వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పడిన వివాదంతో తాడిపత్రి అట్టుడుకుతోంది. శనివారం ఇరువర్గాలు పరస్పరంగా దాడి చేసుకోగా.. ఆదివారం ఉదయమే ఎంపీ జేసీ అనుచరులు ప్రబోధాశ్రమంపై దాడికి తెగబడ్డారు. విచక్షణ రహితంగా ఆశ్రమంలోకి చొరబడి కనిపించిన వారినల్లా చితకబాదారు. భక్తులు కూడా ఎదురుదాడికి దిగడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయగా పోలీసులు ఆందోళనకారులపై భాష్పవాయువును ప్రయోగించారు. దాడుల్లో పలువురు గాయపడగా ఒకరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అనుచరులతో శనివారం ఘర్షణ జరిగిన చిన్నపొలమడ గ్రామానికి వెళ్లారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అడ్డుకోవడంతో ప్రబోధాశ్రమం సమీపంలోని రోడ్డుపైనే ఎంపీ జేసీ అనుచరులతో బైఠాయించి ఆశ్రమ నిర్వాహకులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. శనివారం రాత్రి జరిగిన ఘర్షణలో దహనమైన ట్రాక్టర్లను పరిశీలించారు. బాధితులకు నష్టపరిహారం అందజేసి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. డీఎస్పీ విజయ్‌కుమార్ ఎంపీ జేసీకి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు.