అట్టుడుకుతున్న తాడిపత్రి | JC Diwakar Reddy followers attack on the prabodha ashramam | Sakshi
Sakshi News home page

అట్టుడుకుతున్న తాడిపత్రి

Published Mon, Sep 17 2018 5:36 AM | Last Updated on Mon, Sep 17 2018 7:09 AM

JC Diwakar Reddy followers attack on the prabodha ashramam - Sakshi

ప్రబోధాశ్రమంపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడుతున్న జేసీ అనుచరులు (ఇన్‌సెట్‌లో) మృత్యువాత పడిన వెంకటరాముడు

తాడిపత్రి/అనంతపురం న్యూసిటీ: వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పడిన వివాదంతో తాడిపత్రి అట్టుడుకుతోంది. శనివారం ఇరువర్గాలు పరస్పరంగా దాడి చేసుకోగా.. ఆదివారం ఉదయమే ఎంపీ జేసీ అనుచరులు ప్రబోధాశ్రమంపై దాడికి తెగబడ్డారు. విచక్షణ రహితంగా ఆశ్రమంలోకి చొరబడి కనిపించిన వారినల్లా చితకబాదారు. భక్తులు కూడా ఎదురుదాడికి దిగడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయగా పోలీసులు ఆందోళనకారులపై భాష్పవాయువును ప్రయోగించారు. దాడుల్లో పలువురు గాయపడగా ఒకరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి  అనుచరులతో శనివారం ఘర్షణ జరిగిన చిన్నపొలమడ గ్రామానికి వెళ్లారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అడ్డుకోవడంతో ప్రబోధాశ్రమం సమీపంలోని రోడ్డుపైనే ఎంపీ జేసీ అనుచరులతో బైఠాయించి ఆశ్రమ నిర్వాహకులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. శనివారం రాత్రి జరిగిన ఘర్షణలో దహనమైన ట్రాక్టర్లను పరిశీలించారు. బాధితులకు నష్టపరిహారం అందజేసి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. డీఎస్పీ విజయ్‌కుమార్‌ ఎంపీ జేసీకి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు.

పలాయనం చిత్తగించిన జేసీ
ఇరువర్గాల ఘర్షణల్లో 15 మంది గాయపడ్డారు. ఈ క్రమంలోనే అసలు ఘర్షణకు ప్రధాన కారణం జేసీ దివాకర్‌రెడ్డేనని భావించిన ఆశ్రమ భక్తులు.. ఎంపీ జేసీ కూర్చున్న టెంట్‌ వద్దకు దూసుకొచ్చి దాడి చేయబోయారు. పరిస్థితి అదుపుతప్పడంతో జేసీ అక్కడి నుంచి తన వాహనంలో పలాయనం చిత్తగించాడు.
 
పోలీసుల వైఖరికి నిరసనగా ఎంపీ జేసీ ధర్నా
భక్తుల ఆగ్రహంతో చిన్నపొలమడ నుంచి తన వాహనంలో వెనుదిరిగి వచ్చిన జేసీ దివాకర్‌రెడ్డి అనుచరులతో కలిసి పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. తన అనుచరులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి ఆశ్రమంలోని భక్తులను ఖాళీ చేయించాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్లే దాడులు జరిగాయని ధ్వజమెత్తారు. దీంతో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు ముందు జాగ్రత్తగా సమీపంలోని దుకాణాలన్నింటిని  మూసివేయించారు.
 
ఓ డీఐజీ.. ఇద్దరు ఎస్పీలు
శనివారం రాత్రి నుంచే జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ తాడిపత్రిలో ఉండి పరిస్థితి సమీక్షించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు కూడా తాడిపత్రికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ తాడిపత్రి రూరల్‌ స్టేషన్‌ కూర్చొని పరిస్థితి సమీక్షించగా... చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు చిన్నపొలమడలో బందోబస్తును పర్యవేక్షించారు. మరోవైపు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్న రాయలసీమ ఇన్‌చార్జి డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ చిన్నపొలమడ గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

కొట్టొచ్చిన పోలీసుల వైఫల్యం
శనివారం రాత్రి జరిగిన సంఘటనతో మేల్కోవాల్సిన పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టకుండా నిర్లక్ష్య వైఖరి అవలంభిండచం వల్లే ఆదివారం ఆశ్రమంపై దాడి జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని ముందస్తుగా పోలీసులు హౌస్‌ అరెస్టు చేయకపోగా... చిన్నపొలమడ గ్రామానికి అనుమతించడం వల్లనే తిరిగి ఘర్షణలు తలెత్తాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంపీ దివాకర్‌రెడ్డి అక్కడే టెంట్‌ వేసుకుని కూర్చోవడానికి పోలీసులు అనుమతి నిరాకరించి ఉంటే కూడా పరిస్థితి ఇంత దూరం వచ్చేదికాదని అంటున్నారు.

క్షతగాత్రుల్లో ఒకరు మృతి 
ఇరువర్గాల దాడుల్లో తీవ్రంగా గాయపడిన పెద్దపొలమడకు చెందిన వెంకటరాముడు(40) అలియాస్‌ పక్కీరప్ప మృతి చెందాడు. దాడుల్లో ఇంకా పలువురు గాయపడగా... అందులో తీవ్రంగా గాయపడిన ఏడుగురిని (పెద్దిరెడ్డి, చిన్నరాముడు, రామాంజినేయులు, రమణ, అర్జున్, కృష్ణ రంగయ్య, శివకుమార్‌) అనంతపురంలోని క్రాంతి ఆస్పత్రిలో చేర్చారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. ఆస్పత్రి వద్ద పోలీసుల పహారా కాస్తున్నారు.

తాడిపత్రి ఘటనపై విచారణ కమిటీ 
పెద్దపొడమల ఘటనపై జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ విచారణకు ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ –2 ఆధ్వర్యంలో అనంతపురం ఆర్డీఓ, తాడిపత్రి డీఎస్పీ సభ్యులుగా కమిటీ వేసినట్లు ఆదివారం కలెక్టర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.  

ఎంపీ సమక్షంలోనే ఆశ్రమంపై దాడి
శనివారం ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆశ్రమంలోని భక్తులను ఎవరినీ బయటకు రానీయకుండా భవనంలో తలుపులు మూసివేశారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఎంపీ జేసీ... అక్కడే టెంట్‌ వేసుకుని బైఠాయించారు. అదే సమయంలో ఆయన అనుచరులు సుమారు 500 మంది ఆశ్రమంలోకి చొరబడి వాహనాలను, సామగ్రిని దహనం చేశారు. అడ్డొచ్చిన భక్తులపై విచక్షణ రహితంగా రాడ్లు, పైపులతో దాడులకు తెగబడ్డారు. దీంతో భవనాల్లో ఉన్న భక్తులు తలుపులను పగులగొట్టుకొని బయటికి వచ్చి జేసీ సోదరుల అనుచరులపై ప్రతిదాడులకు దిగారు. పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో జేసీ వర్గీయులకు చెందిన టాటా సఫారీ, రెండు మారుతీ కార్లు పూర్తిగా ధ్వంసం కాగా... 10 ద్విచక్రవాహనాలు కాలి బూడిదైపోయాయి. మరో 20 ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. అయితే అంత వరకు ప్రేక్షకపాత్ర పోషించిన పోలీసులు బలగాలు ఒక్కసారిగా ప్రబోధాశ్రమ భక్తులపై బాష్పవాయువును ప్రయోగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement