిలో జేసీ వర్గీయుల అవినీతి బయటపడిండి. మున్సిపల్ కాంప్లెక్స్ లీజులో జేసీ వర్గీయులు రూ.75 లక్షల స్వాహా చేసినట్టు తెలిసింది. మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగి శ్రీనివాస్ ద్వారా వారు అక్రమాలు చేయించినట్టు వెల్లడైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమీక్షా సమావేశంలో జేసీ వర్గీయుల దందా వెలుగు చూసింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఇకపై అద్దె, డిపాజిట్ సొమ్ము నేరుగా మున్సిపాలిటీకే చెల్లించాలని సూచించారు. -
వైఎస్సార్సీపీ ఏజెంట్లకు వార్నింగ్
అనంతపురం, తాడిపత్రి: తాడిపత్రి సీఐ నారాయణరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను పోలీసుస్టేషన్‌కు రావాలని బెదిరించిన ఆడియో టేపులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. జేసీ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సీఐ నారాయణరెడ్డిపై ఆరోపణలు రావడంతో ఈసీ పోలింగ్‌కు ముందే ఎన్నికల విధుల నుండి ఆయన్ను తప్పించింది. అయినా కూడా సీఐ నారాయణరెడ్డి పోలింగ్ రోజున వైఎస్సార్సీపీ ఏజెంట్లపై బెదిరింపులకు దిగారు. తాడిపత్రి మండల పరిధిలోని యర్రగుంట్లలో పోలింగ్ ఏజెంట్ కిషోర్‌ను పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ ఫోనులో హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఆడియో టేపులు ఆలస్యంలో వెలుగులోకి వచ్చాయి. పోలింగ్ అనంతరం ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సిఐ నారాయణరెడ్డి... తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అండదండలతో రెచ్చిపోతున్నారు. ఈ విషయంలో సిఐ నారాయణరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. తమ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని అకారణంగా దాడి చేశారని సీఐ నారాయణరెడ్డిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఫిర్యాదు చేసి 24 గంటలు గడుస్తున్నా సీఐ నారాయణరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నట్లు సమాచారం. జేసీ బ్రదర్స్ సూచనల మేరకే పోలీసులు నడుచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. -
వైఎస్సార్‌సీపీతోనే రాజన్న రాజ్యం
సాక్షి, తాడిపత్రి అర్బన్: వైఎస్సార్‌సీపీతోనే రాజన్న రాజ్యం రానుందని కేతిరెడ్డి సాయిప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం నందలపాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా, వారు ప్రతి గడపకూ తిరుగుతూ నవరత్న పథకాలను ప్రజలకు వివరించారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య, వైఎస్సార్సీపీ జిల్లా ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, జిల్లా ఎస్సీసెల్ జనరల్ సెక్రటరీ పూల బాలరాజు, అనంతపురం పార్లమెంట్ ఎస్సీసెల్ సెక్రెటరీ సునీల్ కుమార్, పేరం ప్రతాప్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ బాలరాజు, నాగభూషణ ం, అలీ, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో.. యల్లనూరు రోడ్డు, జయనగర్ కాలనీలలో బుధవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి జబ్బార్ బాష, సాంస్కృతిక విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌నాయుడు, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శులు నరసింహారెడ్డి, భాస్కర్‌రెడ్డి, వరప్రసాద్, నాగిరెడ్డి, రామకృష్ణారెడ్డి, తేజ, రఫీ పాల్గొన్నారు. కేతిరెడ్డి రమాదేవి, రాష్ట్ర మహిళా కార్యదర్శి ఆధ్వర్యంలో.. పట్టణంలోని గాజుల క్రిష్టప్ప వీధి, గాంధీనగర్, వాటర్ వర్క్స్ రోడ్డు ప్రాంతాల్లో కేతిరెడ్డి రమాదేవి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి పేరం స్వర్ణలత ఆధ్వర్యంలో, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాడిపత్రి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్మిక శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాథరెడ్డి, అనంతపురం పార్లమెంట్ జిల్లా మహిళా విభాగం కార్యదర్శులు వసంతం మౌళేశ్వరి, నాగూర్, షరీఫా, అనంతపురం పార్లమెంట్ జిల్లా బీసీసెల్ జనరల్ సెక్రెటరీ వెంకటేష్, ఓబులరెడ్డి, పేరం అమర్నాథరెడ్డి, చిన్న కాంతమ్మ, అశోక్‌రెడ్డి, చరణ్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. తాడిపత్రి మండలంలో.. మండలంలోని భోగసముద్రం, బుగ్గ గ్రామాల్లో , తాడిపత్రి నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని గెలిపించాలని, నియోజకవర్గ యూత్ కన్వీనర్ అయ్యవారిపల్లి రామ్మోహన్ రెడ్డి గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో సోమేశ్వర్‌రెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, బుగ్గ రాజు, రామకృష్ణ, శ్రీను, నారాయణస్వామి, లక్ష్మయ్య, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
బుద్ధి చిన్నది.. నోరు పెద్దది!
బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడు.. రాజకీయాల్లో సీనియర్ నేత. కానీ మాటలన్నీ మురికే. నీతులు వళ్లిస్తాడు.. బూతులే ఎక్కువ మాట్లాడతాడు. పక్కన మహిళలు ఉన్నారనే స్పృహ కూడా ఉండదు. నోరు తెరిస్తే ‘ల..కొడుకు’ అనే మాటతోనే మొదలుపెడతాడు. ఎన్నికల్లో కుమారుడిని రంగంలోకి దింపిన జేసీ.. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే ఓటర్లపైనా కన్నెర్ర చేస్తున్నాడు. ఉచ్ఛనీచాలు మరిచి నోరు పారేసుకుంటున్నాడు. సమస్యలపై ప్రశ్నిస్తే బూతులతో నోరు మూయిస్తున్నాడు. సాక్షి టాస్క్‌ఫోర్స్ : ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు కూడా వాడని పదజాలం ఆయన సొంతం. ప్రశ్నించినా, వ్యతిరేకించినా ఆయన్ను బూతులతో రెచ్చిపోతారు. ఎక్కడ ఉన్నాం? చుట్టూ ఎవరు ఉన్నారనే ధ్యాస కూడా ఉండదు. అవతలి వ్యక్తి ఎవరైనా సరే.. బూతులతో బంబేలెత్తించడమే ఆయన నైజం. చివరికి పోలీసులనైనా.. ‘కొజ్జాలు’గా సంభోదించే సంస్కారం ఆయనది. డబ్బుందనే గర్వం.. అధికార మదంతో మాటలతో రెచ్చిపోతున్న తీరు జిల్లా ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తొలిసారి తన వారసుడిని ఎన్నికల సమరంలో దింపిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. ఎలాగైనా పుత్రున్ని పార్లమెంట్‌కు పంపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. డబ్బువెదజల్లి.. తాయిళాలు పంచి ఓట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా... నువ్వ ‘జేసి’న అభివృద్ధి ఇదీ అంటూ జనం సమస్యల దండకం చదువుతున్నారు. దీంతో జేసీ దివాకర్‌రెడ్డి అసహనంతో రగిలిపోతున్నారు. ప్రశ్నించిన వారిపై బూతుపురాణం అందుకుంటున్నారు. మార్చి 31న ఏం జరిగిందంటే.. పుట్లూరు మండలంలో తన కుమారుడు టీడీపీ అనంతపురం ఎంపీ అభ్యర్థి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీని గెలిపించాలని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పుట్లూరు మండల కేంద్రలోని ప్రధాన సర్కిల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పుట్లూరు మండలంలోని చెరువుకు నీరు రావాలంటే తమకు మెజార్టీ ఇవ్వాలన్నారు. పక్కనే ఉన్న శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిని చూపిస్తూ ఈ అమ్మాయి పోటీలో నిలబడింది.. నీ పేరు ఏంటి అని అభ్యర్థిని అడిగారు. దీంతో పక్కనే ఉన్న టీడీపీ నాయకులు బండారు శ్రావణిశ్రీ అని చెప్పడంతో ఈమెను గెలిపించాలన్నారు. ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న యామినీబాల జేబుల్లో చానా చేతులు పెట్టడంతో మార్పుచేసి ఈ అమ్మాయిని పోటీలో పెట్టామన్నారు. అంతేకానీ ఆ పాప బాగాలేదని కాదు, ఈ పాప బాగుందని కాదు అని ఎగతాళిగా మాట్లాడారు. నా.. కొడకా, తాగి వస్తావా! ఇక వెంకటనారాయణ అనే స్థానికుడు తమకు నీళ్లు లేవని ప్రశ్నించగానే.. జేసీ దివాకర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘నీ.. నా కొడకా, ...తాగి వస్తావా నాదగ్గరికి, .. పగులకొడుతా... నా కొడకా, ఎర్రి.. కొడుకా...’’ అని దూషించారు. ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు ఇతర మహిళలు, గ్రామస్తులు చూస్తుండగానే బూతు పురాణం అందుకున్నారు. ఆపై అతన్ని అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎంపీ సూచన మేరకు వెంకటనారాయణను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరీక్షలు నిర్వహించగా అతను మద్యం సేవించలేదని తేలింది. -
కలిసి జీవించలేక..
సాక్షి, తాడిపత్రి అర్బన్: ఆమె పెళ్లయిన తర్వాత ప్రేమలో పడింది. అయితే కలిసి జీవించడానికి సమాజం ఒప్పుకోదని భావించి ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రి పట్టణంలోని కృష్ణాపురం నాలుగవ రోడ్డుకు చెందిన అఫ్రీన్(21)కు తాడిపత్రి మండలం మిట్టమీద కొట్టాలపల్లికి చెందిన హాజీవలితో రెండేళ్ల కిందట వివాహమైంది. ఇదే కొట్టాలపల్లిలో నివాసం ఉంటున్న మంగలి నరసింహుడితో ఆమెకు చనువు ఏర్పడినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి మండల పరిధిలోని దర్గా ఉరుసులో పాల్గొనేందుకు హాజీవలి తన భార్య అఫ్రీన్‌తో కలసి వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత అఫ్రీన్ ప్రియుడు నరసింహుడితో కలసి దర్గా నుంచి తాడిపత్రికి వచ్చి స్త్రీశక్తి భవన్ వెనుక వైపున ఉన్న రైల్వే ట్రాక్‌పై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
జేసీకి ‘కాక’ర్ల బ్రదర్స్
సాక్షి, తాడిపత్రి అర్బన్: జేసీ సోదరుల పతనం ప్రారంభమైంది. ఇప్పటికే ఆ పార్టీలోని సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా దూరం కాగా.. సొంత ఊళ్లోనే వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. తాజాగా వ్యతిరేక వర్గం కూడా కేతిరెడ్డి తరఫున ప్రచారం చేస్తూ ఒక్కసారి మార్పును కోరుకుందామని ప్రజలను కోరుతున్నారు. ఈ కోవలోనే కాకర్ల రంగనాథ్ సోదరులు మంగళవారం తాడిపత్రి మండలంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ‘‘తాడిపత్రి ప్రాంతంలో జేసీ సోదరుల అరాచకాలకు ఎక్కువయ్యాయి, వాటిని నిలువరించాలంటే వైఎస్సార్ సీపీ తాడిపత్రి అసెంబ్లీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి తలారి పీడీ రంగయ్యకు ఓటు వేయండి.. అందరం ఒక్కసారి మార్పును కోరుకుందాం.. వైఎస్సార్ సీపీని గెలిపిద్దాం’’ అని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదట హుస్సేనాపురం గ్రామానికి కేతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డితో పాటు వచ్చిన కాకర్ల సోదరులకు గ్రామస్తులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి ఘనస్వాగతం పలికారు. కేతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డితో పాటు కాకర్ల రంగనాథ్ సోదరులు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య, కాకర్ల రంగనాథ్ జగన్నాథ్(జయుడు) రంగనాయకులు, కేతిరెడ్డి సాయి ప్రతాప్‌రెడ్డి, జగ్గి సోదరులు జగదీశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్ జయచంద్రారెడ్డి, చిత్తరంజన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వెంకటేష్, రామ్‌శేఖర్, మాజీ కౌన్సిలర్ నాగరంగయ్య, డీఎన్ పెద్దయ్య, మోహన్‌రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
సూత్రధారి జేసీనే
అనంతపురం సప్తగిరి సర్కిల్: తాడిపత్రిలోని ప్రబోధానంద ఆశ్రమంపై పథకం ప్రకారమే దాడులు జరిగాయని, వీటి వెనుక సూత్రధారి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నర్సింహయ్య ధ్వజమెత్తారు. ఆదివారం అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ స్వార్థం, ఆధిపత్యం కోసం జేసీ సోదరులు ప్రజలను పావులుగా వాడుకుని బలి చేస్తున్నారని మండిపడ్డారు. చిన్న పొలమడ, పెద్ద పొలమడ గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. ముందస్తు జాగ్రత్తల్లోనూ విఫలం ఆశ్రమ నిర్వాహకులు, గ్రామస్తులకు మధ్య గతంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం దారుణమని పైలా పేర్కొన్నారు. దాడులు జరిగిన వెంటనే ఎస్పీ అప్రమత్తం కావడంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చిందన్నారు. ప్రబోధానంద స్వామి ఆశ్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన భక్తులే అధికంగా ఉన్నారన్నారు. ఆశ్రమ నిర్వాహకులను, ఆశ్రమాన్ని తమ గుప్పిట్లో ఉంచుకోవాలని ఎమ్మెల్యే జేసీ ప్రయత్నం చేసి, విఫలమైనప్పుడు గ్రామస్తులను అడ్డం పెట్టుకుని గొడవలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై గతంలోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని పైలా అన్నారు. ఎమ్మెల్యే తాను పెద్ద రౌడీని అని చెబుతూ పోలీసులను, పోలీస్ స్టేషన్లపై దాడులను చేస్తుంటారని, ఆయన దారినే అనుచరులూ ఆచరిస్తుంటారని తెలిపారు. ఆయన మితిమీరిన ఆగడాలకు తాడిపత్రి ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో ప్రజా విశ్వాసం కోల్పోయి గొడవల ద్వారా భయోత్పాతం కల్పించి సామాన్య ప్రజల జన జీవనానికి భంగం కల్గిస్తున్నారని మండిపడ్డారు. జేసీ సోదరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే తాడిపత్రిని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి, ఐపీఎస్ అధికారిని నియమించి శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ రాజారాం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు, వైఎస్సార్సీపీ నాయకులు రామశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రబోధాశ్రమంపై ఎంపీ జేసీ అనుచరుల దాడి
-
అట్టుడుకుతున్న తాడిపత్రి
తాడిపత్రి/అనంతపురం న్యూసిటీ: వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పడిన వివాదంతో తాడిపత్రి అట్టుడుకుతోంది. శనివారం ఇరువర్గాలు పరస్పరంగా దాడి చేసుకోగా.. ఆదివారం ఉదయమే ఎంపీ జేసీ అనుచరులు ప్రబోధాశ్రమంపై దాడికి తెగబడ్డారు. విచక్షణ రహితంగా ఆశ్రమంలోకి చొరబడి కనిపించిన వారినల్లా చితకబాదారు. భక్తులు కూడా ఎదురుదాడికి దిగడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయగా పోలీసులు ఆందోళనకారులపై భాష్పవాయువును ప్రయోగించారు. దాడుల్లో పలువురు గాయపడగా ఒకరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అనుచరులతో శనివారం ఘర్షణ జరిగిన చిన్నపొలమడ గ్రామానికి వెళ్లారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అడ్డుకోవడంతో ప్రబోధాశ్రమం సమీపంలోని రోడ్డుపైనే ఎంపీ జేసీ అనుచరులతో బైఠాయించి ఆశ్రమ నిర్వాహకులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. శనివారం రాత్రి జరిగిన ఘర్షణలో దహనమైన ట్రాక్టర్లను పరిశీలించారు. బాధితులకు నష్టపరిహారం అందజేసి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. డీఎస్పీ విజయ్‌కుమార్ ఎంపీ జేసీకి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. పలాయనం చిత్తగించిన జేసీ ఇరువర్గాల ఘర్షణల్లో 15 మంది గాయపడ్డారు. ఈ క్రమంలోనే అసలు ఘర్షణకు ప్రధాన కారణం జేసీ దివాకర్‌రెడ్డేనని భావించిన ఆశ్రమ భక్తులు.. ఎంపీ జేసీ కూర్చున్న టెంట్ వద్దకు దూసుకొచ్చి దాడి చేయబోయారు. పరిస్థితి అదుపుతప్పడంతో జేసీ అక్కడి నుంచి తన వాహనంలో పలాయనం చిత్తగించాడు. పోలీసుల వైఖరికి నిరసనగా ఎంపీ జేసీ ధర్నా భక్తుల ఆగ్రహంతో చిన్నపొలమడ నుంచి తన వాహనంలో వెనుదిరిగి వచ్చిన జేసీ దివాకర్‌రెడ్డి అనుచరులతో కలిసి పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. తన అనుచరులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి ఆశ్రమంలోని భక్తులను ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్లే దాడులు జరిగాయని ధ్వజమెత్తారు. దీంతో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు ముందు జాగ్రత్తగా సమీపంలోని దుకాణాలన్నింటిని మూసివేయించారు. ఓ డీఐజీ.. ఇద్దరు ఎస్పీలు శనివారం రాత్రి నుంచే జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తాడిపత్రిలో ఉండి పరిస్థితి సమీక్షించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు కూడా తాడిపత్రికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ తాడిపత్రి రూరల్ స్టేషన్ కూర్చొని పరిస్థితి సమీక్షించగా... చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు చిన్నపొలమడలో బందోబస్తును పర్యవేక్షించారు. మరోవైపు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్న రాయలసీమ ఇన్చార్జి డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ చిన్నపొలమడ గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కొట్టొచ్చిన పోలీసుల వైఫల్యం శనివారం రాత్రి జరిగిన సంఘటనతో మేల్కోవాల్సిన పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టకుండా నిర్లక్ష్య వైఖరి అవలంభిండచం వల్లే ఆదివారం ఆశ్రమంపై దాడి జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్టు చేయకపోగా... చిన్నపొలమడ గ్రామానికి అనుమతించడం వల్లనే తిరిగి ఘర్షణలు తలెత్తాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంపీ దివాకర్‌రెడ్డి అక్కడే టెంట్ వేసుకుని కూర్చోవడానికి పోలీసులు అనుమతి నిరాకరించి ఉంటే కూడా పరిస్థితి ఇంత దూరం వచ్చేదికాదని అంటున్నారు. క్షతగాత్రుల్లో ఒకరు మృతి ఇరువర్గాల దాడుల్లో తీవ్రంగా గాయపడిన పెద్దపొలమడకు చెందిన వెంకటరాముడు(40) అలియాస్ పక్కీరప్ప మృతి చెందాడు. దాడుల్లో ఇంకా పలువురు గాయపడగా... అందులో తీవ్రంగా గాయపడిన ఏడుగురిని (పెద్దిరెడ్డి, చిన్నరాముడు, రామాంజినేయులు, రమణ, అర్జున్, కృష్ణ రంగయ్య, శివకుమార్) అనంతపురంలోని క్రాంతి ఆస్పత్రిలో చేర్చారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. ఆస్పత్రి వద్ద పోలీసుల పహారా కాస్తున్నారు. తాడిపత్రి ఘటనపై విచారణ కమిటీ పెద్దపొడమల ఘటనపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ విచారణకు ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ –2 ఆధ్వర్యంలో అనంతపురం ఆర్డీఓ, తాడిపత్రి డీఎస్పీ సభ్యులుగా కమిటీ వేసినట్లు ఆదివారం కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపీ సమక్షంలోనే ఆశ్రమంపై దాడి శనివారం ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆశ్రమంలోని భక్తులను ఎవరినీ బయటకు రానీయకుండా భవనంలో తలుపులు మూసివేశారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఎంపీ జేసీ... అక్కడే టెంట్ వేసుకుని బైఠాయించారు. అదే సమయంలో ఆయన అనుచరులు సుమారు 500 మంది ఆశ్రమంలోకి చొరబడి వాహనాలను, సామగ్రిని దహనం చేశారు. అడ్డొచ్చిన భక్తులపై విచక్షణ రహితంగా రాడ్లు, పైపులతో దాడులకు తెగబడ్డారు. దీంతో భవనాల్లో ఉన్న భక్తులు తలుపులను పగులగొట్టుకొని బయటికి వచ్చి జేసీ సోదరుల అనుచరులపై ప్రతిదాడులకు దిగారు. పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో జేసీ వర్గీయులకు చెందిన టాటా సఫారీ, రెండు మారుతీ కార్లు పూర్తిగా ధ్వంసం కాగా... 10 ద్విచక్రవాహనాలు కాలి బూడిదైపోయాయి. మరో 20 ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. అయితే అంత వరకు ప్రేక్షకపాత్ర పోషించిన పోలీసులు బలగాలు ఒక్కసారిగా ప్రబోధాశ్రమ భక్తులపై బాష్పవాయువును ప్రయోగించారు. -
అడ్డుకునే వారెవరు?
తాడిపత్రిలో రాజకీయ అండదండలతో మట్కా జోరందుకుంది. ఒకప్పుడు చీకటిమాటున సాగిన మట్కా.. నేడు బహిరంగంగా కొనసాగుతోంది. సులువుగా డబ్బు సంపాదించొచ్చంటూ అమాయకులను ఉచ్చులోకి దింపి వారిని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. అరికట్టాల్సిన పోలీసులు నిర్వాహకులను వదిలి పొట్టకూటి కోసం బీటర్లుగా అవతారమెత్తిన వారిపై ప్రతాపం చూపుతున్నారు. తాడిపత్రి: తాడిపత్రి కేంద్రంగా మట్కా సాగుతోంది. నిర్వాహకులు మాఫియాగా ఏర్పడ్డారు. వీరికి రాజకీయ అండదండలతోపాటు పోలీసుల సహకారమూ ఉండటంతో మట్కా కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 12 నుంచి ఇప్పటి వరకు దాడులు చేసినప్పటికీ చిన్నా చితక బీటర్లను అదుపులోకి తీసుకున్నారే కానీ నిర్వాహకులను అరెస్ట్ చేయలేదు. మట్కా మహమ్మారిని కూకటి వేళ్లతో నిర్మూలించేందుకు కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. నిఘా పక్కదారి అసాంఘిక కార్యకలాపాలను ముందస్తుగా పసిగట్టి వాటిని ఉన్నతాధికారుల దృష్టికి చేరవేయాల్సిన ఐడీ పార్టీ సిబ్బంది తప్పుడు సమాచారంతో పోలీసులను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఐడీ పార్టీలోని కొంత మంది సిబ్బందికి పట్టణంలోని మట్కా నిర్వాహకులతో సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. మట్కా కంపెనీలు చెప్పినట్లు విని పోలీసు అధికారుల దృష్టి మట్కా నిర్వాహకులపై మళ్లకుండా ఉండేందుకు చిన్నాచితకా బీటర్ల సమాచారాన్ని మాత్రమే చేరవేస్తున్నట్లు సమాచారం. నిర్వాహకులపై చర్యలేవీ? రాజకీయ అండదండలు లేని తమపై పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారని బీటర్లు వాపోతున్నారు. తాడిపత్రి ప్రాంతంలో ఎవరు ఎక్కడ మట్కా కంపెనీలు నిర్వహిస్తున్నారన్న విషయం ప్రతి కానిస్టేబుల్‌కూ తెలిసినా వారిపై చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. అసలైన నిర్వాహకులను అరెస్టు చేస్తే బీటర్లు చీటీలు రాసేందుకు అవకాశమే ఉండదని పలువురు బీటర్లు అంటున్నారు. -
తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా పెద్దారెడ్డి
– రాష్ట్ర కార్యదర్శులుగా వీఆర్ రామిరెడ్డి, రమేశ్‌రెడ్డి – యువజనవిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ధనుంజయయాదవ్ – యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఆలూరి సాంబశివారెడ్డి అనంతపురం : వైఎస్సార్కాంగ్రెస్పార్టీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్తగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వీఆర్ రామిరెడ్డి, రమేశ్‌రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా నియమించింది. దీంతో పాటు జిల్లా యువజన విభాగంలోనూ మార్పులు చేసింది. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ధనుంజయాదవ్ను ఈ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఆలూరి సాంబశివారెడ్డి నియమించారు. అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు: వైఎస్సార్సీపీ పార్టీ తన పేరును ప్రకటించడంతో శుక్రవారం సాయంత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలసి తాడిపత్రి పట్టణంలోని చింతల వెంటకరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన సాక్షితో మాట్లాడారు. నాపై నమ్మకంతో తాడిపత్రి నియోజక వర్గ బాధతలు అప్పగించిందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, రాష్ట్ర , జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాద్యతలను సమర్థవంతంగా నిర్వహించి, పార్టీ ఉన్నతి కోసం శ్రమిస్తామన్నారు. 2019 ఎన్నికల్లో తాడిపత్రిలో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని తెలిపారు. పార్టీ నాయకులు ఎం.ఎ.రంగారెడ్డి, కంచంరామ్మోహన్రెడ్డి, పాలెం వెంకట్రామిరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, చావ్వా రాజశేఖర్‌రెడ్డి, కిరణ్, ఓబుళరెడ్డి, వెంటేశ్ తదితరులు ఉన్నారు. నేడు వైఎస్సార్ విగ్రహానికి నివాళి వైఎస్సార్సీపీ తాడిపత్రి నియోజక వర్గ సమన్వయకర్తగా నూతనంగా బాధతలు స్వీకరించిన కెతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్లో ఉన్న జననేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి శనివారం ఉదయం ఘనంగా నివాళులర్పించనున్నారు. ఆయన స్వగ్రామం యల్లనూరు మండలం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వస్తారు. మొదట వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలాలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం గాంధీజీ, చాల్ల సుబ్బరాయుడు, అంబేడ్కర్ విగ్రహాలకు కూడా పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.